Trump Pharma Tariffs: ఫార్మాపై 200 శాతం సుంకాలు
ABN , Publish Date - Sep 03 , 2025 | 03:18 AM
ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దిగుమతి చేసుకునే ఔషధాలపై 200 శాతం వరకు సుంకాలు విధించాలని ట్రంప్ అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఇదే జరిగితే...
డొనాల్డ్ ట్రంప్ సన్నాహాలు
టారిఫ్స్ అమల్లోకి వస్తే ఔషధ ధరలు 50% పెరిగే చాన్స్
న్యూఢిల్లీ: ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. దిగుమతి చేసుకునే ఔషధాలపై 200 శాతం వరకు సుంకాలు విధించాలని ట్రంప్ అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఇదే జరిగితే అమెరికా మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడిన భారత ఫార్మా కంపెనీలకు ఆ మార్కెట్ దాదాపుగా మూసుకుపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ట్రంప్ సర్కారు ఔషధ దిగుమతులను సుంకాల నుంచి మినహాయించింది. తాజా ప్రతిపాదన అమలుకు నోచుకుంటే, అది భారత ఫార్మాకు చావు దెబ్బ అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అన్ని రకాల ఔషధ దిగుమతులపై కాకుండా.. ఎంపిక చేసిన కొన్ని ఔషధ దిగుమతులపైనే ఈ సుంకాల పోటు ఉంటుందనే అంచనాలూ వినిపిస్తున్నాయి.
అమలు కష్టమే ?
అయితే ట్రంప్ సర్కారు ప్రతిపాదన అమలు చేయడం అంత తేలిక కాదనే వాదన వినిపిస్తోంది. అమెరికాలోనే ఈ ఔషధాలను ఉత్పత్తి చేయాలంటే అందుకు ఎంత లేదన్నా కనీసం రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది. ఉత్పత్తి వ్యయం మన దేశంతో పోలిస్తే కనీసం 30 నుంచి 40 శాతం పెరుగుతుంది. కంపెనీలు ఈ భారాన్ని వినియోగదారులకే బదిలీ చేయాల్సి ఉంటుంది. దాంతో అమెరికాలో ఆరోగ్య బీమా ప్రీమియంలు పెరిగి పోతాయని భావిస్తున్నారు. ఒకవేళ ప్రతిపాదించిన విధంగా దిగుమతి ఔషధాలపై 200 శాతం సుంకాలు విధించినా, అమెరికా రిటైల్ మార్కెట్లో ఔషధాల ధర 40 నుంచి 56 శాతం వరకు పెరుగుతాయని అంచనా. దీంతో అసలు ఈ ప్రతిపాదన అమలు చేసేందుకు ట్రంప్ సర్కారు సాహసిస్తుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న నిల్వలు
ఈ ప్రతిపాదన వెలుగులోకి రావడంతో అమెరికాలోని రిటైల్ మెడికల్ చెయిన్స్ పెద్దఎత్తున దిగుమతులు ప్రారంభించాయి. కనీసం ఆరు నెలల నుంచి ఏడాదిన్నర వరకు సరిపోయేలా ఔషధాలను నిల్వ చేసుకుంటున్నాయి. అమెరికాకు ఇటీవల భారత ఔషధ ఎగుమతుల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్.. నెస్లే సీఈఓ తొలగింపు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి