Share News

HCL Tech Reports Q2 results: హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ 4235 కోట్లు

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:19 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) హెచ్‌సీఎల్‌ టెక్‌ రూ.4,235 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది....

HCL Tech Reports Q2 results: హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ 4235 కోట్లు

రూ.31,942 కోట్ల ఆదాయం

  • ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌

  • వరుసగా 91వ త్రైమాసిక డివిడెండ్‌ ఇది

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) హెచ్‌సీఎల్‌ టెక్‌ రూ.4,235 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదిక లాభంలో ఎలాంటి వృద్ధి లేనప్పటికీ, ఈ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో నమోదైన రూ.3,843 కోట్ల లాభంతో పోలిస్తే 10.2 శాతం పెరిగింది. ఈ క్యూ2లో కంపెనీ ఏకీకృత ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన 10.6 శాతం పెరిగి రూ.31,942 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి ఆదాయం రూ.28,862 కోట్లుగా నమోదైంది. ఈ క్యూ1లో నమోదైన రూ.30,349 కోట్ల రెవెన్యూతో పోలిస్తే 5.25 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఆదాయం వృద్ధి అంచనాను గతంలో ప్రకటించిన 3-5 శాతంగా కొనసాగించినప్పటికీ, సేవల ఆదా య వృద్ధి అంచనాను మాత్రం 3-5 శాతం నుంచి 4-5 శాతానికి మెరుగుపరిచింది.

కాగా, ఈ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా హెచ్‌సీఎల్‌ టెక్‌ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. డివిడెండ్‌కు అర్హులైన వాటాదారుల ఎంపికకు రికార్డు తేదీని ఈ నెల 17గా నిర్ణయించిన కంపెనీ.. 28న చెల్లింపులు చేపట్టనుంది. హెచ్‌సీఎల్‌ వరుసగా 91 త్రైమాసికాలుగా డివిడెండ్‌ ప్రకటిస్తూ వస్తోంది.

  • గడిచిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ఉద్యోగులు నికరంగా 3,489 మంది పెరిగి 2,26,640కి చేరుకున్నారు. గత మూడు నెల ల్లో కొత్తగా 5,196 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా, ఈ క్యూ2లో ఉద్యోగుల వలసల రేటు 12.6 శాతానికి తగ్గింది.

  • గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈసారి ఫ్రెషర్ల నియామకాలను గణనీయంగా పెంచాలన్నది ఆలోచన. గత ఏడాది హైరింగ్‌తో పోలిస్తే, ఈ ప్రథమార్ధంలో దాదాపు 92% నియామకాలు చేపట్టినట్లు హెచ్‌సీఎల్‌ టెక్‌ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రామ్‌ సుంద ర రాజన్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రణాళికకు అనుగుణంగా ద్వితీయార్ధంలో మిగతా నియామకాలను చేపడతామన్నారు.

  • ఉద్యోగులందరికీ వేరియబుల్‌ చెల్లింపులను వారి జీతంలో ‘ఫిక్స్‌డ్‌ పే’లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ.. ఈ నెల నుంచి వేతనాలను పెంచుతున్నట్లు తెలిపింది.


గ్లోబల్‌ డెలివరీ మోడల్‌ను బలోపేతం చేసుకుంటూ రావడం ద్వారా కంపెనీ వ్యూహాత్మకంగా హెచ్‌1బీ వీసాలపై ఆధారపడటం తగ్గించుకుంటూ వచ్చింది. అమెరికాలో స్థానిక నియామకాలను, శిక్షణ ను పెంచడం ద్వారా స్థానికీకరణను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం.

సీ విజయ్‌ కుమార్‌,

సీఈఓ, ఎండీ, హెచ్‌సీఎల్‌ టెక్‌

ఈ వార్తలు కూడా చదవండి...

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2025 | 04:19 AM