Sensex Nifty Drop: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. 600 పాయింట్స్ నష్టపోయిన సెన్సెక్స్
ABN , Publish Date - Aug 28 , 2025 | 10:35 AM
ట్రంప్ సుంకాల ప్రభావం భారత స్టాక్ మార్కెట్స్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం ట్రేడింగ్ మొదట్లోనే బీఎస్ఈ, ఎన్ఎస్‌ఈ భారీగా నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే, ఇవి స్వల్పకాలిక ఒడిదుడుకులని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాల ఎఫెక్ట్ దెబ్బకు గురువారం స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 180 పాయింట్ల మేర నష్టపోయి 24,583 వద్ద కొనసాగుతుండగా బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 600 పాయింట్ల నష్టపోయి 80,315 వద్ద ట్రేడవుతోంది. భారత్‌కు ఆర్థికంగా కీలకమైన 16 రంగాల్లో 14 రంగాల షేర్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు కూడా వరుసగా 0.2 శాతం, 0.1 శాతం మేర నష్టాలను చవి చూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 87.50 వద్ద కదలాడుతోంది.
మంగళవారం నాడు కూడా నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలను చవి చూశాయి. ఒక్క రోజులో ఏకంగా 1 శాతం మేర నష్టపోయాయి. ఒక్క రోజులో ఈ స్థాయి నష్టం గత మూడు నెలల్లో ఇదే తొలిసారి. ఇక బుధవారం సెలవు కావడంతో గురువారం మార్కెట్స్ ప్రారంభంలోనే నష్టాలను చవిచూశాయి
స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణం ఇదే
ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్‌పై అధికంగా ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ట్రేడింగ్ మొదట్లోనే అమ్మకాలు జోరందుకున్నాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, లాభల్లో కోత వంటి వాటి ప్రభావం పెరిగింది. సుంకాల విషయంలో అంతిమంగా ఇరు దేశాలు మధ్యే మార్గం అనుసరించే అవకాశాలు ఉన్నా అప్పటివరకూ మార్కెట్‌లో స్వల్ప కాలిక ఒడిదుడుకులు తథ్యమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
2038 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
బంగారం ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఏంటంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి