Gold All Time High: బంగారం భగ్గు
ABN , Publish Date - Sep 10 , 2025 | 02:05 AM
పసిడి చుక్కలనంటుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ దీని ధర సరికొత్త శిఖరాలకు దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మంగళవారం...
సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి ధర
ఢిల్లీలో 10 గ్రాములు రూ.1,12,750కి చేరిక
ఒక్కరోజే రూ.5,080 పెరుగుదల
ఈ ఏడాదిలో రూ.33,800 అప్
న్యూఢిల్లీ: పసిడి చుక్కలనంటుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ దీని ధర సరికొత్త శిఖరాలకు దూసుకెళ్లింది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర మంగళవారం రూ.5,080 పెరిగి సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.1,12,750కి ఎగబాకింది. ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ ప్రకారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు గోల్డ్ రేటు రూ.33,800 (దాదాపు 43 శాతం) పెరిగింది. గత ఏడాది డిసెంబరు 31న ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రేటు రూ.78,950గా నమోదైంది. వెండిదీ గోల్డెన్ ట్రెండే.. కిలో రేటు రూ.2,800 పెరుగుదలతో రూ.1,28,800కు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ మరో 16.81 డాలర్లు ఎగబాకి సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 3,659.27 డాలర్లకు పెరిగింది. సిల్వర్ 41.50 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. గత నెలలో అమెరికా కార్మిక శాఖ విడుదల చేసిన ఆగస్టు ఉద్యోగ నియామకాల గణాంకాలు బలహీనంగా ఉండటంతో పాటు గతంలో విడుదల చేసిన మే, జూన్ గణాంకాలను సైతం దిగువకు సవరించడంతో వచ్చేవారం ఫెడ్ రేట్లు మరింత తగ్గించవచ్చన్న అంచనాలు ఊపందుకున్నాయి. ఇది బులియన్ ర్యాలీకి ప్రధాన కారణం. తాజా ఉద్యోగ గణాంకాలు అమెరికా ఆర్థిక పరిస్థితిపైనా కొత్త సందేహాలు లేవనెత్తుతున్నాయి. ట్రంప్ టారి్‌ఫలతో అంతర్జాతీయంగా వాణిజ్య అవరోధాలు కూడా పెరిగాయి. దాంతో ఇన్వెస్టర్లు ఆర్థిక అనిశ్చితుల్లో భద్రత కల్పించే బంగారంలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారని బులియన్ విశ్లేషకులు పేర్కొన్నారు.
ఏడాది చివరినాటికి 4,000 డాలర్లకు?
ఔన్స్ పసిడి ఈ వారంలోనే 3,700 డాలర్లకు ఎగబాకవచ్చన్న అంచనాలున్నాయి. మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రామాణిక వడ్డీ రేట్లను వేగంగా తగ్గించాల్సి వస్తే, ఈ ఏడాది చివరినాటికి ఔన్స్ బంగారం 4,000 డాలర్లు దాటే అవకాశాల్లేకపోలేవని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏడాదికాలంలో వెండి
రూ.1.50 లక్షలు
వచ్చే ఏడాది కాలంలో కిలో వెండి ధర రూ.1.50 లక్షలకు చేరుకోవచ్చని, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) సిల్వర్ 50 డాలర్లకు ఎగబాకనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక అంచనా వేసింది. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం గణనీయంగా పెరుగుతుండటం, బలహీనపడుతున్న డాలర్, మరింత తగ్గనున్న ఫెడ్ రేట్లు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు అన్నీ వెరసి ఈ విలువ లోహం ధరలను ఎగదోయనున్నాయని రిపోర్టు పేర్కొంది. మోతీలాల్ ఓస్వాల్ భావిస్తోంది. మల్టీకమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సిల్వర్ ధర ఈ ఏడాదిలో ఇప్పటివరకు 37 శాతం పెరిగింది.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి