Share News

Dr Reddys Laboratories: డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,410 కోట్లు

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:05 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ త్రైమాసికానికి హైదరాబాద్‌కు చెందిన ఔషధాల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ రూ.1,410 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.

Dr Reddys Laboratories: డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం రూ.1,410 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్‌ త్రైమాసికానికి హైదరాబాద్‌కు చెందిన ఔషధాల తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబరేటరీస్‌ రూ.1,410 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.1,392 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం 1.4 శాతం వృద్ధిని కనబరిచింది. ఐరోపా, భారత మార్కెట్లలో మెరుగైన వ్యాపార వృద్ధి ఇందుకు దోహదపడింది. కాగా, ఈ క్యూ1లో కంపెనీ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.3 శాతం పెరిగి రూ.8,545 కోట్లకు చేరింది. 2024-25లో ఇదే త్రైమాసికానికి ఆదాయం రూ.7,673 కోట్లుగా నమోదైంది.


‘‘జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రెండంకెల వృద్ధిని కనబరిచింది. బ్రాండెడ్‌ మార్కెట్లో మా బలాన్ని, నికోటిన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ పోర్ట్‌ఫోలియో సానుకూల వృద్ధిని ఇది ప్రతిబింబిస్తోంది’’ అని డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌, ఎండీ జీవీ ప్రసాద్‌ అన్నారు. అయితే, అమెరికా జనరిక్‌ మార్కెట్లో మల్టిపుల్‌ మైలోమా చికిత్స కోసం ఉపయోగించే లెనాలిడోమైడ్‌ ఔషధ ధరలపై ఒత్తిడి తీవ్రతరం కానుందన్నారు. ప్రస్తుతం పైప్‌లైన్‌లో ఉన్న ఉత్పత్తులను అందించడం, ఉత్పాదకత పెంపు, వ్యాపారాభివృద్ధి ద్వారా కంపెనీకి మూలాధారమైన వ్యాపారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించామని ప్రసాద్‌ పేర్కొన్నారు. మరిన్ని విషయాలు..

  • క్యూ1లో కంపెనీ గ్లోబల్‌ జనరిక్స్‌ వ్యాపారం వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ.7,560 కోట్లుగా నమోదైంది.

  • గడిచిన మూడు నెలల్లో కంపెనీ అమెరికా మార్కెట్లో 5 కొత్త ఔషధాలను విడుదల చేసింది. అలాగే, మరో కొత్త ఔషధం విడుదల కోసం యూఎ్‌సఎ్‌ఫఎడీఏకు దరఖాస్తు చేసుకుంది.

  • బీఎస్‌‌ఈలో బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 0.58 శాతం పెరిగి రూ.1,247.55 వద్ద స్థిరపడింది.


ఈ వార్తలు కూడా చదవండి..

దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 04:05 AM