Dhanteras 2025: ధనత్రయోదశికి వెండి జిగేల్
ABN , Publish Date - Oct 19 , 2025 | 04:58 AM
బంగారం, వెండి వంటి విలువ లోహాల కొనుగోలుకు ధనత్రయోదశి అత్యంత శుభప్రదమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఈ ఏడాదిలో వీటి ధరలు అమాంతం పెరిగినప్పటికీ...
అధిక ధరల కారణంగా 15ు తగ్గిన పసిడి విక్రయాలు
సిల్వర్ విక్రయాల్లో 40% వృద్ధి
విలువపరంగా రెట్టింపు పెరుగుదల
ముంబై/న్యూఢిల్లీ: బంగారం, వెండి వంటి విలువ లోహాల కొనుగోలుకు ధనత్రయోదశి అత్యంత శుభప్రదమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఈ ఏడాదిలో వీటి ధరలు అమాంతం పెరిగినప్పటికీ, కొనుగోళ్లు మాత్రం బాగానే జరిగాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ధనత్రయోదశికి బంగారంతో పోలిస్తే వెండికి అధిక గిరాకీ కన్పించిందని.. వెండి నాణేలు, పూజ వస్తువుల విక్రయాలు గతసారితో పోలిస్తే 35-40 శాతం పెరిగాయని, విక్రయాల విలువ రెట్టింపునకు పైగా పెరిగిందని ఆభరణాల వర్తక సంఘం వెల్లడించింది. బంగారం విక్రయాల పరిమాణం మాత్రం గతసారితో పోలిస్తే 15 శాతం వరకు తగ్గిందని అసోసియేషన్ పేర్కొంది. గత ఏడాదిలాగే ఈసారీ ధనత్రయోదశి రెండు రోజులు (శనివారం నుంచి ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల వరకు) జరుపుకుంటున్నారు. దీంతో నగల షాపులు ఆదివారం కూడా తెరిచి ఉండనున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ధనత్రయోదశి విక్రయాలు జోరందుకున్నాయని, వినియోగదారులు అధికంగా నాణేల కొనుగోలుకు మొగ్గుచూపారని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. పెట్టుబడి, పెళ్లి అవసరాల కోసం 1-50 గ్రాముల వరకు బులియన్ కొనుగోళ్లు జరిపారని వారు తెలిపారు.
మరోవైపు హైదరాబాద్‌లో ధనత్రయోదశి విక్రయాలు 50 శాతం వరకు తగ్గినట్లు వర్తకులు తెలిపారు. వినియోగదారులు కూడా కొద్ది మొత్తంలో పసిడి, వెండి కొనుగోళ్లకు మొగ్గు చూపినట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు ఆన్‌లైన్ కొనుగోళ్లకు మాత్రం వినియోగదారులు మక్కువ చూపినట్లు క్విక్ కామర్స్ రంగ ప్రతినిధులు తెలిపారు.
రూ.50,000 కోట్లకు పైగా విక్రయాలు: గత ఏడాదితో పోలిస్తే ఈసారి ధంతేరస్ విక్రయాలు పరిమాణంపరంగా 10-15 శాతం తగ్గినప్పటికీ, అమ్మకాల విలువ భారీగా పెరిగిందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) చైర్మన్ రాజేశ్ రోక్డే అన్నారు. ఈసారి మొత్తం విక్రయాలు రూ.50,000 కోట్లు దాటవచ్చన్నారు. కాగా విక్రయాల పరిమాణం తగ్గినప్పటికీ, కొనుగోలు లావాదేవీల సగటు విలు వ 20-25ు పెరిగిందని జీజేసీ వైస్ చైర్మన్ అవినాశ్ గుప్తా అన్నారు.
ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు: ఈ ధనత్రయోదశికి భారత వినియోగదారులు బంగారం, వెండి సహా ఇతర కొనుగోళ్లకు మొత్తం రూ.లక్ష కోట్లు వెచ్చించి ఉండవచ్చని ది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) అంచనా వేసింది. అందులో బంగారం, వెండి కొనుగోళ్ల వాటానే రూ.60,000 కోట్లుగా ఉంటుందని, గత ఏడాదితో పోలిస్తే వీటి అమ్మకాలు 25 శాతం పెరిగాయని అసోసియేషన్ పేర్కొంది. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు 60 శాతం పెరిగి రూ.1.30 లక్షలు దాటినప్పటికీ, నగల షాపులకు వినియోగదారులు పోటెత్తారంటోంది
పసిడి కాస్త దిగొచ్చే : ధనత్రయోదశి నాడు పసిడి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయి నుంచి కాస్త దిగివచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం శనివారం రూ.2,400 తగ్గి రూ.1,32,400కు జారుకుంది. వెండి విషయానికొస్తే, కిలో ధర మరో రూ.7,000 తగ్గి రూ.1.70 లక్షలకు పరిమితమైంది.
ఇవి కూడా చదవండి..
ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేష్.. ఎన్ని రోజులంటే
ఉద్యోగ సంఘాలతో సర్కార్ కీలక చర్చలు
Read Latest AP News And Telugu News