GST on Sale of Land Plots: లే అవుట్స్‌లోని స్థలాలు అమ్ముతుంటే జీఎస్‌టీ చెల్లించాలా
ABN , Publish Date - Oct 26 , 2025 | 05:53 AM
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లతో పోల్చుకుంటే ఈ ఎనిమిది సంవత్సరాలలో వివిధ రంగాలకు సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుంటే మొదట్లో నివాసిత (రెసిడెన్షియల్) అపార్ట్‌మెంట్ల అమ్మకానికి
జీఎ్‌సటీ అమల్లోకి వచ్చిన తొలినాళ్లతో పోల్చుకుంటే ఈ ఎనిమిది సంవత్సరాలలో వివిధ రంగాలకు సంబంధించి చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకుంటే మొదట్లో నివాసిత (రెసిడెన్షియల్) అపార్ట్‌మెంట్ల అమ్మకానికి 12 శాతం పన్ను ఉండేది. 2019 నుంచి దీన్ని 5 శాతానికి తగ్గించటం జరిగింది. అలాగే మొదట్లో ఉన్న ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సదుపాయాన్ని తొలగించారు. అయితే వాణిజ్య పరిధిలోకి వచ్చే కమర్షియల్ అపార్ట్‌మెంట్స్‌కు మాత్రం పన్ను శాతంలో గానీ, ఐటీసీ విషయంలో కానీ ఎలాంటి మార్పులు చేయలేదు. మొత్తానికి, నిర్మాణ రంగానికి సంబంధించిన జీఎస్‌టీలో కొంత స్పష్టత ఉన్నప్పటికీ లే అవుట్ వేసి ప్లాట్లను విక్రయించటం.. అంటే స్థలాల అమ్మకం విషయంలో జీఎ్‌సటీకి సంబంధించి కొంత గందరగోళం ఉంది. దీనికి ముఖ్య కారణం.. ఈ రంగం ఇంకా అసంఘటితంగానే ఉండటం, అలాగే నిర్మాణ రంగంతో పోలిస్తే వీరికి ఆడిటర్లు, అసోసియేషన్స్ గానీ ఉండవు. అంతేకాకుండా సరైన సలహా ఇచ్చే వారు సాధారణంగా ఉండరు. కాబట్టి లే అవుట్స్‌లోని ప్లాట్లు విక్రయించే టప్పుడు జీఎ్‌సటీ చెల్లించాలా? వద్దా? అనే విషయంలో ఈ రంగంలోని వారికి కొంత అవగాహనా లోపం ఉంది.
సర్వీస్ కిందకు వచ్చేవి ఏమిటంటే..
వివరంగా చెప్పాలంటే, జీఎ్‌సటీ చట్టంలోని నిర్వచనాల ప్రకారం.. అపార్ట్‌మెంట్లకు సంబంధించి ఒక ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి ప్రాజెక్ట్ పూర్తయి కంప్లీషన్ సర్టిఫికెట్ వచ్చే వరకు జరిపే అమ్మకాలను ‘సర్వీస్’ కింద భావిస్తారు. కాబట్టి వీటి మీద జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘రెరా’ చట్టం ప్రకారం ప్రమోటర్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అనే నిర్వచనం కేవలం నిర్మాణ రంగానికే కాకుండా ఖాళీ లేదా వ్యవసాయ భూములను ప్లాట్లుగా అంటే ‘లే అవుట్’గా అభివృద్ధి చేయటానికి కూడా వర్తిస్తుంది. దీంతో ఒక వ్యక్తి కొంత స్థలాన్ని లే అవుట్‌గా డెవలప్ చేసి అందులోని స్థలాలను అమ్మటం అనేది జీఎ్‌సటీ వర్తించే అంశం అని ఒక వాదన. దీనికి కారణం ఏమిటంటే, ఒక లే అవుట్‌లో డెవల్‌పమెంట్ జరిగే దశలో ప్లాట్లు అమ్మటం అనేది కంప్లీషన్ సర్టిఫికెట్ రాక ముందు అపార్ట్‌మెంట్లను అమ్మటంతో సమానం. ఎందుకంటే, ఇందులో స్థలం మాత్రమే కాకుండా రోడ్లు, కాలువలు, పార్క్ మొదలైన వాటితో కూడిన డెవల్‌పమెంట్ అనే అంశం ముడిపడి ఉంది. ప్రమోటర్ కేవల స్థలానికే కాకుండా డెవల ప్‌మెంట్‌కు కలిపి డబ్బులు తీసుకుంటాడు. దీంతో ఇది కూడా సర్వీస్ కింద భావిస్తూ తగిన జీఎ్‌సటీ చెల్లించాలనేది ఒక వాదన. కానీ, జీఎ్‌సటీ చట్టం ప్రకారం పొలాలు, స్థలాలు అంటే భూమి అమ్మకం అనేది జీఎ్‌సటీలోకి వచ్చే అంశం కాదు. కాబట్టి ఇదే మినహాయింపు లే అవుట్ ప్లాట్లకు కూడా వర్తిస్తుందని ఇంకొక ఆలోచన.
ప్రభుత్వ మార్గదర్శకాలు
ఈ గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ రంగానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. దీని ప్రకారం, ఏదేనీ ఒక లే అవుట్‌లో అమ్మే స్థలాలకు ఎటువంటి జీఎ్‌సటీ వర్తించదు. అంటే లే అవుట్ డెవల్‌పమెంట్ జరిగే దశలో కావచ్చు లేదా పూర్తయిన తర్వాత కావచ్చు.. ఎప్పుడు అమ్మినా ఆ ప్లాట్ల మీద ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. ఇదే సమయంలో మరొక వివరణ ఇవ్వటం జరిగింది.
లే అవుట్ డెవల్‌పమెంట్‌కు సంబంధించి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే అంటే భూమి చదును చేయటం, అంతర్గత రోడ్లు, కాలువల నిర్మాణం లేదా పార్క్ ఏర్పాటు మొదలైన పనులను ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే.. సదరు కాంట్రాక్టర్ ఆ మొత్తం మీద జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకానీ, ప్లాట్ కొనుగోలుదారుడు ఎలాంటి జీఎ్‌సటీ చెల్లించనవసరం లేదు. కాబట్టి ప్రమోటర్, కొనుగోలుదారులు, కాంట్రాక్టర్లు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవటం అత్యంత ఆవశ్యకం.
రాంబాబు గొండాల
గమనిక: కేవలం అవగాహన కల్పించటం కోసం మాత్రమే ఇందులో కొన్ని ముఖ్య విషయాలను ప్రస్తావించటం జరిగింది. పూర్తి వివరాలకు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు
Read Latest AP News And Telugu News