Share News

Gold Lease: బంగారం అద్దెకివ్వండి.. సొమ్ములు ఆర్జించండి!

ABN , Publish Date - Dec 15 , 2025 | 03:30 PM

మన దగ్గర గోల్డ్ ఉంటే, తక్షణ అవసరాలకు అక్కరకొస్తుంది. బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లోన్ తీసుకోవచ్చు. అయితే, దీనికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకులకు అప్పుఇస్తే, వాళ్లే మనకి వడ్డీ ఇస్తారని తెలుసా..

Gold Lease: బంగారం అద్దెకివ్వండి.. సొమ్ములు ఆర్జించండి!
Gold lease scheme

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 15: బంగారం ద్వారా మరో ఆదాయ మార్గం అందుబాటులోకి వచ్చింది. బంగారాన్ని అద్దెకు ఇచ్చి వడ్డీ ఆదాయాన్ని పొందే వీలుంది. బ్యాంకుల్లో పసిడి నగదీకరణ పథకం కింద, ప్రైవేటు సంస్థల్లోనూ 'అద్దె లేదా లీజ్‌' పేరిట ఇలా బంగారాన్ని అప్పుగా ఇవ్వొచ్చు. దీనిపై ప్రైవేటు సంస్థలు కొంచెం అధిక వడ్డీ ఇస్తుండగా, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ లభిస్తుంది.


బంగారం కొని అట్టేపెట్టుకుంటే.. కొంత కాలానికి దాని విలువ పెరిగినా, తక్షణ ఆదాయం రావడం లేదనే అసంతృప్తిని ఈ కొత్త పథకం దూరం చేస్తుంది. మేలిమి బంగారం బిస్కెట్లను ఆభరణాల విక్రేతలు, రిఫైనర్లు, ఫ్యాబ్రికేటర్లకు సైతం అద్దెకు ఇవ్వొచ్చు.


రోజువారీ కార్యకలాపాల కోసం ఆభరణాల విక్రేతలకు మేలిమి బంగారం కావాలి. తక్కువ వడ్డీకి పసిడి లభిస్తుంది కాబట్టి, దీనికి దుకాణదారులూ ముందుకొస్తున్నారు. బంగారాన్ని పూచీకత్తుపై లీజ్‌కు ఇస్తే 2% వడ్డీ, పూచీకత్తు లేకుండా ఇస్తే 4% వడ్డీని సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. హైదరాబాద్లో బంగారు వ్యాపారులు వాటి విలువపై నూటికి 50 పైసల చొప్పున వడ్డీ చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రైవేటు వ్యక్తులతో ఇబ్బంది అనుకుంటే, ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనూ బంగారాన్ని డిపాజిట్‌ చేసి, వడ్డీ పొందే అవకాశం ఉంది. ప్రజల వద్ద వృథాగా ఉన్న బంగారాన్ని, వినియోగంలోకి తెచ్చేందుకు.. తద్వారా బంగారాన్ని దిగుమతి చేసుకునేందుకు విదేశీ మారకపు ద్రవ్యాన్ని వెచ్చించకుండా చూసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.


బ్యాంకులో కేవైసీ పూర్తిచేసిన వారు, గోల్డ్‌ డిపాజిట్‌ పథకం అకౌంట్‌ తెరవాలి. మన బంగారాన్ని బ్యాంకు తరఫున కలెక్షన్‌ - టెస్టింగ్‌ ఏజెంట్‌ తీసుకుని, స్వచ్ఛతను నిర్థారిస్తారు. మన ఖాతాలో డిపాజిట్‌ అయిన బంగారం విలువ ఆధారంగా వడ్డీ లభిస్తుంది. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియానే తీసుకుంటే ఏడాది వ్యవధికి 0.50%, రెండేళ్ల వరకు 0.55%, మూడేళ్లకు 0.60% వడ్డీ చెల్లిస్తోంది.


అయితే, లాకర్‌లో పెట్టుకున్న బంగారాన్ని అవసరమైనప్పుడు తెచ్చుకోవచ్చు. అయితే, మనం నమ్మి లీజుకు ఇచ్చిన బంగారు వ్యాపారి కనుక, ఆలస్యం చేస్తే.. లేదా పరారైపోతే, ఆ నష్టభయం మాత్రం పొంచి ఉంటుంది. ఇదే విషయాన్ని ప్రపంచ స్వర్ణ మండలి కూడా హెచ్చరిస్తోంది.


Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి లేదా వ్యాపార సలహా కాదని పాఠకులు గమనించాలి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు, సమాచారానికి ఆంధ్రజ్యోతి ఎలాంటి బాధ్యత వహించదు. మీ వ్యాపార, పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదిస్తే మంచిది.


ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 15 , 2025 | 06:29 PM