Share News

Gold Rates Crash: దీపావళికి ముందే పసిడి ధరల్లో తగ్గుదల.. రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్

ABN , Publish Date - Oct 19 , 2025 | 06:29 PM

బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు గల కారణాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates Crash: దీపావళికి ముందే పసిడి ధరల్లో తగ్గుదల.. రాబోయే రోజుల్లో మరింత తగ్గే ఛాన్స్
Gold Price Drop reasons

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల వరకూ భారీగా పెరిగిన బంగారం ధరల స్పీడుకు బ్రేకులు పడ్డాయి. దీపావళికి ముందే రేట్లు తగ్గుముఖం పట్టాయి. దీంతో, ధరలు మరింత తగ్గనున్నాయా? అన్న ప్రశ్నపై మార్కెట్ వర్గాలు తెగ చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది బంగారం మదుపర్లకు భారీ లాభాలనే తెచ్చిపెట్టింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ధరలు ఏకంగా 70 శాతం మేర పెరిగాయి. కానీ దీపావళికి ముందు సడెన్‌గా ధరల్లో యూటర్న్ మొదలైంది. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ధరలు 2 శాతం మేర తగ్గాయి. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, మార్కెట్ సెంటీమెంట్‌లో మార్పులు ఇందుకు దోహదపడ్డాయి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో కూడా దాదాపు ఇదే సీన్ కనిపించింది (Gold Price Drop Reasons).

ఈ నేపథ్యంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఐదు ప్రధాన కారణాలను పేర్కొంటున్నారు. ఇప్పటివరకూ ధరలు పెరగడానికి డాలర్‌ బలహీనత, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. కానీ అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల వాణిజ్య సంకేతాలతో బంగారం ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.


ఇప్పటివరకూ డాలర్ సూచీ 9 శాతం మేర పడిపోయింది. 100 మార్కుకు దిగువనే ఉంది. దీంతో, మదుపర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. అయితే డాలర్ ఇండెక్స్ 100 మార్కును దాటితే మాత్రం బంగారం ధరలు మరింత దిగజారే అవకాశం ఉంది.

అమెరికా ప్రామాణిక వడ్డీ రేట్లలో కోతలు ఉంటాయన్న అంచనా ఇప్పటివరకూ ఉంది. అయితే, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ వడ్డీ రేట్లను పెంచినా లేదా యథాతథంగా కొనసాగించినా కూడా ఇన్వెస్టర్లు బంగారంపై నుంచి దృష్టి మళ్లిస్తారు. దీంతో, ధరలు దిగొస్తాయి.

అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో బంగారానికి గిరాకీ తగ్గే అవకాశం మెండుగా ఉంది.

ఇక అప్పుల భారం తగ్గించుకునేందుకు లేదా నిధుల సేకరణ కోసం అమెరికా తన బంగారం నిల్వల్లో కొంత విక్రయిస్తే పసిడి ధరలు ఆటోమేటిక్‌గా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, స్వల్పకాలంలో ధరలు తగ్గినా దీర్ఘకాలంలో మాత్రం ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనేది మార్కెట్ వర్గాల అంచనా


ఇవీ చదవండి:

Mukesh Ambani: రిలయన్స్‌ లాభం రూ.18,165 కోట్లు

Stock Market: దివాలీ ధమాకా!

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 19 , 2025 | 06:43 PM