Share News

SBI Business Expansion: త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి ఎస్‌బీఐ ఎంఎఫ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ABN , Publish Date - Aug 10 , 2025 | 04:28 AM

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. తన రెండు అనుబంధ సంస్థలను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. బ్యాంక్‌ అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ...

SBI Business Expansion: త్వరలో పబ్లిక్‌ ఇష్యూకి ఎస్‌బీఐ ఎంఎఫ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ).. తన రెండు అనుబంధ సంస్థలను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. బ్యాంక్‌ అనుబంధ సంస్థలైన ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలను పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి తీసుకువచ్చే విషయాలను పరిశీలిస్తున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. శనివారం నాడిక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌.. ప్రత్యేక హెల్త్‌ ఇన్సూరెన్స్‌ శాఖలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ రెండు అనుబంధ సంస్థలను మార్కెట్లో లిస్టింగ్‌ చేసే విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఎప్పటిలోగా వీటిని లిస్ట్‌ చేయాలనే దానిపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎస్‌బీఐ కింద మొత్తం 18 నాన్‌ బ్యాంకింగ్‌ అనుబంధ సంస్థలున్నాయని, వీటిల్లో జీవిత బీమా, బీమాయేతర, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి సంస్థలు ప్రపంచ స్థాయి ఆర్థిక సర్వీసులు అందిస్తున్నాయని తెలిపారు. ఈ అనుబంధ సంస్థల్లో ఎస్‌బీఐ రూ.6,500 కోట్లు పెట్టుబడిగా పెడితే ప్రస్తుతం వీటి విలువ రూ.4 లక్షల కోట్లకు చేరుకుందని శెట్టి వివరించారు.

సుంకాల ప్రభావం పరిమితమే..

అమెరికా గరిష్ఠ సుంకాల ప్రభావం భారత్‌పై అంతగా ఉండదని ఎస్‌బీఐ చైర్మన్‌ శెట్టి తెలిపారు. భారత్‌ నుంచి అమెరికా సహా వివిధ దేశాలకు పెద్దఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయని, దీంతో సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రసాయనాలు, టెక్స్‌టైల్స్‌, వజ్రాభరణాలు, ఆక్వా రంగంపై మాత్రమే ఈ సుంకాల ప్రభావం అధికంగా ఉండనుందని, అయితే ఈ రంగాలకు ఎస్‌బీఐ ఇచ్చిన రుణాలు కూడా చాలా పరిమిత స్థాయిలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఈ రంగాలకు ప్రభుత్వం ఉపశమనం కల్పించాలని నిర్ణయిస్తే అప్పటి పరిస్థితుల ఆధారంగా తాము ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని ఆయన వివరించారు.


హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం ప్రత్యేక శాఖలు

ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం ప్రత్యేక శాఖలను ప్రారంభించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో మొత్తం 30 ప్రత్యేక శాఖలను ప్రారంభించినట్లు ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ నవీన్‌ చంద్ర ఝా వెల్లడించారు. అందరికీ ఆరోగ్య బీమా అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో వీటిని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. సంస్థకు చెందిన అన్ని రకాల బీమా ఉత్పత్తులు ఈ శాఖల్లో అందుబాటులో ఉంటాయని ఝూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఉద్యోగం పోయిన తర్వాత లోన్ EMIలు చెల్లించాలా? మారటోరియం?

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 04:28 AM