India's GDP: దూసుకుపోతున్న భారత జీడీపీ.. ఈసారి వృద్ధి రేటు ఎంతో తెలిస్తే..
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:38 PM
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 8.2 శాతం మేర వృద్ధి చెందింది. గత ఆరు త్రైమాసికాలతో పోలిస్తే ఇదే అత్యధికం. భారత్ 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా సగటున 8 శాతం వృద్ధి సాధించాలి.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా సుంకాలు కొనసాగుతున్న వేళ భారత్ కళ్లు చెదిరే వృద్ధి రేటును సాధించింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో (July-September Quarter) జీడీపీ ఏకంగా 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. ఇక గత ఆరు త్రైమాసిక గణాంకాలతో పోలిస్తే ఈసారి అత్యధిక జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీ సంస్కరణలు భారత దేశ జీడీపీకి కొత్త ఊపునిచ్చాయి. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో పారిశ్రామిక రంగంలో ఉత్పత్తి పెరగడంతో జీడీపీపై సానుకూల ప్రభావం పడింది. జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 14 శాతమన్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నామినల్ జీడీపీ కూడా 8.7 శాతం మేర వృద్ధి చెందింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2021-22 మధ్య కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.7 శాతం మేర పెరిగింది. ఆ మరుసటి ఏడాది 7.2 శాతం వృద్ధి నమోదైంది (India's GDP Growth Rate At 8.2%).
అమెరికాతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలకు తెర తీసింది. వ్యవసాయం సహా అనేక రంగాల్లో పన్నులకు భారీ స్థాయిలో కోతపెట్టింది. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఏటా సగటున 8 శాతం జీడీపీ వృద్ధి రేటును సాధించాల్సి ఉంటుంది. ఇలా రెండు దశాబ్దాల పాటు దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడితే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది. ఇక భారత ఆర్థిక వ్యవస్థ ఏటా 7.8 శాతం మేర వృద్ధి చెందాలనేది ప్రపంచబ్యాంకు అంచనా. ఇందుకోసం దేశంలో భారీ ఎత్తున సంస్కరణలు తీసుకురావాలని వరల్డ్ బ్యాంకు తెలిపింది. వీటి అమలకు కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇవీ చదవండి:
వరుస లాభాలకు బ్రేక్..ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
త్వరలో బంగారం రుణాల్లోకి పిరామల్ ఫైనాన్స్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి