Stock Market: దివాలీ ధమాకా!
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:54 AM
భారత స్టాక్ మార్కెట్ దీపావళికి ముందే పండగ చేసుకుంటోంది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ ర్యాలీ తీశాయు. బ్యాంకింగ్ దిగ్గజాలు..
ఏడాది గరిష్ఠానికి నిఫ్టీ
25,700 ఎగువకు సూచీ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ దీపావళికి ముందే పండగ చేసుకుంటోంది. ప్రామాణిక ఈక్విటీ సూచీలు వరుసగా మూడో రోజూ ర్యాలీ తీశాయు. బ్యాంకింగ్ దిగ్గజాలు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లతో పాటు దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడుల దన్నుతో సెన్సెక్స్ శుక్రవారం ఒక దశలో 704.58 పాయింట్లు ఎగబాకి 84,172.24 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 484.53 పాయింట్ల లాభంతో 83,952.19 వద్ద స్థిరపడింది. ఈ జూన్ 27 తర్వాత సూచీకిదే గరిష్ఠ ముగింపు స్థాయి. ఇక నిఫ్టీ 124.55 పాయింట్ల వృద్ధితో సరికొత్త ఏడాది గరిష్ఠ స్థాయి 25,709.85 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.466.92 లక్షల కోట్లు (5.31 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.
మిడ్‌వెస్ట్ ఐపీఓ బంపర్ హిట్: తెలంగాణకు చెందిన గ్రానైట్ కంపెనీ మిడ్‌వెస్ట్ లిమిటెడ్ రూ.451 కోట్ల ఐపీఓకు భారీ స్పందన లభించింది. శుక్రవారంతో ముగిసిన ఈ పబ్లిక్ ఇష్యూ ఏకంగా 87.89 రెట్ల స్పందన లభించింది. ఎన్‌ఎ్‌సఈ డేటా ప్రకారం.. ఐపీఓలో భాగంగా కంపెనీ 31,17,460 (31.17 లక్షల) షేర్లను విక్రయానికి పెట్టగా.. ఇన్వెస్టర్ల నుంచి ఏకంగా 27,39,83,178 (27.40 కోట్లు) షేర్ల కొనుగోలుకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లకు ఏకంగా 168.07 రెట్ల సబ్‌స్ర్కిప్షన్ లభించగా.. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) నుంచి 139.87 రెట్ల బిడ్లు వచ్చాయి. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి 24.26 రెట్ల బిడ్లు లభించాయి.