Share News

IPhone Manufacturing: ఇక అమెరికాలో మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్లే

ABN , Publish Date - May 03 , 2025 | 05:40 AM

అమెరికా మార్కెట్లో ఇకపై ఎక్కువగా మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్లు విక్రయించనున్నాయి. యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ 2025 ఏప్రిల్-జూన్‌ త్రైమాసికంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

IPhone Manufacturing: ఇక అమెరికాలో మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్లే

న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో ఇకపై మేడ్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్లే ఎక్కువగా దర్శనమివ్వనున్నాయి. ఈ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో అధిక వాటా భారత్‌ నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు యాపిల్‌ సీఈఓ టిమ్‌కుక్‌ వెల్లడించారు. అమెరికాలో విక్రయించే అధిక శాతం ఐప్యాడ్‌, మ్యాక్‌, యాపిల్‌ వాట్‌, ఎయిర్‌పాడ్స్‌ను వియత్నాం ప్లాంట్ల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇతర మార్కెట్లలో విక్రయించే ఐఫోన్లను మాత్రం చైనా నుంచి సమీకరించనున్నట్లు ఈ మార్చితో ముగిసిన రెండో త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం అనలిస్ట్‌ కాల్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన స్పష్టం చేశారు. ట్రంప్‌ సుంకాల అనిశ్చితి నేపథ్యంలో యాపిల్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సుంకాలతో జూన్‌ క్వార్టర్‌లో 90 కోట్ల డాలర్ల (రూ.7,650 కోట్లు) మేర భారం పడవచ్చని కంపెనీ అంచనా వేసింది. యాపిల్‌ అక్టోబరు నుంచి తదుపరి సెప్టెంబరు వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ అధ్యయన నివేదిక ప్రకారం.. యాపిల్‌ గత ఏడాది అమెరికా మార్కెట్లో 7.59 కోట్ల ఐఫోన్లను విక్రయించింది. భారత్‌లో తయారవుతున్న యాపిల్‌ ఐఫోన్లలో అధిక శాతం అమెరికాకే ఎగుమతవుతున్నాయి. ఈ ఫిబ్రవరి 28తో ముగిసిన మూడు నెలల్లో మన ఐఫోన్ల ఎగుమతుల్లో అమెరికా వాటా 81.9 శాతంగా ఉంది. మార్చిలో ఇది 97.6 శాతానికి పెరిగింది.

Updated Date - May 03 , 2025 | 05:40 AM