Share News

Andaman Sea Oil: అండమాన్‌ సముద్రంలో చమురు నిక్షేపాలు

ABN , Publish Date - Sep 22 , 2025 | 05:15 AM

చమురు దిగుమతుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం దేశంలోనే చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా...

Andaman Sea Oil: అండమాన్‌ సముద్రంలో చమురు నిక్షేపాలు

అన్వేషణ కోసం రూ.3,200 కోట్ల కేటాయింపు

  • మరో మూడు ప్రాంతాల్లో కూడా

  • ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు అనుమతి

న్యూఢిల్లీ: చమురు దిగుమతుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం దేశంలోనే చమురు, గ్యాస్‌ ఉత్పత్తి పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌).. తొలి దశలో అండమాన్‌, నికోబార్‌ ద్వీపాల్లోని లోతట్టు సముద్ర జలా లు సహా మహానది, సౌరాష్ట్ర, బెంగాల్‌ బేసిన్స్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల కోసం వచ్చే ఏడాది కొన్ని కొత్త బావులు తవ్వబోతున్నాయి. కాగా అండమాన్‌కు దగ్గరలో ఉన్న మయన్మార్‌, ఇండోనేషియా సముద్ర జలాల్లో ఇప్పటికే పెద్దమొత్తంలో చమురు, గ్యాస్‌ నిక్షేపాలు బయటపడ్డాయి. అండమాన్‌ సముద్ర జలాల్లోని భూప్రాంతం కూడా మయన్మార్‌, ఇండోనేషియా సముద్ర భూతలాన్ని పోలి ఉంటుంది. దీంతో మన ప్రాంతంలో నూ భారీగా చమురు, గ్యాస్‌ నిక్షేపాలు బయటపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతాల్లో చమురు అన్వేషణ కోసం రూ.3,200 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


అండమాన్‌లో 37.1 కోట్ల టన్నుల నిక్షేపాలు: అండమాన్‌ ప్రాంతంలో భారత ఇంధన ముఖ చిత్రాన్నే మార్చివేసే భారీ చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఇటీవల ప్రకటించారు. ఈ నిక్షేపాలు 31.7 కోట్ల టన్నుల వరకు ఉంటాయని ఇప్పటికే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది గత ఏడాది మన దేశం దిగుమతి చేసుకున్న 24.24 కోట్ల టన్నుల కంటే ఇది 7.46 కోట్ల టన్నులు ఎక్కువ. చమురు, గ్యాస్‌ అన్వేషణకు వీలుగా 2022లో కేంద్ర ప్రభుత్వం అండమాన్‌ సముద్ర ప్రాంతంలోని దాదాపు 10 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని స్వేచ్ఛా మండలంగా ప్రకటించింది.

బీపీ భాగస్వామ్యం: అండమాన్‌ సముద్ర జలాల్లో ఎక్కడ బావులు తవ్వాలి? వాటి ఫలితాల అన్వేషణలో బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ).. ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియాలకు సహకరిస్తుంది. ఈ పరీక్షా ఫలితాల ఆధారంగా ఈ ప్రాంతంలో చమురు, గ్యాస్‌ ఉత్పత్తి హక్కులు ఏ కంపెనీకి ఇవ్వాలనే విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉంటే, అందులో బీపీ కంపెనీ కూడా వాటాదారుగా చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే పర్యావరణ అనుమతులు, భారీ ఖర్చులు ఇందుకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 22 , 2025 | 05:15 AM