Stock Market Update: ఇంట్రాడేలో 81,000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - May 03 , 2025 | 05:20 AM
శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ 81,177 వద్ద గరిష్ఠాన్ని తాకి చివరికి 80,501 వద్ద స్థిరపడింది. విదేశీ పెట్టుబడులు, జీఎస్‌టీ వసూళ్ల రికార్డు, మార్కెట్ సానుకూలతతో సూచీలు లాభపడాయి.
చివరికి 260 పాయింట్ల లాభంతో 80,501 వద్ద ముగిసిన సూచీ
ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు శుక్రవారం స్వల్పంగా లాభపడ్డాయి. ట్రేడింగ్ తొలి గంటలో సెన్సెక్స్ 935 పాయింట్లు ఎగబాకి 81,177.93 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశలు, ఏప్రిల్ నెల జీఎస్‌టీ వసూళ్లు సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ఈక్విటీ మదుపరులు మళ్లీ లాభాల స్వీకరణకు దిగడంతో సూచీ ప్రారంభ లాభాలను నిలుపుకోలేకపోయింది. చివరికి 259.75 పాయింట్ల వృద్ధితో 80,501.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ప్రారంభ ట్రేడింగ్‌లో ఒక శాతానికి పైగా పెరిగి 24,589 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసినప్పటికీ, ఆఖరికి 12.50 పాయింట్ల స్వల్ప లాభంతో 24,346.70 వద్ద ముగిసింది.
అవాంటెల్ రూ.80 కోట్ల సమీకరణ: రైట్స్ ఇష్యూ ద్వారా రూ.80.90 కోట్లు సమీకరించనున్నట్ల్లు హైదరాబాద్, వైజాగ్ కేంద్రాలుగా కార్యకలాపాలు సాగిస్తున్న అవాంటెల్ లిమిటెడ్ ప్రకటించింది. రక్షణ, సమాచార రంగాలకు సాంకేతిక పరిష్కారాలందించే ఈ కంపెనీ.. రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను తెలుగు రాష్ట్రాల్లోని తన తయారీ యూనిట్లు, మౌలిక వసతుల విస్తరణ కోసం వినియోగించనుంది.