Reliance Industries Profit: రిలయన్స్ రికార్డు లాభం
ABN , Publish Date - Jul 19 , 2025 | 04:42 AM
ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ..
క్యూ1లో 78 శాతం వృద్ధితో రూ.26,994 కోట్లకు చేరిక
ఆదాయం రూ.2.48 లక్షల కోట్లు
రిటైల్, జియో వ్యాపారాలు జిగేల్
లాభాల్లో భారీ వృద్ధికి కలిసివచ్చిన ఏషియన్ పెయింట్స్ వాటా విక్రయం
న్యూఢిల్లీ: ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఆర్‌ఐఎల్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 78.3 శాతం వృద్ధితో రూ.26,994 కోట్లకు (ఒక్కో షేరుకు రూ.19.95) పెరిగింది. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభం. రిటైల్, జియో వ్యాపారాలు మెరుగైన పనితీరు కనబరచడంతోపాటు ఏషియన్ పెయింట్స్‌లో వాటా విక్రయం ద్వారా సమకూరిన ఏకకాల ఆర్జన (వన్ టైమ్ గెయిన్) లాభాల్లో భారీ వృద్ధికి దోహదపడింది. వన్ టైమ్ గెయిన్స్‌ను మినహాయిస్తే, సంస్థ లాభం వార్షిక ప్రాతిపదికన 25 శాతం వృద్ధిని కనబరిచింది. కాగా, క్యూ1లో కంపెనీకి కార్యకలాపాల ద్వారా ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5.3 శాతం పెరిగి రూ.2,48,660 కోట్లకు చేరుకుంది. స్థూల రాబడి 6 శాతం వృద్ధితో రూ.2,73,252 కోట్లుగా, ఎబిటా 35.7 శాతం వృద్ధితో రూ.58,024 కోట్లుగా నమోదైంది. వ్యాపార విభాగాల వారీగా పనితీరు..
ఓ2సీ
రిలయన్స్ కీలక వ్యాపార విభాగమైన ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) ఆదాయం ఈ క్యూ1లో 1.5 శాతం తగ్గి రూ.1,54,804 కోట్లకు పరిమితమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దిగిరావడంతో పాటు ముందస్తు ప్రణాళిక ప్రకారంగా ప్లాంట్‌ను కొన్ని రోజులు మూసివేసిన కారణంగా రిఫైనింగ్ తగ్గడం ఇందుకు కారణమని కంపెనీ పేర్కొంది. అయితే, కంపెనీకి చెందిన జియో-బీపీ బంకులకు ఇంధన సరఫరా పెంచడం ఆదాయానికి మద్దతుగా నిలిచాయి. ఎబిటా మాత్రం 10.8 శాతం వృద్ధితో రూ.14,511 కోట్లుగా నమోదైంది.
రిలయన్స్ రిటైల్
ఆర్‌ఐఎల్ రిటైల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) నికర లాభం జూన్ త్రైమాసికంలో 28.3 శాతం పెరిగి రూ.3,271 కోట్లకు చేరింది. స్థూల ఆదాయం 11.3 శాతం వృద్ధితో రూ.84,171 కోట్లకు పెరిగింది. అన్ని రిటైల్ వ్యాపార విభాగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదపడిందని కంపెనీ పేర్కొంది. గడిచిన మూడు నెలల్లో 388 కొత్త స్టోర్లను ప్రారంభించటంతో మొత్తం స్లోర్ల సంఖ్య 19,592కు చేరుకుందని తెలిపింది.
ఆయిల్ అండ్ గ్యాస్
కంపెనీకి చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి వ్యాపార విభాగ ఆదాయం జూన్ త్రైమాసిక కాలంలో 1.2 శాతం తగ్గి రూ.6,103 కోట్లకు, ఎబిటా 4.1 శాతం తగ్గుదలతో రూ.4,996 కోట్లకు పరిమితమైంది. కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్ నుంచి ఉత్పత్తితో పాటు విక్రయాలు తగ్గడం ఇందుకు కారణమైందని కంపెనీ తెలిపింది. సీబీఎం గ్యాస్ ధరతో పాటు ముడిచమురుపై మార్జిన్లు తగ్గడమూ ఆదాయంపై ప్రభావం చూపిందని సంస్థ పేర్కొంది.
జియోస్టార్
ఈ జూన్ క్వార్టర్‌లో రిలయన్స్‌కు చెందిన జియో హాట్‌స్టార్ వ్యాపార విభాగ ఆదాయం రూ.11,222 కోట్ల కు పెరిగింది. లాభం రూ.581 కోట్లకు ఎగబాకింది. ఆండ్రాయిడ్ ఓఎ్‌సపై జియోహాట్‌స్టార్ యాప్ డౌన్‌లోడ్లు 104 కోట్లకు చేరాయని కంపెనీ తెలిపింది.
జియో ప్లాట్‌ఫామ్స్
టెలికాం సంస్థ రిలయన్స్ జియోతో పాటు డిజిటల్ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందికి చేర్చి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్ నికర లాభం ఈ క్యూ1లో 25 శాతం పెరిగి రూ.7,110 కోట్లకు ఎగబాకింది. స్థూల ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.41,054 కోట్లకు పెరిగింది. ఈ జూన్ చివరినాటికి రిలయన్స్ జియో మొత్తం వినియోగదారులు 49.81 కోట్లకు పెరిగారు. ఒక్కో వినియోగదారు నుంచి సగటు ఆదాయం (ఆర్పూ) రూ.208.8కి చేరింది. కంపెనీ 5జీ కస్టమర్లు తొలిసారిగా 20 కోట్ల స్థాయికి చేరారని, హోమ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 2 కోట్లు దాటినట్లు తెలిపింది. జియో ఎయిర్ ఫైబర్ 74 లక్షల మంది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సె్‌స (ఎ్‌ఫడబ్ల్యూఏ) సర్వీ్‌సగా అవరించిందని కంపెనీ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి