How to Handle GST on Post Sale: పోస్ట్ సేల్ డిస్కౌంట్‌పై జీఎ్‌సటీ ఎలా
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:03 AM
ఉత్పత్తిదారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో భాగంగా పలు ప్రోత్సాహకాలను డీలర్లకు ఇస్తుంటారు. వీటిలో చాలా వరకు క్రెడిట్ నోట్ ద్వారా ఇస్తుంటారు. ఇలా వివిధ సందర్భాల్లో డీలర్లు పొందే క్రెడిట్ నోట్స్‌ను...
ఉత్పత్తిదారులు తమ వ్యాపారాన్ని పెంచుకోవడంలో భాగంగా పలు ప్రోత్సాహకాలను డీలర్లకు ఇస్తుంటారు. వీటిలో చాలా వరకు క్రెడిట్ నోట్ ద్వారా ఇస్తుంటారు. ఇలా వివిధ సందర్భాల్లో డీలర్లు పొందే క్రెడిట్ నోట్స్‌ను జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఎలా చూడాలనే విషయంలో పలు సందేహాలు ఉన్నాయి. అంటే క్రెడిట్ నోట్‌కు సంబంధించి ఐటీసీ రివర్స్ చేయాల్సి ఉంటుందా? లేదా ఆ మొత్తం మీద పన్ను చెల్లించాలా? ఇలా పలు సందేహాలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల వివరణ ఇచ్చింది. వివిధ సందర్భాల్లో ఇచ్చే క్రెడిట్ నోట్స్‌ను జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఎలా అర్ధం చేసుకోవాలి. డీలర్లు పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.
మొదటిది, పోస్ట్ డిస్కౌంట్‌కు సంబంధించి ఇచ్చే క్రెడిట్ నోట్స్. కంపెనీలు, డీలర్లకు సరుకులు కొనుగోలు చేసే సమయానికే కొంత డిస్కౌంట్ ఇవ్వటం ఒక విధానం కాగా, వార్షిక, త్రైమాసిక, నెలవారీ లక్ష్యాలను చేరుకుంటే అదనంగా డిస్కౌంట్ ఇవ్వటం మరో విధానం. రెండోది పోస్ట్ సేల్ డిస్కౌంట్. ఉదాహరణకు ఒక డీలర్ ఒక త్రైమాసికంలో రూ.కోటి విలువైన సరుకు కొనుగోలు చేస్తే 5 శాతం అదనపు డిస్కౌంట్ ఇస్తామని ఒప్పందం ఉంటే, టార్గెట్ నెరవేరిన తర్వాత మాత్రమే ఆ డిస్కౌంట్ వర్తిస్తుంది. కాబట్టి, అది ఇన్వాయి్‌సలో ముందు చూపబడదు. తర్వాత కంపెనీ, ఆ డీలర్‌కు క్రెడిట్ నోట్ జారీ చేస్తుంది. ఈ క్రెడిట్ నోట్స్ రెండు రకాలు. మొదటిది, జీఎ్‌సటీ చట్టం ప్రకారం పన్నుతో కలిపి ఇచ్చే క్రెడిట్ నోట్. రెండోది, కేవలం రెండు పార్టీల మధ్య లెక్క సర్దుబాటు కోసం ఇచ్చే క్రెడిట్ నోట్. దీన్ని కమర్షియల్ లేదా ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్ అంటారు. జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి క్రెడిట్ నోట్ తీసుకుంటే దానికి సరిపోను ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే కమర్షియల్ క్రెడిట్ నోట్ పొందినప్పుడు కూడా ఐటీసీ రివర్స్ చేయాల్సి ఉంటుందా అని? ప్రభుత్వ వివరణ ప్రకారం పోస్ట్ సేల్ డిస్కౌంట్‌ను కమర్షియల్ క్రెడిట్ నోట్ ద్వారా అందిస్తే ఐటీసీ రివర్స్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే జీఎ్‌సటీ చట్టం ప్రకారం సాధారణ క్రెడిట్ నోట్ ద్వారా డిస్కౌంట్ ఇస్తే, సరఫరాదారు (కంపెనీ) తన అవుట్‌పుట్ ట్యాక్స్‌ను తగ్గించుకునే సౌలభ్యం ఉంది. అంటే, ముందుగా ప్రభుత్వానికి చెల్లించిన పన్ను నుంచి క్రెడిట్ నోట్ మేరకు పన్ను తగ్గించుకోవచ్చు. కాబట్టి, ఆ మేరకు డీలర్ ఐటీసీని రివర్స్ చేయాల్సి ఉంటుంది. అదే కమర్షియల్ క్రెడిట్ నోట్ ఇచ్చినప్పుడు ఈ విధంగా పన్ను సర్దుబాటు చేసుకునే సౌలభ్యం సరఫరాదారునికి లేదు. అంటే ప్రభుత్వానికి చెల్లించిన పన్నులో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి డీలర్ ఐటీసీ రివర్స్ చేయనవసరం లేదు. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.
ఒక డీలర్ ఒక కంపెనీ నుంచి రూ.10 లక్షల విలువైన సరుకును కొన్నాడు. పన్ను 18 శాతంతో కలిపి మొత్తం రూ.11.80 లక్షలు చెల్లించాడు. టార్గెట్ పూర్తి చేసినందుకు గాను కంపెనీ 5 శాతం పోస్ట్ సేల్ డిస్కౌంట్‌ను క్రెడిట్ నోట్ ద్వారా అందించటం జరిగింది. ఒకవేళ కంపెనీ ఈ మొత్తాన్ని సాధారణ క్రెడిట్ ద్వారా అంటే రూ.50,000 ప్లస్ జీఎ్‌సటీ (రూ.9,000)తో కలిపి రూ.59,000కు ఇస్తే జీఎ్‌సటీ రూ.9,000ను కంపెనీ తదుపరి తగ్గించుకుంటుంది. కాబట్టి డీలర్ ఐటీసీ రివర్స్ చేయాలి. అలాకాకుండా కంపెనీ ఫైనాన్షియల్ క్రెడిట్ నోట్‌ను కేవలం రూ.50,000కు మాత్రమే ఇస్తే అప్పటికే చెల్లించిన పన్నులో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి డీలర్ ఐటీసీ రివర్స్ చేయనవసరం లేదు.
అలాగే చాలా ఇండస్ట్రీల్లో ముఖ్యంగా ఎలకా్ట్రనిక్స్ రంగంలోని తయారీదారులు.. డీలర్లు తమ అమ్మకాలు పెంచుకోవటానికి వీలుగా అదనపు డిస్కౌంట్స్ ఇస్తాయి. ఇలా ఇచ్చే అదనపు డిస్కౌంట్స్‌ను డీలర్లు.. వినియోగదారులకు ఇస్తారు. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలో వస్తువులు దొరుకుతాయి. అమ్మకాలు పెరుగుతాయి. ఈ సందర్భంలో వచ్చే సందేహం ఏమిటంటే.. తయారీదారు ఇచ్చిన డిస్కౌంట్‌ను కూడా ఆ వస్తువు అమ్మకానికి సంబంధించి పొందిన చెల్లింపుగా డీలర్ పరిగణించి దానిపైన కూడా పన్ను చెల్లించాలా అని? ఇక్కడ కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఒకసారి సరుకు ఉత్పత్తిదారుని నుంచి డీలర్ పొందితే ఉత్పత్తిదారుడికి ఆ వస్తువు మీద ఎలాంటి హక్కులు ఉండవు. కాబట్టి ఆ డిస్కౌంట్‌ను డీలర్.. వినియోగదారునికి చేసిన అమ్మకం తాలుకు చెల్లింపు కింద భావించనవసరం లేదు. దీనికి సంబంధించి ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే తక్కువ ధరకే వస్తువును అందించటానికి గాను కొన్ని సందర్భాల్లో ఉత్పత్తిదారునికి, వినియోగదారునికి మధ్య నేరుగా అగ్రిమెంట్ ఉంటుంది. అలాంటప్పుడు కంపెనీ ఆ డిస్కౌంట్‌ను డీలర్ ద్వారా అందిస్తుంది. తద్వారా ఆ డిస్కౌంట్ వినియోగదారునికి చేరటానికి వీలుగా. అప్పుడు మాత్రమే డీలర్ ఆ డిస్కౌంట్ మొత్తాన్ని కన్సిడరేషన్ కింద భావించి తగు జీఎ్‌సటీ చెల్లించాలి.
ఇకపోతే చాలా సందర్భాల్లో డీలర్ తన అమ్మకాలు పెంచుకునేందుకు కొన్ని సర్వీ్‌సలు, సేవలు చేస్తుంటాడు. ఉదాహరణకు సేల్స్ మేళా, ప్రకటనలు, ఎగ్జిబిషన్స్ మొదలైనవి. ఇవన్నీ డీలర్ తన కోసం కాకుండా కంపెనీ కోసం చేస్తున్నాడు. కాబట్టి కంపెనీలు ఇచ్చే పోస్ట్ సేల్ డిస్కౌంట్స్‌ను డీలర్ చేసిన ఇలాంటి సర్వీ్‌సకు సంబంధించిన చెల్లింపుగా భావించి జీఎ్‌సటీ చెల్లించాలా? అనే సందేహం కూడా ఉండేది. ఇక్కడ కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఎప్పుడైతే డీలర్‌కు కంపెనీ మధ్య ఒక సర్వీ్‌సకు సంబంధించి చెల్లింపుతో కూడిన అగ్రిమెంట్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ డీలర్ కంపెనీ నుంచి పొందిన మొత్తాన్ని ఆ సర్వీ్‌సకు సంబంధించిన ప్రతిఫలంగా భావించాలి. అప్పుడు మాత్రమే తగిన జీఎ్‌సటీ చెల్లించాలి.
ప్రభుత్వం ఇచ్చిన ఈ వివరణల ద్వారా ఏదేనీ ప్రత్యేక సందర్భాల్లో తప్ప, సాధారణ పరిస్థితుల్లో పొందే ఫైనాన్షియల్ లేదా కమర్షియల్ క్రెడిట్ నోట్స్ మీద ఐటీసీ రివర్స్ లేదా జీఎ్‌సటీ చెల్లింపు అవసరం లేదు. కాకపోతే, డీలర్లు తాము పొందే క్రెడిట్ నోట్స్ మీద పూర్తి అవగాహన పొంది ఉండాలి.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
అలా ఉంటే జగన్ తట్టుకోలేడు... పల్లా షాకింగ్ కామెంట్స్
కల్తీ మద్యానికి మూల విరాట్ జగన్..
Read Latest AP News And Telugu News