Share News

Jio BlackRock Mutual Fund: జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ అప్‎డేట్.. కనీస పెట్టుబడి ఎంతో తెలుసా..

ABN , Publish Date - Jun 30 , 2025 | 05:45 PM

మీరు కేవలం 500 రూపాయలతో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయాలని చూస్తున్నారా. అయితే మీకోక మంచి ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే తాజాగా జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ (Jio BlackRock Mutual Fund) కొత్తగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

Jio BlackRock Mutual Fund: జియో బ్లాక్‌రాక్ మ్యూచువల్ ఫండ్ అప్‎డేట్.. కనీస పెట్టుబడి ఎంతో తెలుసా..
Jio BlackRock Mutual Fund

జియో బ్లాక్‌ రాక్ మ్యూచువల్ ఫండ్ సోమవారం (జూన్ 30, 2025) తొలి మ్యూచువల్ ఫండ్ (Jio BlackRock Mutual Fund) ఆఫర్లను ప్రారంభించింది. ఈ కొత్త ఆఫర్లలో మూడు ఓపెన్ ఎండెడ్ డెట్ స్కీమ్‌లు ఉన్నాయి. వీటిలో జియో బ్లాక్‌రాక్ మనీ మార్కెట్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ లిక్విడ్ ఫండ్, జియో బ్లాక్‌రాక్ ఓవర్‌నైట్ ఫండ్ కలవు. ఈ మూడు ఫండ్‌ల కోసం న్యూ ఫండ్ ఆఫర్ (NFO) జూలై 2 వరకు తెరిచి ఉంటుంది. వీటిలో మీరు కేవలం 500 రూపాయల పెట్టుబడితో కూడా ఈ స్కీమ్‌లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ ఆఫర్‌లను జియో బ్లాక్‌రాక్ ప్లాట్‌ఫామ్ లేదా జీరోధా వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.


జియో బ్లాక్‌రాక్ ఒప్పందం..

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, అమెరికాకు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌రాక్ సంయుక్తంగా ఈ మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించాయి. మే నెలలో సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నుంచి ఈ వ్యాపారానికి అనుమతి లభించింది. ఓపెన్ ఎండెడ్ ఫండ్‌లు అంటే పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఈ స్కీమ్‌లలో షేర్లను కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు.


జియో బ్లాక్‌రాక్ లిక్విడ్ ఫండ్ (Jio BlackRock Mutual Fund)

ఈ ఫండ్ తక్కువ వ్యవధిలో స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే పెట్టుబడిదారుల కోసం రూపొందించబడింది. ఇది 91 రోజుల వరకు రెసిడ్యూవల్ మెచ్యూరిటీ ఉన్న మనీ మార్కెట్, డెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఈ స్కీమ్‌లో ఎక్సిట్ లోడ్ గ్రేడెడ్ విధానంలో ఉంటుంది. మొదటి రోజు 0.0070% నుంచి మొదలుకాగా, 7వ రోజు నాటికి ఎక్సిట్ లోడ్ పూర్తవుతుంది. ఈ ఫండ్‌లో రిస్క్ స్థాయి తక్కువ నుంచి మోడరేట్ వరకు ఉంటుంది. ఇది సురక్షితమైన పెట్టుబడి ఎంపిక కోరుకునేవారికి బెస్ట్ ఛాయిస్.


మనీ మార్కెట్ ఫండ్

ఈ ఫండ్ కూడా స్థిరమైన ఆదాయాన్ని అందించడానికి రూపొందించబడింది. కానీ ఇది ఒక సంవత్సరం వరకు రెసిడ్యూవల్ మెచ్యూరిటీ ఉన్న మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇది కొంచెం ఎక్కువ వ్యవధి కోసం తక్కువ రిస్క్‌తో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి మంచి ఛాయిస్. దీనిలో రిస్క్ స్థాయి కూడా తక్కువ నుంచి మోడరేట్ వరకు ఉండే ఛాన్సుంది.


జియో బ్లాక్‌రాక్ ఓవర్‌నైట్ ఫండ్

ఈ ఫండ్ అతి తక్కువ వ్యవధి కోసం పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రూపొందించబడింది. ఇది ఒక రాత్రి మెచ్యూరిటీ ఉన్న డెట్, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్‌లలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ వడ్డీ రేటు రిస్క్‌ను తగ్గించడానికి రూపొందించబడింది. ఇది ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టాలనుకునేవారికి అనువుగా ఉంటుంది. దీనిలో రిస్క్ స్థాయి తక్కువ నుంచి మోడరేట్ వరకు ఉంటుంది.


ఇవీ చదవండి:

వర్షంలో స్మార్ట్‌ఫోన్ ఇలా ఉపయోగిస్తున్నారా.. డేంజర్ జాగ్రత్త..


సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 30 , 2025 | 05:46 PM