Share News

Repo Rate Unchanged: రెపో రేటు యథాతథం

ABN , Publish Date - Oct 02 , 2025 | 06:06 AM

ముంబై కీలక స్వల్ప కాలిక ‘రెపో’ రేటును ప్రస్తుతం ఉన్న 5.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన సోమవారం నుంచి...

Repo Rate Unchanged: రెపో రేటు యథాతథం

యూపీఐ చెల్లింపులన్నీ ఉచితమే

జీడీపీ వృద్ధి అంచనా 6.8 శాతానికి పెంపు

ద్రవ్యోల్బణ అంచనా 2.6 శాతానికి కుదింపు

ఎగుమతిదారులకు ఊరట

ప్రాథమిక ఖాతాలపైనా ఉచిత డిజిటల్‌ సేవలు

ముంబై కీలక స్వల్ప కాలిక ‘రెపో’ రేటును ప్రస్తుతం ఉన్న 5.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించాలని ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన సోమవారం నుంచి మూడు రోజుల పాటు జరిగిన సమావేశంలో ఎంపీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎంపీసీ రెపోరేటును యథాతథంగా 5.5 శాతం వద్ద కొనసాగించడం వరుసగా ఇది రెండో సారి. ఈ వడ్డీరేటు పైనే బ్యాంకులు, ఆర్‌బీఐ నుంచి స్వల్పకాలిక రుణాలు తీసుకుంటాయి. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టి, జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండడంతో ఎంపీసీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. సుంకాల పోటు ప్రభావంపై ఇంకా ఒక అంచనాకు రాకపోవడం కూడా ఇందుకు దోహదం చేసిందని తెలుస్తోంది.

ద్రవ్యోల్బణం మరింత కిందికే

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి ఉన్నా, వచ్చే ఆరు నెలల్లోనూ మన దేశంలో ధరల సెగ పెద్దగా ఉండకపోవచ్చని ఆర్‌బీఐ భావిస్తోంది. ఆహార ఉత్పత్తుల ధరలు బాగా తగ్గ డం ఇందుకు దోహదం చేయనుందని మల్హోత్రా చెప్పారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాను గతంలో ప్రకటించిన 3.1 శాతం నుంచి 2.6 శాతానికి కుదిస్తున్నట్టు చెప్పారు. ఇదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు అంచనాల్ని ఆర్‌బీఐ 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది.


షేర్‌ మార్కెకు ఊతం

ఎంపీసీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు మేలు చేసే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తొలి పబ్లిక్‌ ఇష్యూల్లో (ఐపీఓ) ఇన్వెస్ట్‌ చేసే మదుపరులకు బ్యాంకులు ఇచ్చే రుణపరిమితిని ప్రస్తు త రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. ఈ వెసులుబాటు రియల్‌ ఎస్టేట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్టులు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ట్రస్టులకు (ఇన్విట్స్‌) కూడా వర్తిస్తుందని తెలిపింది. దీనికి తోడు లిస్టెడ్‌ కంపెనీల షేర్ల హామీపై బ్యాంకులు మదుపరులకు ఇచ్చే రుణ పరిమితిని ప్రస్తుత రూ.20 లక్షల నుంచి రూ.కోటికి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్టు గవర్నర్‌ చెప్పారు. దేశంలో క్యాపిటల్‌ మార్కెట్‌ అభివృద్ధికి ఈ చర్య మరింత దోహదం చేస్తుందన్నారు.

ఎగుమతిదారులకు ఊరట

అమెరికా సుంకాల పోటును దృష్టిలో ఉంచుకుని ఎగుమతిదారులను ఆదుకునేందుకు ఎంపీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విదేశీ బ్యాంకుల్లో ఐఎ్‌ఫఎ్‌ససీ ఖాతాల్లో ఉన్న ఎగుమతి నిధులను భారత్‌కు బదిలీ చేసే గడువుని ప్రస్తుత నెల రోజుల నుంచి మూడు నెలలకు పెంచాలని నిర్ణయించింది. వస్తు దిగుమతి చెల్లింపుల లావాదేవీల గడువు కూడా నాలుగు నెలల నుంచి ఆరు నెలలకు పెంచుతున్నట్టు ప్రకటించింది.

రూపాయి అంతర్జాతీయీకరణ

రూపాయి చెల్లింపులను ప్రోత్సహిచేందుకు ఆర్‌బీఐ కొన్ని చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా భూటాన్‌, శ్రీలంక, నేపాల్‌ దేశాల కంపెనీలకు అనుమతించిన దేశీయ బ్యాంకు లు ‘రూపాయి’ రుణాలు ఇచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే దేశీయ బ్యాంకుల్లో స్పెషల్‌ రూపీ వోస్ట్రో అకౌంట్‌ (ఎస్‌ఆర్‌వీఏ) ఖాతాల్లో నిధులున్న విదేశీ బ్యాంకులు, ఆ నిధులను దేశీయ కంపెనీల రుణ పత్రాలు, కమర్షియల్‌ పేపర్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించింది.

ఎంపీసీ ఇతర ప్రధాన నిర్ణయాలు

  • నో ఫ్రిల్స్‌ బ్యాంకు ఖాతాదారులకూ ఉచితంగా డిజిటల్‌ లావాదేవీల సేవలు.

  • మరింత పటిష్టంగా అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ.

  • అంబుడ్స్‌మన్‌ పరిఽధిలోకి గ్రామీణ సహకార బ్యాంకులు.

  • లిస్టెడ్‌ కంపెనీల విలీనాలు, కొనుగోళ్లకు రుణాలు సమకూర్చేందుకు దేశీయ బ్యాంకులకు అనుమతి.

  • కొత్త పట్టణ సహకార బ్యాంకులకు లైసెన్సులపై త్వరలో చర్చా పత్రం.


యూపీఐ లావాదేవీలపై

ఎలాంటి చార్జీ ఉండదు

యూపీఐ చెల్లింపు లావాదేవీలపై చార్జీలు విధిస్తారన్న వార్తలను ఆర్‌బీఐ గవర్నర్‌ తోసిపుచ్చారు. అసలు అలాంటి ప్రతిపాదనే తమ వద్ద లేదన్నారు. అయితే క్రెడిట్‌ కార్డులపై కొనుగోలు చేసే మొబైల్‌ ఫోన్ల ఈఎంఐలు సక్రమంగా చెల్లించకపోతే, బ్యాంకులు ఆ ఫోన్లను రిమోట్‌ పద్దతిలో లాక్‌ చేసే విషయాన్ని మాత్రం పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అనుకూల, ప్రతికూల అంశాలు అన్నిటిని కూలంకషంగా చర్చించాకే దీనిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఎం రాజేశ్వరరావు చెప్పారు.

ఎంపీసీ సమావేశం రెపోరేటు కంటే, అనేక ఇతర విధాన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రిస్క్‌ ఆధారిత డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం విధానం ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న బ్యాంకుల లాభాలను మరింత పెంచుతుంది.

చల్లా శ్రీనివాసులు శెట్టి, చైర్మన్‌, ఎస్‌బీఐ

ప్రాథమిక పొదుపు ఖాతాలున్న ఖాతాదారులకు కూడా మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలను విస్తరించడం మంచి చర్య. ఇది ఖాతాదారుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది.

అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ,

ఎండీ అండ్‌ సీఈఓ, ఐఓబీ

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 06:06 AM