Share News

Fixed Deposits Interest Rates Falling: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు డౌన్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 06:07 AM

ప్రత్యామ్నాయాలు బోలెడు.. దిగులెందుకు దండగ దేశంలో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. గత ఏడాది కాలంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక రెపో వడ్డీ రేటు 1.25 శాతం తగ్గించింది. తాజాగా...

Fixed Deposits Interest Rates Falling: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లు డౌన్‌

ప్రత్యామ్నాయాలు బోలెడు.. దిగులెందుకు దండగ దేశంలో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. గత ఏడాది కాలంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) కీలక రెపో వడ్డీ రేటు 1.25 శాతం తగ్గించింది. తాజాగా శుక్రవారం వెలువరించిన ద్రవ్య పరపతి విధానంలోనూ ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటు పావు శాతం తగ్గించింది. ధరల సెగ అదుపులో ఉన్నందున ఫిబ్రవలో జరిగే భేటీలోనూ ఎంపీసీ రెపో రేటు మరో పావు శాతం తగ్గిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రెపో రేటు తగ్గడంతో బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై చెల్లించే వడ్డీ రేట్లలోనూ కోత పెడుతున్నాయి. ప్రస్తుతం పదేళ్ల కాలపరిమితి ఉండే ఎఫ్‌డీని తీసుకున్నా ఏ బ్యాంకూ 8 శాతానికి మించి వడ్డీ చెల్లించడం లేదు. దీంతో కేవలం వడ్డీ ఆదాయంపై మాత్రమే ఆధారపడే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆలోచిస్తే ఎఫ్‌డీలకూ మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. అవేమిటో తెలుసుకుందాం.

డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌

పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండే మదుపరులకు ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, రిటైరీలు.. మ్యూచువల్‌ ఫండ్స్‌ (ఎంఎఫ్‌) అందించే రుణ పథకాలపై దృష్టి పెట్టవచ్చు. ఈ పథకాల ద్వారా సమీకరించే నిధులను ఎంఎ్‌ఫలు ప్రభుత్వ రుణ పత్రాలు, మంచి పరపతి రేటింగ్‌ ఉన్న కంపెనీల రుణ పత్రాలు, ఇతర స్థిర ఆదాయ పథకాల్లో మదుపు చేస్తాయి. ఈ రుణ పథకాలపై రాబడులు స్థిరంగా 6 నుంచి 8.5 శాతం వరకు ఉంటుంది. ప్రస్తుతం ఎఫ్‌డీలపై లభించే రాబడుల కంటే ఇది ఎక్కువే. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల తరహాలోనే ఈ డెట్‌ పథకాల్లో పెట్టుబడులకు లాక్‌-ఇన్‌ పీరియడ్‌ అంటూ ఉండదు. ఎప్పుడు డబ్బులు అవసరమైతే అప్పుడు యూనిట్లను ఆ రోజు అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. స్వల్ప, మధ్యకాలిక మదుపరులకు ఇవి అత్యంత అనువైనవి. దీర్ఘకాలిక మదుపరులైతే ఈ డెట్‌ ఫండ్స్‌ రాబడులపై ఇండెక్సేషన్‌ ప్రయోజనంతో పన్ను పోటు కూడా తగ్గించుకోవచ్చు. అయితే ఈ ఫండ్స్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్థిరమైన రాబడులు అందిస్తూ, మంచి పరపతి రేటింగ్‌ ఉన్న రుణ పత్రాలను తన పోర్టుఫోలియోలో కలిగి ఉన్న ఎంఎఫ్‌ రుణ పథకాలను మాత్రమే ఎంచుకోవాలి. పెద్దగా రిస్క్‌ లేని ఈ పథకాలను రిటైరీలు, సీనియర్‌ సిటిజన్లు ఎంచుకోవచ్చు.


కంపెనీల ఎఫ్‌డీలు

కార్పొరేట్‌ కంపెనీలు అందించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (ఎఫ్‌డీ) కూడా బ్యాంకుల ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయం. ఈ ఎఫ్‌డీలపై కంపెనీలు.. బ్యాంకులు తమ ఎఫ్‌డీలపై చెల్లించే వడ్డీ కంటే 2 నుంచి 3 శాతం అధికంగానే చెల్లిస్తాయి. కాకపోతే ఇక్కడ పరపతి రేటింగ్‌ సంస్థలు ఆ ఎఫ్‌డీలకు ఇచ్చిన రేటింగ్‌ ఆధారంగా మాత్రమే వీటిని ఎంచుకోవాలి. ట్రిపుల్‌ ఏ లేదా కనీసం డబుల్‌ ఏ రేటింగ్‌ ఉన్న కంపెనీల ఎఫ్‌డీలను మాత్రమే ఎంచుకోవాలి. లేకపోతే జేబుకు చిల్లు పడే ప్రమాదం ఉంది. సీనియర్‌ సిటిజన్లు, రిటైరీలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌

