India Rupee Hits Low: ట్రంప్ సుంకాల ఎఫెక్ట్.. రూపాయి విలువ మరింతగా పతనం
ABN , Publish Date - Sep 11 , 2025 | 03:56 PM
ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత కరెన్సీ విలువ మరింతగా పతనమైంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో రూ.88.44కు చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ మరింతగా పతనమైంది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ రూ.88.44ల వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. ట్రంప్ సుంకాల నేపథ్యంలో మదుపర్ల నమ్మకం సన్నగిల్లటంతో రూపాయి విలువ అంతకంతకూ తగ్గుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ భారత డెట్, ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదపర్లు 11.7 బిలియన్ డాలర్ల మేర ఉపసంహరించుకున్నారు (Indian Rupee Hits Record Low).
అమెరికా సుంకాల నేపథ్యంలో భారత ఆర్థికాభివృద్ధి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నడుమ భారత ప్రభుత్వం ఇప్పటికే దేశీయంగా వినియోగం పెంచేందుకు పలు చర్యలు చేపట్టింది. జీఎస్టీ పన్నులను భారీగా తగ్గిస్తూ సంస్కరణలకు తెరతీసింది. సెప్టెంబర్ 22 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. మరోవైపు, భారత్, అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈ విషయంలో చర్చల కోసం భారత బృందం త్వరలో అమెరికాలో పర్యటించనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (America Tariffs Investor Confidence).
ప్రస్తుత పరిస్థితుల్లో భారత ఎగుమతిదారులు అనిశ్చితిలో కూరుకుపోయారు. స్వల్పకాలిక ఎగుడుదిగుడులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక రూపాయి బలహీనపడటాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగింది. డాలర్‌ను విక్రయిస్తూ రూపాయి విలువ మరింతగా దిగజారకుండా అడ్డుకుంటోంది. రూపాయి మారకం విలువలో ఎగుడుదిగుడుల ప్రభావాన్ని వీలైనంతగా తగ్గించడమే ఆర్బీఐ చర్యల ముఖ్య ఉద్దేశమని విశ్లేషకులు, బ్యాంకర్లు కామెంట్ చేస్తున్నారు. రూపాయిపై ఒత్తిడి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతర ఆసియా కరెన్సీలు మాత్రం వాణిజ్య అస్థిరతను కొంత మెరుగ్గానే తట్టుకుంటున్నాయని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందా.. సీబీఐసీ ఛైర్మన్ క్లారిటీ
Read More Business News and Latest Telugu News