Tech Mahindras Q2 Profit: టెక్ మహీంద్రా లాభం రూ 1195 కోట్లు
ABN , Publish Date - Oct 15 , 2025 | 02:37 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) టెక్ మహీంద్రా నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం తగ్గి రూ.1,194.5 కోట్లకు పరిమితమైంది...
క్యూ2లో 4.5 శాతం తగ్గుదల
రూ.13,995 కోట్లకు పెరిగిన ఆదాయం
ఒక్కో షేరుకు రూ.15 మధ్యంతర డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) టెక్ మహీంద్రా నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం తగ్గి రూ.1,194.5 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి కంపెనీ రూ.1,250 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా, ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో గడించిన రూ.1,141 కోట్ల లాభంతో పోలిస్తే 4.7 శాతం వృద్ధి నమోదైంది. ఈ క్యూ2లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.1 శాతం పెరిగి రూ.13,995 కోట్లకు చేరింది. క్యూ1తో పోలిస్తే రెవెన్యూ 4.8 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు రూ.5 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.15 (300 శాతం) మధ్యంతర డివిడెండ్ చెల్లించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు అర్హులైన షేర్‌హోల్డర్లను ఎంపిక చేసేందుకు ఈ నెల 21 రికార్డు తేదీగా నిర్ణయించింది. వచ్చే నెల 12 లేదా ఆ లోపు డివిడెండ్ చెల్లించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. మరిన్ని విషయాలు..
ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఈ క్యూ2లో అమెరికా మార్కెట్ నుంచి ఆదాయం 2 శాతానికి పైగా తగ్గిందని, కంపెనీకి కీలకమైన టెలికాం రంగం నుంచి రాబడి 2.5 శాతం తగ్గిందని టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ మోహిత్ జోషి తెలిపారు. మాన్యుఫాక్చరింగ్, బీఎ్‌ఫఎ్‌సఐ రంగాల ఆదాయం మాత్రం వరుసగా 5.2 శాతం, 6.5 శాతం పెరిగిందన్నారు.
గడిచిన త్రైమాసికంలో 81.6 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్ దక్కించుకున్నట్లు, వార్షిక ప్రాతిపదికన డీల్స్ విలువ 57 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది.
గత త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,559 తగ్గి 1.52 లక్షలకు పరిమితమైంది.
హెచ్1బీ వీసా ఫీజు పెంపు ప్రభావం పరిమితమే..
అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడం వల్ల కంపెనీపై ప్రభావం చాలా పరిమితంగా ఉండనుందని టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి అన్నారు. అమెరికాలో కంపెనీ కోసం పనిచేస్తున్న వారిలో కేవలం ఒక శాతమే హెచ్1బీ వీసాదారులని ఆయన తెలిపారు. కాగా కంపెనీకి అమెరికాయే అతిపెద్ద మార్కెట్. సంస్థ ఆదాయంలో 45 శాతం ఈ మార్కెట్ నుంచే సమకూరుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News