Share News

GST Reforms Boost: వృద్ధి ఉద్యోగాల కల్పనకు ఊతం

ABN , Publish Date - Sep 04 , 2025 | 05:43 AM

ప్రభుత్వం బుధవారం ప్రకటించిన జీఎస్‌టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి, ఉపాధికల్పనకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఒక పక్క భౌగోళిక, రాజకీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాలును ఎదుర్కొంటోంది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు...

GST Reforms Boost: వృద్ధి ఉద్యోగాల కల్పనకు ఊతం

జీఎస్‌టీ సంస్కరణలపై హర్షాతిరేకాలు

ప్రభుత్వం బుధవారం ప్రకటించిన జీఎస్‌టీ సంస్కరణలు ఆర్థిక వృద్ధికి, ఉపాధికల్పనకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. ఒక పక్క భౌగోళిక, రాజకీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సవాలును ఎదుర్కొంటోంది. మరోపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల పోటు ఎగుమతుల రంగానికి తీరని కాటుగా పరిణమించింది. గత కొద్ది కాలంగా ఎగుమతుల రంగం భారీ తిరోగమనంలో ఉంది. సుంకాల ప్రభావం వల్ల రాబోయే కాలంలో ఎగుమతులు భారీగా పడిపోవచ్చునన్న భయాలు కూడా సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య దేశీయ వినియోగాన్ని గణనీయంగా పెంచుతుందని, తద్వారా ఎగుమతుల నష్టాన్ని భర్తీ చేస్తుందని విశ్లేషకులంటున్నారు. దీనికి తోడు దేశంలో పండుగల సీజన్‌ ప్రారంభమవుతోంది. ఈ సీజన్‌లో వస్తు సేవల వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం కావడానికి ఈ చర్య దోహదపడుతుందన్నది వారి అభిప్రాయం. దేశంలో జీఎ్‌సటీ ప్రవేశపెట్టిన తర్వాత తొలి భారీ ప్రక్షాళన ఇదే. ఈ చర్యల ఫలితంగా ప్రభుత్వం పన్నుల రూపేణ ఆదాయాన్ని నష్ట పోయినా, దేశీయ వినియోగం భారీగా పెరిగి ఆర్థిక వ్యవస్థ సుంకాల పోటు నుంచి చాలా వరకు బయట పడుతుందని ఆర్థిక నిపుణుల అంచనా. దీంతో ఇప్పటి వరకు నీరసించిన ప్రైవేటు పెట్టుబడులు సైతం ఊపందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే జీడీపీ వృద్ధి రేటుకూ ఢోకా ఉండదని అంచనా. ఇప్పటివరకు ఉన్న శ్లాబ్‌లను రెండు శ్లాబ్‌లకు కుదించడం ద్వారా సగటు మనిషి వినియోగించే అనేక వస్తువులు 5 శ్లాబ్‌లోకి జారుకుని సగటు జీవికి ఉపశమనం కలుగుతుంది. దీన్ని దేవీ నవరాత్రులు, దీపావళి ముందు ప్రభుత్వం ప్రకటించిన బొనాంజాగా నిపుణులు, పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈ సంస్కరణలు సగటు జీవిపైనే కాకుండా రైతాంగం, చిన్న వ్యాపారులపై కూడా భారాన్ని గణనీయంగా తగ్గిస్తాయన్నది వారి అభిప్రాయం. ఇది సగటు జీవికి అసలైన పండుగ అని ప్రభుత్వాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.


పురోగామి చర్య : ఎంట్రీ లెవల్‌ టూ వీలర్లు, కార్లపై విధించే జీఎ్‌సటీని 28 శాతం నుంచి 18 శాతానికి కుదించడంపై ఆటోమొబైల్‌ పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. ‘జీఎ్‌సటీ రేట్లను హేతుబద్ధం చేయాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం. ప్రభుత్వం ఎట్టకేలకు మా మొర ఆలకించింది’ అని మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్‌ అయ్యర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని ఆయన సరైన సమయంలో తీసుకున్న పురోగామి చర్యగా అభివర్ణించారు.ఈ చర్య తప్పకుండా దేశంలో కార్ల డిమాండ్‌ను పెంచుతుందన్నారు. అన్ని రకాల ఆటోమొబైల్‌ విడి భాగాలను 28 శాతం జీఎ్‌సటీ నుంచి 18 శాతం జీఎ్‌సటీ శ్లాబులోకి మార్చడంపై ఆ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే ఆటోమోటివ్‌ కంపోనెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) ప్రశంసించింది. ఎప్పటి నుంచో అడుగుతున్న తమ ఈ కోరికను ప్రభుత్వం ఇన్నాళ్లకు మన్నించిందని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా తెలిపారు.

ఎగుమతిదారుల హర్షం: ఇక నుంచి వారం రోజుల్లోనే జీఎ్‌సటీ రిఫండ్స్‌ ప్రక్రియ పూర్తి కానుంది. ఇది ఎగుమతిదారుల నిధుల కొరత సమస్యనూ తీరుస్తుందని భారత ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 వరకు ఉన్న జీఎ్‌సటీ రిఫండ్‌లను అనుమతించడం ఇ-కామర్స్‌ ఎగుమతిదారులకు పెద్ద ఊరట అన్నారు.

ద్రవ్యోల్బణం కట్టడికి దోహదం: జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు వస్తు, సేవల వినియోగం భారీగా పెరగడంతోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకూ ఊతమివ్వవనుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. మరింత సరళమైన, పారదర్శకమైన, సమగ్ర పన్ను వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు తాజా సంస్కరణలు దోహదపడనున్నాయని మహీంద్రా గ్రూప్‌ సీఈఓ, ఎండీ డాక్టర్‌ అనిశ్‌ షా అన్నారు.


రియల్టీ, మౌలిక రంగాలకు బూస్ట్‌ : సిమెంట్‌, స్టీల్‌పై జీఎ్‌సటీని 28 శాతం నుంచి 18 శాతం తగ్గించడం రియల్‌ ఎస్టేట్‌, మౌలిక రంగాల నిర్మాణ వ్యయాలను గణనీయంగా తగ్గించనుందని నరెడ్కో జాతీయ అధ్యక్షుడు, హీరానందిని గ్రూప్‌ చైర్మన్‌ నిరంజన్‌ హీరానందిని అన్నారు. ముఖ్యంగా అందుబాటు గృహ ప్రాజెక్టులకు లబ్ది చేకూరనుందని, నిర్మాణ వ్యయం తగ్గితే కొనుగోలుదారులకు ఈ గృహాలు మరింత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు.

వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి తోడ్పాటు: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన చేర్చాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం జీడీపీ ఏటా 7 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ట్రంప్‌ 50 శాతం సుంకాలతో ఎగుమతి ఆధారిత రంగాల వ్యాపారంపై ప్రభావం చూపనున్న తరుణంలో జీఎ్‌సటీ రేట్ల తగ్గింపు దేశీయంగా వినియోగాన్ని పెంచి వృద్ధి రేటుకు అండగా నిలవనుందని హీరానందాని అన్నారు.


స్టాక్‌ మార్కెట్‌ పరుగే

జీఎ్‌సటీ నిర్ణయం గురువారం స్టాక్‌మార్కెట్‌కు పెద్ద ఉత్తేజం కావచ్చునని మార్కెట్‌ నిపుణులంటున్నారు. ఇటీవల కాలంలో ఈక్విటీ, ఫారెక్స్‌ మార్కెట్లు భారీ ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో మార్కెట్‌ తాత్కాలికంగా ఊపిరి తీసుకోవడం ఖాయమని, గురువారం మార్కెట్‌ సానుకూలంగా స్పందించవచ్చునని పరిశీలకులన్నారు.

చిన్న కార్ల ధరలు

ఎంత తగ్గొచ్చు..?

4మీటర్లలోపు వాహనాల విభాగంలో 1200 సీసీ వరకు పెట్రోల్‌ కార్లపై ప్రస్తుతం 28 శాతం జీఎ్‌సటీతోపాటు ఒక శాతం సెస్సు కూడా చెల్లించాల్సి ఉంటుంది. 1500 సీసీ వరకు డీజిల్‌ కార్లపై కేంద్రం 28 శాతం జీఎస్‌టీతోపాటు 3 శాతం సెస్సు వసూలు చేస్తోంది. ఈ విభాగ కార్లను తాజాగా 18 శాతం శ్లాబులో చేర్చారు. దీంతో చిన్న, హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్ల ధరలు 8-10 శాతం వరకు తగ్గవచ్చని అంచనా వేసింది. మారుతి సుజుకీ చిన్న కారు ఆల్టో కే10 ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.4..23 లక్షల నుంచి రూ.3.89 లక్షలకు తగ్గే అవకాశం ఉంది. హ్యుండయ్‌ హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ గ్రాండ్‌ ఐ10 మోడల్‌ రేటు రూ.5.98 లక్షల నుంచి రూ.5.51 లక్షలకు దిగిరావచ్చు. రెనో క్విడ్‌ ఎక్స్‌ షోరూమ్‌ ధర కూడా రూ.40,000 వరకు తగ్గవచ్చని అంచనా.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 04 , 2025 | 05:43 AM