Share News

SEBI Gives Clean Chit: గౌతమ్‌ అదానీకి సెబీ క్లీన్‌చిట్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:46 AM

ఊహించిందే జరిగింది. అదానీ గ్రూప్‌, ఆ గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్లు గౌతమ్‌ అదానీ, రాజేశ్‌ అదానీలపై వచ్చిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలను క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కొట్టి పారేసింది....

SEBI Gives Clean Chit: గౌతమ్‌ అదానీకి సెబీ క్లీన్‌చిట్‌

  • అదానీ గ్రూప్‌, రాజేశ్‌ అదానీలకు కూడా

  • ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అబద్ధం

  • హిండెన్‌బర్గ్‌ ఆరోపణలకు ఆధారాల్లేవు

న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. అదానీ గ్రూప్‌, ఆ గ్రూప్‌ ప్రధాన ప్రమోటర్లు గౌతమ్‌ అదానీ, రాజేశ్‌ అదానీలపై వచ్చిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలను క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ కొట్టి పారేసింది. అదానీ గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో ‘సంబంధిత’ (రిలేటెడ్‌) పార్టీల లావాదేవీలు జరిగినట్టు 2023 జనవరిలో అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ సంస్థ ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ సంస్థ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. తమ దర్యాప్తులో ఇందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని ప్రకటించింది. దీనికి సంబంధించి సెబీ బోర్డు సభ్యులు కమలేష్‌ సీ వర్షానీ గురువారం రెండు ఆదేశాలు జారీ చేశారు. ఆదికార్ప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, మైల్‌స్టోన్‌ ట్రేడ్‌లింక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రెహ్వార్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీలు.. అదానీ గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు అసలు ‘సంబంధిత’ పార్టీల లావాదేవీల నిర్వచనం పరిధిలోకే రావని సెబీ తేల్చింది. ఈ సంస్థలు అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించినప్పుడు ‘సంబంధిత’ లావాదేవీల ప్రశ్నే తలెత్తదని స్పష్టం చేసింది.

ఇప్పటికే ‘సుప్రీం’ నుంచి

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక అప్పట్లో దేశంలో పెద్ద ప్రకంపనలే సృష్టించింది. ప్రభుత్వ అండదండలతోనే అదానీలు ఇందుకు సాహసించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఈ ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇప్పటికే అదానీ గ్రూప్‌ సంస్థలు, గౌతమ్‌ అదానీ, రాజేశ్‌ అదానీలకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. తాజాగా సెబీ కూడా క్లీన్‌చిట్‌ ఇ్చవ్వడంతో అదానీలకు పెద్ద ఊరట లభించినట్టయింది.


ఇదీ కేసు

అదానీ గ్రూప్‌ ప్రమోటర్లు తమ నిర్వహణలోని విదేశీ డొల్ల కంపెనీలకు నిధులు మళ్లించి, ఆ నిధులతో గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల షేర్లలో కృత్రిమ ర్యాలీ సృష్టిస్తున్నారని ‘హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌’ సంస్థ 2023 జనవరిలో పెద్ద బాంబు పేల్చింది. దాంతో అదానీ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ ఒక దశలో 15,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.13.21 లక్షల కోట్లు) మేర తుడిచి పెట్టుకుపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజె్‌సతో పాటు ప్రధాన లిస్టెడ్‌ కంపెనీల షేర్ల ధర 50 నుంచి 70 శాతం పడిపోయింది. దాంతో 2023 జనవరి నాటికి ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ కనీసం టాప్‌-100లో కూడా లేకుండా పోయారు.

క్షమాపణ చెప్పాలి గౌతమ్‌ అదానీ

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ నివేదిక ఆధారంగా తమపై ఆరోపణలు చేసిన వ్యక్తులు ఇప్పటికైనా తమకు క్షమాపణలు చెప్పాలని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ కోరారు. దీనికి సంబంధించి గురువారం ఆయన సోషల్‌ మీడియా యాప్‌ ‘ఎక్స్‌’లో తన వ్యాఖ్యలను పోస్టు చేశారు. హిండెన్‌బర్గ్‌ సంస్థ దురుద్దేశాలతో తమపై నిరాధార ఆరోపణలు చేస్తోందని తాము మొదటి నుంచీ చెబుతున్న విషయాన్ని అదానీ ఆ పోస్టు లో గుర్తు చేశారు. సెబీ జరిపిన సమగ్ర దర్యాప్తులోనూ ఇదే విషయం తేలిందన్నారు. ‘ఈ దురుద్దేశపూరిత నివేదిక తో నష్టపోయిన మదుపరుల బాధ ఏంటో మాకు తెలుసు. ఈ నివేదిక ఆధారంగా మాపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులు జాతికి క్షమాపణలు చెప్పాలి’ అని అదానీ ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 05:46 AM