ఏ మాత్రం నష్ట భయం గానీ, మార్కెట్‌ ఆటుపోట్ల ప్రభావం గానీ లేకుండా హామీతో కూడిన స్థిర ఆదాయం కోరుకునే వ్యక్తులు నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఎ్‌ససీ)ని ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం ఈ పథకంపై 7.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఐదేళ్ల కాలపరిమితి ఉండే ఈ పథకంపై చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వ హామీ కూడా ఉంది. ఈ పథకంపై ఏడాదికి ఒకసారి వడ్డీ లెక్క కట్టి మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. సెక్షన్‌ 80సీ కింద ఈ పథకంలో పెట్టుబడులకు ఆదాయ పన్ను ప్రయోజనాలూ లభిస్తాయి. పన్ను ప్రయోజనాల కోసం చూసే సంప్రదాయ మదుపరులకు ఎన్‌ఎస్‌సీ చక్కటి ప్రత్యామ్నాయం.

ఈక్విటీ పథకాలు

దీర్ఘకాలిక మదుపరులు ముఖ్యంగా ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం వేచి చూడగలిగే మదుపరులు బ్యాంకు ఎఫ్‌డీలకు బదులు ఈక్విటీ పథకాలపైనా దృష్టి పెట్టవచ్చు. కొద్దిగా రిస్క్‌ ఉన్నా దీర్ఘకాలంగా చూస్తే ఈ పథకాలు మదుపరులకు ఎంత లేదన్నా 12 నుంచి 14 శాతానికి పైగా రాబడులు పంచుతున్నాయి. కాకపోతే ఫండ్‌తో పాటు ఫండ్‌ మేనేజర్‌ ట్రాక్‌ రికార్డు చూసి మరీ ఈ పథకాలను ఎంచుకోవాలి. ఆస్తుల కల్పన కోసం చూసే యువత బ్యాంకు ఎఫ్‌డీల కంటే మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉన్న ఈక్విటీ పథకాలను ఎంచుకోవడం మంచిది. వీటిపై సరైన అవగాహన లేకపోతే సరైన ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్‌ సలహా తీసుకుని మదుపు చేయడం మంచిది. రిస్క్‌ తీసుకోలేని సీనియర్‌ సిటిజన్లు కూడా లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవడం మంచిది.


బులియన్‌ పెట్టుబడులు

బంగారం, వెండి కూడా ఎఫ్‌డీలకు చక్కటి ప్రత్యామ్నాయం. ఈ సంవత్సరం ఈ రెండు లోహాలు ఇచ్చినంత లాభం మరే ఆస్తులు ఇవ్వలేదు. వచ్చే ఏడాది కూడా బంగారం, వెండి ధరలు మరింత పరుగు తీస్తాయే తప్ప వెనకడుగు వేయవని నిపుణులు చెబు తున్నారు. పెద్దగా రిస్క్‌ లేకుండా సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూసే మదుపరులు బ్యాంకు ఎఫ్‌డీలకు బదులు గోల్డ్‌ ఈటీఎ్‌ఫలు లేదా డిజిటల్‌ గోల్డ్‌ను ఆశ్రయించడం మంచిది. కొత్తగా సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ జారీ చేయడాన్ని ప్రభుత్వం ఆపేసింది. అయితే ఆసక్తి ఉన్న మదుపరులు సెకండరీ మార్కెట్‌ నుంచి వీటికి కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

కిసాన్‌ వికాస్‌ పత్ర

ప్రస్తుతం ఈ పథకంపై 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ పథకం చెల్లింపులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. ఎలాంటి ఆటుపోట్లు లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సంప్రదాయ మదుపరులు, సీనియర్‌ సిటిజన్లకు ‘కిసాన్‌ వికాస్‌ పత్ర’ అత్యంత అనువైంది.

బ్యాంకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయని గాభరా పడకుండా సంప్రదాయ మదుపరులు, సీనియర్‌ సిటిజన్లు పై పథకాలను ఎంచుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

బెంగాల్‌లో బాబ్రీ మోడల్ మసీదు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన

గుండె ఆగిపోయే స్టంట్.. కారుతో ఇతను చేసిన విన్యాసాలు చూస్తే..

Read Latest AP News and National News

Updated Date - Dec 07 , 2025 | 06:07 AM