ఐదేళ్లలో రూ 8 5 లక్షల కోట్ల వాణిజ్యం
ABN , Publish Date - May 07 , 2025 | 05:47 AM
భారత-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఎఫ్‌టీఏతో యూకే మార్కెట్లో భారతీయ ఎగుమతిదారులకు మరింత లబ్ది చేకూరనుందని...
పెట్టుబడులు, జీడీపీ వృద్ధికి ఊతం
భారత్-యూకే వాణిజ్య ఒప్పందంపై ఇండియా ఇంక్
లండన్ : భారత-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ఎఫ్‌టీఏతో యూకే మార్కెట్లో భారతీయ ఎగుమతిదారులకు మరింత లబ్ది చేకూరనుందని పారిశ్రామిక సంఘా లు తెలిపాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత వాతావరణంలో ఈ ఎఫ్‌టీఏతో ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఇన్నోవేషన్ ఆధారిత పరిశ్రమలకు లాభం చేకూరనుందని ఫిక్కీ ప్రెసిడెంట్ హర్ష వర్ధన్ అగర్వాల్ అన్నారు. అంతేకాకుండా 2030 నాటికి భారత్-యూకే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 10,000 కోట్ల డాలర్ల (రూ.8.5 లక్షల కోట్లు)కు చేర్చే అవకాశం లభించనుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడు సంజీవ్ పురి ఆశాభావం వ్యక్తం చేశారు. సుంకాల యుద్ధం నేపథ్యంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఎఫ్‌టీఏ మరింత ప్రాధాన్యత సంతరించుకుందని సీఐఐ యూకే-ఇండియా బిజినెస్ ఫోరం చైర్మన్ కేశవ్ మురుగేశ్ అన్నారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడులకు ఉన్న ఆటంకాలూ తొలగిపోతాయని యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) పేర్కొంది. ఈ ఎఫ్‌టీఏ రెండు దేశాల ఆర్థిక వృద్ధితో పాటు ఉద్యోగాలు, నవకల్పనలకూ దోహదం చేస్తుందని యూకేఐబీసీ చైర్మన్ రిచర్డ్ హీల్డ్ చెప్పారు.
‘ఈయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత బ్రిటన్ కుదుర్చుకున్న అతిపెద్ద ఎఫ్‌టీఏ ఇదే. భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. బ్రిటన్‌కు 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం 8,000 కోట్ల పౌండ్లకుపైగా పెరిగేందుకు ఈ ఎఫ్‌టీఏ ప్రేరకం కానుంది’ అని ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) యూకే చాప్టర్ చైర్మన్ లార్డ్ కరన్ బిల్లీమోరియా చెప్పారు.
మరోవైపు ఈ ఒప్పందాన్ని నాస్కామ్ కూడా స్వాగతించింది. భారత టెక్నాలజీ కంపెనీలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న డబుల్ కంట్రిబ్యూషన్ భారం వంటివి తొలగిపోనున్నాయని, ఇది ఈ రంగానికి ఎంతగానో మేలు చేకూర్చనుందని పేర్కొంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ రంగాల్లో మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఎఫ్‌టీఏతో లభించనుందని నాస్కామ్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Indian Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..ఈ కంపెనీలకు బిగ్ లాస్
ATM Cash Withdrawal: ఈ ప్రాంతాల్లో భారీగా నగదు వాడకం..ప్రతి ఏటీఎం నుంచి రూ.1.3 కోట్లు విత్ డ్రా..
Read More Business News and Latest Telugu News