Share News

Medicover Hospitals IPO: వచ్చే ఏడాది ఐపీఓకి మెడికవర్‌ హాస్పిటల్స్‌

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:26 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కార్యకలాపాల విస్తరణతో పాటు...

Medicover Hospitals IPO: వచ్చే ఏడాది ఐపీఓకి మెడికవర్‌ హాస్పిటల్స్‌

  • 2025-26లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

  • డిసెంబరు నాటికి కోకాపేట్‌ హాస్పిటల్‌ రెడీ

  • నేడు సికింద్రాబాద్‌ హాస్పిటల్‌ ప్రారంభం

  • మెడికవర్‌ సీఎండీ అనిల్‌ కృష్ణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న మెడికవర్‌ హాస్పిటల్స్‌ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కార్యకలాపాల విస్తరణతో పాటు రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఐపీఓకి రావాలని భావిస్తున్నట్లు మెడికవర్‌ హాస్పిటల్స్‌ సీఎండీ అనిల్‌ కృష్ణ వెల్లడించారు. ఐపీఓలో భాగంగా పూర్తిగా కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు. హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ విలువను 100 కోట్ల డాలర్లు (రూ.8,800 కోట్లు) లెక్కగట్టే అవకాశం ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో హాస్పిటల్‌ టర్నోవర్‌ రూ.1,850 కోట్లుగా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దీన్ని రూ.2,000 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనిల్‌ తెలిపారు. కాగా మెడికవర్‌ రుణ భారం రూ.1,000 కోట్ల వరకు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మెడికవర్‌.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటకల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.


రూ.250 కోట్లతో విస్తరణ

విస్తరణలో భాగంగా ఈ ఏడాది సికింద్రాబాద్‌, కోకాపేట్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో కొత్తగా రెండు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అనిల్‌ కృష్ణ వెల్లడించారు. ఇందులో రూ.100 కోట్ల పెట్టుబడితో 300 పడకల సామర్థ్యంతో సికింద్రాబాద్‌ హాస్పిటల్‌ను, రూ.150 కోట్లతో 500 పడకలతో కోకాపేట్‌ హాస్పిటల్‌ను నెలకొల్పుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోకాపేట్‌ హాస్పిటల్‌ డిసెంబరు నాటికి అందుబాటులోకి రానుండగా సికింద్రాబాద్‌ హాస్పిటల్‌ను ఈ నెల 16న (మంగళవారం) ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే చందానగర్‌ హాస్పిటల్‌ సామర్థ్యాన్ని 150కి పడకలను పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త హాస్పిటల్స్‌తో మొత్తం పడకల సంఖ్య 6,400కు చేరుకోనుండగా దేశవ్యాప్తంగా ఆస్పత్రుల సంఖ్య 25కు చేరుకుంటుం దన్నారు. కాగా రానున్న రోజుల్లో మెట్రో నగరాలైన బెంగళూరు, పుణెల్లో కొత్త హాస్పిటల్స్‌ ఏర్పాటుతో పాటు ద్వితీయ శ్రేణి నగరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు అనిల్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

For AP News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 05:28 AM