Share News

OpenAI Teams Up with TCS: టీసీఎస్‌‌తో ఓపెన్‌ ఏఐ జట్టు

ABN , Publish Date - Dec 05 , 2025 | 05:58 AM

కృత్రిమ మేధ (ఏఐ)లో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిన ‘ఓపెన్‌ ఏఐ’ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం టాటా గ్రూప్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌...

OpenAI Teams Up with TCS: టీసీఎస్‌‌తో ఓపెన్‌ ఏఐ జట్టు

భారత్‌లో స్టార్‌గేట్‌ కార్యకలాపాల విస్తరణ

తుది దశకు చర్చలు..

నెలాఖరు కల్లా ప్రకటన వెలువడే చాన్స్‌

న్యూఢిల్లీ: కృత్రిమ మేధ (ఏఐ)లో ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిన ‘ఓపెన్‌ ఏఐ’ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం టాటా గ్రూప్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎ్‌స)తో జట్టు కట్టేందుకు చర్చలు జరుపుతోంది. ఈ భాగస్వామ్యం ద్వారా దేశంలో ఏఐ ఆధారిత కంప్యూటర్‌ మౌలిక సదుపాయాలు, కంపెనీలకు అవసరమైన ఏజెంటిక్‌ ఏఐ సొల్యూషన్స్‌ అభివృద్ధి చేయాలని రెండు సంస్థలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తుది దశలో ఉన్న ఈ చర్చలు ఈ నెలాఖరుకల్లా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఓపెన్‌ ఏఐకి అమెరికా తర్వాత భారత్‌ అతి పెద్ద మార్కెట్‌. ఈ కంపెనీ ఆఫర్‌ చేసే ఏఐ టూల్‌ ‘చాట్‌ జీపీటీ’ భారత్‌లో సూపర్‌ డూపర్‌ హిట్టయింది. అయితే ఇటీవల పర్‌ప్లెక్సిటీ, గూగుల్‌ జెమినీ ఏఐ టూల్స్‌ నుంచి ఓపెన్‌ ఏఐకి విపరీతమైన పోటీ ఏర్పడుతోంది. దీంతో టాటా వంటి పెద్ద పారిశ్రామిక గ్రూప్‌తో జట్టు కట్టి తన ‘స్టార్‌గేట్‌ ఇండియా’ కార్యకలాపాలను విస్తరించాలని యోచిస్తోంది. ఓపెన్‌ ఏఐతో ఈ డీల్‌ కుదిరితే, ప్రపంచంలో అతిపెద్ద ఏఐ ఆధారిత ఐటీ సేవల కంపెనీగా ఎదగాలన్న తన లక్ష్యం నెరవేరుతుదని టీసీఎస్‌ భావిస్తోంది.


లీజు ఒప్పందం మాత్రమే

ఏఐ సేవలకు అవసరమైన డేటా కేంద్రాల ఏర్పాటు కోసం టీసీఎస్‌ ఇప్పటికే హైపర్‌వాల్ట్‌ పేరుతో ప్రత్యేక వెంచర్‌ ఏర్పాటు చేసింది. టీసీఎస్‌ ఈ వెంచర్‌ ద్వారా మన దేశంలో సేవలు అందించే విదేశీ కంపెనీలకు తన డేటా సెంటర్ల ద్వారా సేవలు అందించనుంది. ఈ వెంచర్‌లో కనీసం 500 మెగావాట్ల డేటా సామర్ధ్యాన్ని లీజుకు తీసుకోవాలని ఓపెన్‌ ఏఐ భావిస్తున్నట్టు సమాచారం. నిజానికి హైపర్‌వాల్ట్‌ వెంచర్‌లో ఈక్విటీ వాటా తీసుకునేందుకు ఓపెన్‌ ఏఐ ఆసక్తి చూపింది. అయితే ఇతర కస్టమర్ల నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉందనే భయంతో టాటా గ్రూప్‌ ఆ ప్రతిపాదనను తోసిపుచ్చింది. దీంతో డేటా సెంటర్ల లీజుతో సరిపెట్టుకునేందుకు ఓపెన్‌ ఏఐ సిద్ధమవుతోంది.

మరోవైపు టీసీఎస్‌ తన డేటా సెంటర్‌ వ్యాపారం కోసం మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), గూగుల్‌, ఎన్‌విడియాతో జట్టు కట్టాలని భావిస్తోంది.

ఎందుకంటే?

2,200 కోట్ల డాలర్ల మార్కెట్‌

ప్రస్తుతం మన దేశంలో ఏఐ మార్కెట్‌ 780 కోట్ల డాలర్ల నుంచి 1,270 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మార్కెట్‌ ఏటా 20.1 శాతం నుంచి 43.76 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. 2027 నాటికి ఇది 1,700 కోట్ల డాలర్ల నుంచి 2,200 కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని నాస్కామ్‌-బీసీజీ అంచనా. దీంతో గూగుల్‌, మెటా వంటి టెక్‌ దిగ్గజాలు భారత్‌లోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలతో జట్టు కట్టేందుకు ముందుకు వస్తున్నాయి. గూగుల్‌ ఇప్పటికే తన జెమినీ ఏఐ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో జట్టు కట్టింది. నిజానికి ఓపెన్‌ ఏఐ కూడా తన ఏఐ సేవల కోసం రిలయన్స్‌, ప్రభుత్వంతో చర్చలు జరిపినా అవి పెద్దగా ఫలించలేదు. దాంతో ఇప్పుడు టాటా గ్రూప్‌ కంపెనీ టీసీఎస్‌ జట్టు కట్టేందుకు ఆసక్తి చూపుతోందని భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

రూపాయి గాయానికి ఆర్‌బీఐ మందేమిటో..

జనరిక్‌ సెమాగ్లుటైడ్ తయారీకి డాక్టర్‌ రెడ్డీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 05 , 2025 | 05:58 AM