భారత్‌లో స్టార్‌లింక్ సేవలు..
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:33 AM
భారత్‌లోని తన కస్టమర్లకు స్టార్‌లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీ...
ఎయిర్‌టెల్‌తో స్పేస్‌ఎక్స్ జట్టు
రిలయన్స్ జియోకు గట్టి పోటీ!!
న్యూఢిల్లీ: భారత్‌లోని తన కస్టమర్లకు స్టార్‌లింక్ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు దేశీయ ప్రైవేట్ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్ మంగళవారం ప్రకటించింది. అయితే, భారత్‌లో స్టార్‌లింక్ సేవలందించేందుకు స్పేస్‌ఎక్స్ లైసెన్సు పొందడంపై ఈ ఒప్పందం ఆధాపడి ఉంటుందని ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. స్టార్‌లింక్ సేవలకు అవసరమైన లైసెన్సు దరఖాస్తును భారత ప్రభుత్వం ఇంకా సమీక్షిస్తోంది. స్టార్‌లింక్ మాతృసంస్థే స్పేస్‌ఎక్స్. ప్రధాని మోదీ గత నెలలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా మస్క్‌తోనూ భేటీ అయ్యారు. ఆ సందర్భంగా స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఆవిష్కరణలు తదితర అంశాలపై చర్చించారు. తర్వాత కొద్ది వారాలకే మస్క్ కు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా, స్పేస్‌ఎక్స్ భారత్‌లోకి ప్రవేశించేందుకు వేగంగా పావులు కదుపుతుండటం గమనార్హం.
నీకు నేను.. నాకు నువ్వు
ఈ భాగస్వామ్యంలో భాగంగా ఇరు సంస్థలు కలిసి స్టార్‌లింక్ సేవలు ఎయిర్‌టెల్ సర్వీసుల కు ఏ విధంగా తోడ్పడతాయి..? భారత్‌లో స్పేస్‌ఎక్స్ నేరుగా సేవలందించేందుకు ఎయిర్‌టెల్ అనుభవం ఏ విధంగా దోహదపడుతుందని పరిశీలించనున్నాయి. భారత్‌లోని ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్టార్‌లింక్ సేవలందించేందుకు స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేయడం కీలక మైలురాయి అని, భవిష్యత్ తరం శాటిలైట్ సేవలందించే విషయంలో కంపెనీ నిబద్ధతకు ఇది నిదర్శనమని భారతీ ఎయిర్‌టెల్ ఎండీ, వైస్ చైర్మన్ గోపాల్ విఠల్ అన్నారు. దేశంలోని ప్రస్తుతం ఇంటర్నెట్ సౌకర్యం లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లోనూ తమ కంపెనీ గరిష్ఠ వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలందించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుందన్నారు.
పరస్పర ప్రయోజనాలపై పరిశీలన
ఈ ఒప్పందంలో భాగంగా స్పేస్‌ఎక్స్.. ఎయిర్‌టెల్ ద్వారా స్టార్‌లింక్ డివైజ్‌లతో పాటు సేవలను ఆఫర్ చేయనుంది. అలాగే, బిజినెస్ కస్టమర్లు, కమ్యూనిటీ సెంటర్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు తదితర వర్గాలతో అనుసంధానమయ్యే అవకాశాలను సైతం అన్వేషించనుంది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను మరింత మెరుగుపర్చడంతోపాటు విస్తరించేందుకు స్టార్‌లింక్ ఏ విఽధంగా సాయపడగలదని ఇరు సంస్థలు అన్వేషించనున్నాయి. .
జియో వర్సెస్ స్టార్‌లింక్
శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు అవసరమైన స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని భారత కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో డిమాండ్ చేయగా.. స్టార్‌లింక్ సహా ఇతర అంతర్జాతీయ సంస్థలు నేరుగా కేటాయింపులు జరపాలని కోరాయి. కాగా, కేంద్రం మస్క్ కంపెనీకే సానుకూలంగా ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను నిర్దిష్ట ధరకు నేరుగా కేటాయించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజా భాగస్వామ్యం ద్వారా స్టార్‌లింక్, ఎయిర్‌టెల్ కలిసి రిలయన్స్ జియోకు గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా కన్పిస్తున్నది. ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్ కలిసి చవకగా సేవలను ఆఫర్ చేయడం ద్వారా బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో జియో మార్కెట్ వాటాను కొల్లగొట్టేందుకు అవకాశాలున్నాయి.
Read Also : 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. డీఏ పెంపుపై ప్రభుత్వం కీలక ప్రకటన..
Business Ideas: మీ దగ్గర రూ.1000 లు ఉంటే చాలు.. ఈ వ్యాపారంలో నెలకు మినిమం రూ.30 వేల ప్రాఫిట్..
Airtel - Space X Deal: ఎయిర్ టెల్ సాయంతో స్టార్‌లింక్ భారత్‌లోకి ఎంట్రీ.. స్పేస్ ఎక్స్