Andaman Gas Discovery: అండమాన్ లో ఆయిల్ ఇండియాకు జాక్‌పాట్
ABN , Publish Date - Sep 28 , 2025 | 06:16 AM
అండమాన్ తీర ప్రాంత సముద్ర గర్భంలోనూ సహజ వాయువు (గ్యాస్) నిక్షేపాలు బయట పడుతున్నాయి. అండమాన్ దీవుల తూర్పు ప్రాంతంలో తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో...
గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న సంస్థ
295 మీటర్ల లోతులోనే సహజవాయువు జాడ
న్యూఢిల్లీ: అండమాన్ తీర ప్రాంత సముద్ర గర్భంలోనూ సహజ వాయువు (గ్యాస్) నిక్షేపాలు బయట పడుతున్నాయి. అండమాన్ దీవుల తూర్పు ప్రాంతంలో తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో ప్రభుత్వ రంగ కంపెనీ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్)కి సహజ వాయువు నిక్షేపాల జాడ లభించింది. ఈ ప్రాంతంలో తవ్విన ఒక అన్వేషణాత్మక బావిలో 295 మీటర్ల లోతులో గ్యాస్ నిక్షేపాల జాడ లభించినట్టు ఓఐఎల్ వెల్లడించింది. అయితే ఈ బావి నుంచి రోజుకు ఎంత మొత్తంలో గ్యాస్ లభించే అవకాశం ఉందనే విషయంపై కంపెనీ ఇంకా ఒక అంచనాకు రాలేదు. నిర్ణీత 2,650 మీటర్లు తవ్వితే గానీ దీనిపై ఒక అంచనాకు రాలేమని అధికార వర్గాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్, కాకినాడలోని లేబొరేటరీలో జరిపిన పరీక్షలో ఈ గ్యాస్‌లో 87 శాతం వరకు మిథేన్ ఉన్నట్టు తేలినట్టు ఆయిల్ ఇండియా తెలి పింది.
భారీగానే నిక్షేపాలు
అండమాన్ దీవులకు సమీపంలో మయన్మార్, ఇండోనేషియా తీరాల్లో ఇప్పటికే భారీ చమురు, గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి. దీంతో అండమాన్, నికోబార్ దీవులు, వాటి తీర ప్రాంతంలోనూ భారీగానే చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇటీవల వెలువడిన ‘ఇండియా హైడ్రోకార్బన్ రిసోర్స్ అసె్‌సమెంట్ స్టడీ’ నివేదిక ప్రకారం చూసినా, ఈ ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ, ఓఐఎల్ కంపెనీలు రూ.3,200 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంత సముద్ర జలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. కాగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి కూడా అండమాన్ ప్రాంతంలో భారీగానే చమురు, గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి
Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి