Share News

Mukesh Ambani: రిలయన్స్‌ లాభం రూ.18,165 కోట్లు

ABN , Publish Date - Oct 18 , 2025 | 03:57 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికం క్యూ2లో కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌...

Mukesh Ambani: రిలయన్స్‌ లాభం రూ.18,165 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికం (క్యూ2)లో కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) కన్సాలిడేటెడ్‌ నికర లాభం 9.6ు పెరిగి రూ.18,165 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.16,563 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో మొత్తం రెవెన్యూ 9.9 శాతం పెరుగుదలతో రూ.2,83,548 కోట్లుగా నమోదైంది. రిటైల్‌, టెలికాం వ్యాపారాలు బలమైన వృద్ధిని నమోదు చేయడంతో పాటు కంపెనీకి అత్యంత కీలకమైన ఆయిల్‌, కెమికల్‌ రంగాలు రికవరీ సాధించడం ఈ వృద్ధికి ప్రధానంగా దోహదపడినట్టు ఆర్‌ఐఎల్‌ తెలిపింది. అయితే ఇన్వెంటరీ నష్టాలు మొత్తం ఆదాయాలను ప్రభావితం చేశాయని, జూన్‌ త్రైమాసికానికి ప్రకటించిన రూ.26,994 కోట్లతో పోల్చితే లాభం 33ు తగ్గిందని వివరించింది. టెలికాం విభాగంలో కొత్త కస్టమర్ల జోడింపు, ఒక్కో వినియోగదారునిపై పుంజుకున్న ఆదాయం, వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులు ప్రపంచంలోనే అతిపెద్ద సేవగా మారడం.. టెలికాం సర్వీసుల విభాగంలో ఆదాయం 13ు పెరగడానికి దోహదపడ్డాయి. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి కంపెనీ రుణ భారం రూ.3.38 లక్షల కోట్లుండగా సెప్టెంబరు 30వ తేదీ నాటికి రూ.3.48 లక్షల కోట్లకు పెరిగింది.

ఆయిల్‌ వ్యాపారాల్లో వృద్ధి

జామ్‌నగర్‌లోని రెండు రిఫైనరీలు, పెట్రో కెమికల్‌ ప్లాంట్లు మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. క్యూ2లో స్థూల లాభం (ఎబిటా) 21ు వృద్ధితో రూ.15,008 కోట్లకు చేరింది. త్రైమాసిక రిఫైనింగ్‌ సామర్థ్యం 2.08 కోట్ల టన్నులుగా ఉంది. ఒక త్రైమాసికంలో అత్యధిక సామర్థ్యం ఇదే. అయితే క్రూడాయిల్‌ ధరలు భారీగా తగ్గడం వల్ల నిల్వ చేసిన ఇన్వెంటరీ విలువ గణనీయంగా పడిపోయింది. ఫలితంగా ఇన్వెంటరీ నష్టం రెట్టింపై రూ.8,421 కోట్లకు చేరింది.


రూ.10,000 కోట్లకు ఆర్‌సీపీఎల్‌ ఆదాయం!

రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన వినియోగ వస్తువుల విభాగం రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రోడక్ట్స్‌ (ఆర్‌సీపీఎల్‌) స్థూల ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.9,850 కోట్లకు చేరింది. డిసెంబరు త్రైమాసికంలో ఈ విభాగం ఆదాయం రూ.5,400 కోట్లుందని కంపెనీ సీఎ్‌ఫఓ వి.శ్రీకాంత్‌ అన్నారు.

జియో ప్లాట్‌ఫామ్స్‌ లాభం 13% అప్‌

టెలికాం, డిజిటల్‌ వ్యాపారాల అనుబంధ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ లాభం క్యూ2లో 13ు పెరిగి రూ.7,379 కోట్లకు చేరింది. ఈ వ్యాపారానికి కీలకమైన నాలు గు విభాగాల్లోనూ.. డేటా మినిట్‌ వినియోగం, డేటా వినియోగం, ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదా యం (ఆర్పు), మొత్తం చందాదారుల సంఖ్యలో వృద్ధి నమోదైంది. క్యూ1తో పోల్చితే క్యూ2లో ఆర్పు రూ.208.8 నుంచి రూ.211.4కి పెరిగింది. వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ జియో ఎయిర్‌ ఫైబర్‌ చందాదారుల సంఖ్య 95 లక్షలకి చేరింది. ప్రపంచంలో ఏ ఇతర ఆపరేటర్ల చందాదారుల కన్నా ఇది అధికం. కాగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ లాభం వార్షిక ప్రాతిపదికన 22ు వృద్ధితో రూ.3,457 కోట్లకు చేరింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలోని జియో స్టార్‌ రూ.7,232 కోట్ల ఆదాయంపై రూ.1,322 కోట్ల నికరలాభం ప్రకటించింది.

క్విక్‌ కామర్స్‌ జోరు

రిలయన్స్‌ క్విక్‌ హైపర్‌-లోకల్‌ కామర్స్‌ 1,000 నగరాలకు విస్తరించగా.. 5,000 పిన్‌కోడ్‌ ప్రాంతాలకు కార్యకలాపాలు విస్తరించాయి. ఈ విభాగంలో పోటీదారులందరినీ పక్కకు నెట్టి రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. 10 నగరాల్లో ఆర్డర్‌ చేసిన 30 నిమిషాల్లోగా డెలివరీ ఇస్తామన్న హామీతో ఈ క్విక్‌ హైపర్‌ లోకల్‌ డెలివరీలను ఎలక్ర్టానిక్స్‌, విడిభాగాలకు కూడా విస్తరించారు. కాగా జియోమార్ట్‌ 58 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది.


‘‘ఓ2సీ, జియో, రిటైల్‌ వ్యాపార విభాగాలు అందించిన వాటాతో రెండో త్రైమాసికంలో రిలయన్స్‌ అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. డిజిటల్‌ సర్వీసుల వ్యాపారం కొత్త చందాదారులను చేర్చుకుంటూ పాజిటివ్‌ ధోరణిని ముందుకు నడిపిస్తోంది. ఇటీవల ప్రకటించిన జీఎ్‌సటీ సంస్కరణలు వినియోగ వృద్ధికి ఊతంగా నిలిచాయి. ఇవన్నీ కలిసి మా ఆదాయం, ఎబిటా శక్తివంతంగా ఉండేందుకు దోహదపడుతున్నాయి.’’

- ముకేశ్‌ అంబానీ, చైర్మన్‌, ఆర్‌ఐఎల్‌

Updated Date - Oct 18 , 2025 | 03:57 AM