Share News

ఖరీదైన బహుమతులు వచ్చాయా

ABN , Publish Date - May 25 , 2025 | 04:37 AM

భారతీయ సమాజంలో బహుమతులు (గిఫ్ట్‌) ఒక భాగం. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగల సమయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మన సంప్రదాయం కూడా. ఇవి నగనట్రా, ఆస్తులు లేదా ఇతర విలువైన వస్తువుల రూపంలో ఉంటాయి....

ఖరీదైన బహుమతులు వచ్చాయా

భారతీయ సమాజంలో బహుమతులు (గిఫ్ట్‌) ఒక భాగం. పెళ్లిళ్లు, పేరంటాలు, పండగల సమయంలో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం మన సంప్రదాయం కూడా. ఇవి నగనట్రా, ఆస్తులు లేదా ఇతర విలువైన వస్తువుల రూపంలో ఉంటాయి. ఈ బహుమతులు తీసుకోవటం సంతోషం కలిగించినా.. ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న బహుమతుల విలువ రూ.50,000 మించితే వాటిపై పన్ను పోటు తప్పదు. ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు విలువతో సంబంధం లేకుండా ఈ బహుమతుల వివరాలు వెల్లడించడం మంచిది. లేకపోతే భవిష్యత్‌లో సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

1958లోనే బహుమతులపై పన్ను కోసం ప్రభుత్వం గిఫ్ట్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ తీసుకొచ్చింది. 1998లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. అయితే 2004లో మళ్లీ బహుమతులను ఆదాయ పన్ను (ఐటీ) చట్ట సవరణ ద్వారా పన్నుల పరిధిలోకి తీసుకొచ్చారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 56 ప్రకారం నిర్ణీత విలువ దాటిన బహుమతులు ‘ఇతర ఆదాయం’ కింది పరిగణించి వాటిని అందుకున్న వ్యక్తుల నుంచి పన్ను వసూలు చేస్తారు.


ఐటీ రిటర్నుల్లో వెల్లడించాల్సిందే..

వీరికి మినహాయింపు: ఐటీ చట్టంలో పేర్కొన్న దగ్గరి బంధువులు, కుటుంబసభ్యుల నుంచి అందే బహుమతులకు విలువతో సంబంధం లేకుండా పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఇతరుల నుంచి వస్తే: ఎవరైనా ఒక వ్యక్తికి ఒక ఆర్థిక సంవత్సరంలో బంధువులు కాని వ్యక్తుల నుంచి రూ.50,000 కంటే ఎక్కువ విలువైన బహుమతులు అందితే వారిపై పన్ను పోటు తప్పదు. దీన్ని ఇతర ఆదాయంగా పరిగణించి పన్ను విధిస్తారు.

ఎవరు బంధువులు: ఐటీ చట్టం ప్రకారం తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వాములు, వారి తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరి బంధువుల పరిధిలోకి వస్తారు. వీరి నుంచి మనకి, మన నుంచి వీరికి అందే బహుమతులపై ఎలాంటి పన్ను వర్తించదు.


పన్ను పోటు లేని బహుమతులు

  • పెళ్లిళ్ల సమయంలో వధూవరులకు వచ్చే గిఫ్ట్‌లు

  • ఐటీ చట్టం పేర్కొన్న దగ్గరి బంధువుల నుంచి అందే బహుమతులు

  • వారసత్వంగా లేదా వీలునామా ద్వారా సంక్రమించే గిఫ్ట్‌లు

  • ప్రభుత్వం వద్ద నమోదైన మతపరమైన, దాతృత్వ ట్రస్టుల నుంచి అందే బహుమతులు

  • ప్రభుత్వ గుర్తింపు పౌందిన ఆస్పత్రులు, వైద్య సంస్థల నుంచి అందే గిఫ్ట్‌లు

  • యూనివర్సిటీలు, విద్యా సంస్థల నుంచి అందే ఉపకార వేతనాలు, గ్రాంట్లు, ఆర్థిక సాయం

  • మున్సిపల్‌, స్థానిక ప్రభుత్వ సంస్థల నుంచి అందే బహుమతులు

  • కేవలం ఒక వ్యక్తి ప్రయోజనం కోసం ఏర్పాటైన ట్రస్టుల నుంచి అందే బహుమతులు

  • యాజమాన్య హక్కుల బదిలీ లేకుండా అందే బహుమతులు

  • కార్లు, ఫోన్లు, టీవీలు, ఫర్నీచర్‌, వాచీల వంటి బహుమతుల విలువ రూ.50,000 మించినా పన్ను పోటు ఉండదు.


రిటర్నుల్లో ఎలా వెల్లడించాలి?

ఒక ఆర్థిక సంవత్సరంలో అందే బహుమతుల విలువ రూ.50,000 మించితే తప్పకుండా ఆ విషయాన్ని ‘ఇతర ఆదాయం’ సెక్షన్‌లో వెల్లడించాలి. ఒకవేళ వాటి విలువ రూ.50,000 కంటే తక్కువగా ఉన్నా ‘ఎగ్జెంప్ట్‌ ఇన్‌కం’ సెక్షన్‌లో వెల్లడించడం మంచిది. దీనివల్ల మన ఆదాయ వెల్లడిలో పారదర్శకత పెరిగి ఐటీ శాఖ మన రిటర్నులు స్ర్కూటినీ చేసే అవకాశాలు తగ్గుతాయి.

ఇవీ చదవండి:

జూన్ 2025లో బ్యాంకు సెలవులు..ఎప్పుడు, ఎక్కడ బంద్

నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 04:37 AM