Reliance Industries: రిలయన్స్, బీపీ రూ.2.7 లక్షల కోట్లు చెల్లించాలి
ABN , Publish Date - Dec 30 , 2025 | 07:09 AM
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), బీపీ యాజమాన్యం కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో తాము అనుమతి పొందిన ప్రాంతాన్ని మించి క్షేత్రాన్ని విస్తరించినందుకు, తమకు నిర్దేశించిన సహజవాయువు...
కేజీ బేసిన్‌లో ఉత్పత్తి తగ్గింపుపై పరిహారం కోరిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్), బీపీ యాజమాన్యం కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో తాము అనుమతి పొందిన ప్రాంతాన్ని మించి క్షేత్రాన్ని విస్తరించినందుకు, తమకు నిర్దేశించిన సహజవాయువు ఉత్పత్తి లక్ష్యాలను చేరలేకపోయినందుకు 3,000 కోట్ల డాలర్ల (రూ.2.7 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలని ప్రభుత్వం కోరుతోంది. 14 ఏళ్లుగా సాగుతున్న ఈ వివాదంపై విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ముందు ప్రభుత్వం ఈ క్లెయిమ్‌ను ఉంచింది. నవంబరు 7వ తేదీన ట్రైబ్యునల్ తన విచారణ ముగించింది. వచ్చే ఏడాది ట్రైబ్యునల్ తీర్పు ప్రకటించవచ్చని, ఈ కేసులో నష్టపోయిన పార్టీ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే ఆస్కారం సైతం ఉన్నదని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి. కట్టుబాటుకు అనుగుణంగా తాము ఉత్పత్తి చేయలేకపోయిన సహజ వాయువుకు నగదు రూపంలో పరిహారం చెల్లించడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వ్యవస్థలు, ఇంధన మార్కెటింగ్, వడ్డీ కింద చేసిన అదనపు వ్యయాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం కోరుతోందని ఆ వర్గాల కథనం. వాటన్నింటికీ కలిపి మొత్తం క్లెయిమ్ విలువ 3,000 కోట్ల డాలర్ల పైమాటే అని వారంటున్నారు. కేజీ బేసిన్‌లోని కేజీ-డీడబ్ల్యూఎన్-98/3 (కేజీ-డీ6) బ్లాక్‌లో అంగీకరించిన మేరకు రిలయన్స్ ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ధీరూభాయ్-1, ధీరూభాయ్-3 క్షేత్రాల్లో సామర్థ్య వినియోగం తగ్గిందన్నది ప్రభుత్వ అభియోగం. అయితే ఆర్‌ఐఎల్ ఈ క్లెయిమ్ వార్తలను తోసిపుచ్చింది.
Also Read:
Melbourne Pitch: మెల్‌బోర్న్ పిచ్‌కు ఐసీసీ రేటింగ్.. ఏమిచ్చిందంటే..?
Ibomma Ravi: ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణ.. కీలక వివరాలు సేకరించిన పోలీసులు..
Minister Rama Prasad: రాయచోటితో నాకు ప్రత్యేక అనుబంధం.. మంత్రి కీలక వ్యాఖ్యలు