Stock Market Rally: లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లు..సెన్సెక్స్ 1,140 పాయింట్లు జంప్
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:42 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల టర్న్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు సూచీలు మొత్తం గ్రీన్‌లోనే కొనసాగుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రంప్ సుంకాల బ్రేక్ తర్వాత భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు (ఏప్రిల్ 11న) భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ మంచి ఊపుతో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,760 పరిధిలో ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 1140 పాయింట్ల లాభంతో 75,000 స్థాయిలో ఉంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ దాదాపు 700 పాయింట్లు పెరిగి 51,000 పరిధిలో నిలిచింది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ దాదాపు 200 పాయింట్లు పెరుగగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 400 పాయింట్లు పుంజుకుంది. మార్కెట్ 92% బుల్లిష్‌గా కొనసాగుతున్న నేపథ్యంలో మదుపర్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలను దక్కించుకున్నారు.
టాప్ 5 స్టాక్స్
ఈ క్రమంలో ప్రస్తుతం సిప్లా, టాటా మోటార్స్, JSW స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉండగా, ఏసియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ సంస్థల స్టాక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. సెన్సెక్స్ విభాగంలో 30లో 27 స్టాక్స్ లాభాలతో ప్రారంభమయ్యాయి, సన్ ఫార్మా, టాటా స్టీల్, టాటా మోటార్స్ అత్యధిక లాభాలను ఆర్జించాయి. దీంతోపాటు హెచ్‌సీఎల్ మినహా సెన్సెక్స్‌లోని అన్ని భాగాలు ప్రీ ఓపెనింగ్ సెషన్‌లో 6.09 శాతం వరకు లాభపడ్డాయి.
ఊపందుకున్న రూపాయి
మరోవైపు ఈ రోజు ఉదయం మార్కెట్ ఓపెనింగ్‌లో భారత రూపాయి ఊపందుకుంది. డాలర్ ఇండెక్స్ తగ్గుముఖం పట్టగా, చమురు ధరలు పడిపోతుండటంతో రూపాయికి స్వల్పమైన ఊరట లభించింది. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో డాలర్ బలహీనపడటంతో రూపాయికి ఇది మినీ గెలుపుగా చెబుతున్నారు నిపుణులు. బుధవారం ముగింపు స్థాయి అయిన రూ.86.69తో పోలిస్తే, రూపాయి ఈ ఉదయం 45 పైసల లాభంతో రూ.86.24 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. గత మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి మొత్తం రూ.1.45 మేర వెనకడుగు వేసింది. ఈ వెనకడుగు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా పెట్టిన టారిఫ్ చర్యలతో సంబంధముందని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు.
కమోడిటీ మార్కెట్లో ఏం జరిగింది
టారిఫ్ యుద్ధం అనిశ్చితి, బలహీనమైన డాలర్ కారణంగా బంగారం రికార్డు గరిష్టాలకు చేరుకుంది. దేశీయ మార్కెట్లో బంగారం ధర తొలిసారిగా రూ.2200 పెరిగి రూ.92,000 దాటగా, ప్రపంచ మార్కెట్లో బంగారం ధర జీవితకాల గరిష్ట స్థాయి $3240ని తాకింది. వెండి ధర 2.5 శాతం పెరిగి మళ్ళీ $31 పైకి చేరింది. రెండు రోజుల అస్థిరత తర్వాత, ముడి చమురు $63 స్థాయిలో ఉంది. వాణిజ్య యుద్ధంపై జరుగుతున్న గొడవల మధ్య, డాలర్ ఇండెక్స్ 7 నెలల కనిష్ట స్థాయి 100కి దగ్గరగా పడిపోయింది. అయితే 10 సంవత్సరాల US బాండ్ దిగుబడి 5 రోజుల్లో 50 బేసిస్ పాయింట్లు పెరిగి 4.5 శాతానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..
Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి
Read More Business News and Latest Telugu News