Billionaires of the World: సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాలు ఇవే
ABN , Publish Date - Feb 22 , 2025 | 10:13 PM
సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ మూడో స్థానంలో నిలిచింది.
వివిధ దేశాల్లోని సంపన్నులకు ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే శక్తి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరోవైపు పెట్టుబడి దారి అనుకూల వ్యవస్థ కారణంగా ప్రపంచంలో ఏటా సంపన్నుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి ఎందరో సంపన్నులు తమ సృజనాత్మకత, వ్యాపారదక్షత, వ్యూహాలతో అపార సంపదను సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ పత్రిక అపర సంపన్నులు ఉన్న దేశాల జాబితాను విడుదల చేసింది.
అత్యధిక సంపన్నులు ఉన్న దేశంగా అమెరికా తొలి స్థానంలో ఉంది. అక్కడ బిలియనీర్ల సంఖ్య 813. వారి నికర సంపద విలువ 5.7 ట్రిలియన్ డాలర్లు. అమెరికాలో అత్యధిక ధనవంతుడిగా ఉన్న మస్క్ సంపద విలువ 195 బిలియన్ డాలర్లు
రెండో స్థానంలో ఉన్న చైనాలో అపర కుబేరుల సంఖ్య 406. వారి నికర సంపద విలువ 1.3 ట్రిలియన్ డాలర్లు. చైనాలో అత్యంత ధనవంతుడు ఝాంగ్ షాన్సన్ సంపద విలువ 62.3 బిలియన్ డాలర్లు
Adani Group : అదానీ సంపదలో రూ.లక్ష కోట్లు ఫట్
ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 200. గతేడాదితో పోలిస్తే కొత్తగా 31 మంది బిలియనీర్లుగా మారారు. భారతీయ బిలియనీర్ల నికర సంపద 954 బిలియన్ డాలర్లు. భారత్‌లో అత్యంత సంపన్నుడైన ముఖేశ్ అంబానీ సంపద విలువ 116 బిలియన్ డాలర్లు
జర్మనీలో గతేడాది 126 మంది బిలియనీర్లు ఉండగా ఈసారి వీరి సంఖ్య 132కు చేరుకుంది. జర్మనీ బిలియనీర్ల నికర సంపద విలువ 585 బిలియన్ డాలర్లు. 39.2 బిలియన్ డాలర్ల సంపద కలిగిన క్లాస్ మైఖేల్ క్యూహెన్ జర్మనీలో అత్యంత సంపన్నుడిగా నిలిచాడు.
రష్యన్ బిలియనీర్ల సంఖ్య 120కి పెరిగింది. గతేడాది 105 మంది బిలియనీర్లే ఉన్నారు. అక్కడి బిలియనీర్ల నికర సంపద 537 బిలియన్ డాలర్లు. వేజిట్ అలెక్‌పెరోవ్ అత్యంత సంపన్న రష్యన్.
Granules India Deal : గ్రాన్యూల్స్ గూటికి స్విస్ కంపెనీ
ఇటలీ సంపన్నుల సంఖ్య కూడా 64 నుంచి 73కు పెరిగింది. ఆ దేశ బిలియనీర్ల నికర సంపద 302 బిలియన్ డాలర్లు చేరుకుంది. ఇటలీలో అత్యంత సంపన్నుడు జియోవానీ ఫెర్రేరో 43.8 బిలియన్ డాలర్ల సంపదను సొంతం చేసుకున్నాడు.
ఇక బ్రెజిల్‌లో గత ఏడాది 51 మంది బిలియనీర్లు ఉండగా ఈఏడాది వారి సంఖ్య 69కి చేరుకుంది.
కెనడా బిలియనీర్ల సంఖ్య 63 నుంచి స్వల్పంగా పెరిగి 67కు చేరుకుంది. డేవిడ్ థామన్స్ అత్యంత సంపన్న కెనేడియన్‌గా నిలిచారు. ఆయన నికర సంపద విలువ 67.8 బిలియన్ డాలర్లు
యూకేలో బిలియనీర్ల సంఖ్య 55కు పెరిగింది. వారి నికర సంపద విలువ 202 బిలియన్ డాలర్లు. 18 బిలియన్ డాలర్ల నికర సంపదతో మైఖేల్ ప్లాట్ అత్యంత సంపన్నుడిగా నిలిచారు.