Trump Targets Samsung: శాంసంగ్‌నూ వదిలిపెట్టని ట్రంప్.. ఘాటు హెచ్చరిక జారీ
ABN , Publish Date - May 24 , 2025 | 12:02 PM
అమెరికాలో విక్రయించే ఫోన్లను అమెరికాలోనే తయారీ చేయాలని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. లేకపోతే శాంసంగ్ సంస్థపైనా 25 శాతం టారిఫ్ విధిస్తామని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా శాంసంగ్‌ను టార్గెట్ చేసుకున్నారు. అమెరికాలో విక్రయించే ఫోన్లు అక్కడే తయారు చేయాలని స్పష్టం చేశారు. విదేశాల్లో తయారైన ఫోన్లపై 25 శాతం సుంకం తప్పదని తేల్చి చెప్పారు.
వైట్ హౌస్‌లో జరిగిన పత్రికా సమావేశంలో ఈ విషయాన్ని మరోసారి పేర్కొన్నారు. అమెరికాలో ఫోన్లు విక్రయించే సంస్థలన్నిటికీ ఈ సుంకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ‘‘ఇది న్యాయం. శాంసంగ్ కానీ మరే సంస్థ అయినా కానీ.. ఇక్కడ తయారీ యూనిట్లు నిర్మిస్తే టారిఫ్‌లు ఉండవు’’ అని అన్నారు.
ఇక భారత్‌లో ఐఫోన్‌ల తయారీ వైపు మొగ్గు చూపుతున్న యాపిల్‌పై కూడా ట్రంప్ ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే. ‘‘ ఈ విషయాన్ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు ఎప్పుడో చెప్పా ఐఫోన్‌లు అమెరికాలోనే తయారవ్వాలని స్పష్టం చేశా. అమెరికాలో విక్రయించే ఫోన్లు అమెరికాలోనే తయారు చేయాలి.. ఇండియా లేదా మరో దేశంలో కాదు. ఇతర దేశాల్లో తయారు చేసే ఫోన్లపై కచ్చితంగా 25 శాతం సుంకం ఉంటుంది. ఇది యాపిల్ చెల్లించక తప్పదు’’ అని అన్నారు.
ఈ ప్రకటన తరువాత యాపిల్ షేర్లు కుదుపునకు లోనయ్యాయి. 2.6 శాతం మేర షేర్‌ల విలువ తగ్గడంతో కంపెనీ మార్కెట్ విలువలో ఏకంగా 70 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది.
విశ్లేషకులు చెప్పే దాని ప్రకారం, యాపిల్ స్మార్ట్ ఫోన్లలో 90 శాతం చైనాలో అసెంబుల్ అవుతుంటాయి. అయితే, వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనాపై ఆధారపడటం సబబు కాదని భావించిన యాపిల్ తన ఐఫోన్ అసెంబ్లీ కార్యకలాపాలను భారత్‌లో చేపట్టేందుకు నిర్ణయించింది. ఇటీవల జరిగిన మీటింగ్‌లో సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయాల నేపథ్యంలో యాపిల్ స్పీడుకు బ్రేకులు పడతాయా అన్న ఉత్కంఠ నెలకొంది.
ఇక దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ చైనాలో ఎటువంటి తయారీ కార్యకలాపాలు నిర్వహించట్లేదు. చైనాలోని తన చివరి ప్లాంట్‌ను 2019లోనే మూసేసింది. ప్రస్తుతం శాంసంగ్ ఫోన్లను భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్ దేశాల్లో తయారు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
భారీ ఖండాంతర క్షిపణిని పరీక్షించిన అమెరికా.. వీడియో వైరల్
మరో వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్‌లో ఐఫోన్‌లు తయారు చేస్తే..