Income Tax: ఆదాయపు పన్ను శాఖ మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్ చెక్ చేస్తుందా?
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:03 AM
ఏప్రిల్ 1, 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖ మీ సోషల్ మీడియా, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేయగలదా? ఈ ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆందోళనకు గురించేస్తోంది. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 23: ఆదాయపు పన్ను శాఖ మన సోషల్ మీడియా, ఈమెయిల్స్‌ను చెక్ చేస్తుందా?.. ఏప్రిల్ 1, 2026 నుంచి మన సోషల్ మీడియా హ్యాండిల్స్, ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేయగలదా? అనే అనుమానాలు ఇప్పుడు చాలా మందికి కలుగుతున్నాయి. దీనికి కారణం ఇలాంటి ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటమే.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు పోస్ట్ ప్రకారం, ఏప్రిల్ 1, 2026 నుంచి పన్ను ఎగవేతను అరికట్టడానికి ప్రజల ఈమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే అధికారం ఆదాయపు పన్ను (ఐటీ) శాఖకు లభిస్తుందని పేర్కొంది.
ఈ వార్త చాలా మంది పన్ను చెల్లింపుదారుల్లో ఆందోళన కలిగించింది. అయితే, ఈ క్లెయిమ్ తప్పుడు, మిస్‌లీడింగ్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 247 ప్రకారం, ఐటీ శాఖకు డిజిటల్ స్పేస్‌లను యాక్సెస్ చేసే అధికారం కేవలం సెర్చ్ ఇంకా సర్వే ఆపరేషన్స్ సమయంలో మాత్రమే ఉంటుంది.
అంటే, పెద్దఎత్తున పన్ను ఎగవేత ఆధారాలు ఉన్న సీరియస్ కేసుల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. సాధారణ పన్ను చెల్లింపుదారుల రోజువారీ డేటాను లేదా ప్రైవసీని దీని ద్వారా ఉల్లంఘించరు. ఈ అధికారాలు 1961 చట్టం నుంచే ఉన్నవి, కొత్తగా ఏమీ జోడించలేదు. మాస్ సర్వైలెన్స్ లేదా అందరి ఖాతాలను చెక్ చేయడం జరగదు.
ఇవీ చదవండి: