GST Collections: జీఎస్‌టీ వసూళ్లు రూ 1.86 లక్షల కోట్లు
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:37 AM
ఈ ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం వృద్ధితో రూ.1.86 లక్షల కోట్లు దాటాయి. దేశీయంగా వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది...
ఆగస్టులో 6.5 శాతం పెరుగుదల
ఏపీలో 21%, తెలంగాణలో 12% వృద్ధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) స్థూల వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.5 శాతం వృద్ధితో రూ.1.86 లక్షల కోట్లు దాటాయి. దేశీయంగా వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. పండగ సీజన్ కూడా ప్రారంభమవడంతో మున్ముందు నెలల్లో జీఎ్‌సటీ వసూళ్లు మరింత పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ జూలైలో నమోదైన రూ.1.96 లక్షల కోట్ల ఆదాయంతో పోలిస్తే మాత్రం గత నెలలో వసూళ్లు కాస్త తగ్గాయి. మరిన్ని విషయాలు..
ఆగస్టులో దేశీయ ఆర్థిక లావాదేవీల నుంచి వసూలైన స్థూల పన్ను ఆదాయం వార్షిక ప్రాతిపదికన 9.6 శాతం పెరిగి రూ.1.37 లక్షల కోట్లుగా నమోదైంది. దిగుమతుల నుంచి పన్ను వసూళ్లు మాత్రం 1.2 శాతం తగ్గి రూ.49,354 కోట్లకు పరిమితం అయ్యాయి.
ఆగస్టులో జీఎ్‌సటీ రిఫండ్లు వార్షిక ప్రాతిపదికన 20 శాతం తగ్గి రూ.19,359 కోట్లుగా నమోదయ్యాయి. అందులో ఎగుమతులకు సంబంధించిన రిఫండ్లు రూ.8,346 కోట్లకు తగ్గడం సుంకాల ప్రభావానికి స్పష్టమైన సంకేతమని ఈవై ట్యాక్స్ పార్ట్‌నర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు.
రిఫండ్ల అనంతరం జీఎ్‌సటీ నికర ఆదాయం రూ.1.67 లక్షల కోట్లుగా ఉంది. 2024 ఆగస్టులో నమోదైన నికర ఆదాయంతో పోలిస్తే 10.7 శాతం అధికం ఇది.
పండగ సీజన్‌లో డిమాండ్ వృద్ధి నవంబరు వరకు కొనసాగనుందని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఎంఎస్ మణి అన్నారు. అయితే, ప్రతిపాదిత జీఎ్‌సటీ రేట్ల తగ్గింపుతో మాత్రం వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టవచ్చన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎ్‌సటీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ.3,989 కోట్లకు చేరగా.. తెలంగాణలో వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.5,103 కోట్లకు పెరిగాయి.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి