Centre Imposes Airfare Cap: ఇండిగో సంక్షోభం.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కేంద్ర మంత్రి
ABN , Publish Date - Dec 06 , 2025 | 05:23 PM
ఇండిగో సంక్షోభంతో డొమస్టిక్ విమాన సర్వీసుల టికెట్ ధరలు భారీగా పెరిగాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి ఏకంగా 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విమానయాన శాఖ విమాన ప్రయాణీకులకు గుడ్‌న్యూస్ చెప్పింది.
న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఈ మేరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ.. ‘ఇండిగో సంక్షోభంతో ప్రయాణీకులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ రేపటిలోగా డబ్బులు రీఫండ్ చేయాలని ఆదేశించాం. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడుతున్నాము. డీజీసీఏ తరఫున ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. దీని కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటాను’ అని ఆయన అన్నారు.
ప్రయాణీకులకు గుడ్‌న్యూస్..
విమాన ప్రయాణీకులకు కేంద్ర పౌర విమానయాన శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండిగో సంక్షోభం కారణంగా పెరిగిన విమాన టికెట్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. విమాన టికెట్ ధరలు గరిష్టంగా 18 వేల రూపాయలు మించవద్దని విమాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. విమానయాన శాఖ టికెట్ ధరలను నాలుగు కేటగిరీలుగా విభజించింది.
0 నుంచి 500 కిలోమీటర్ల వరకు టికెట్ ధరలను 7500 రూపాయలుగా నిర్ణయించింది. 500 నుంచి 1,000 కిలోమీటర్ల వరకు 12 వేల రూపాయలు.. 1000 నుంచి 1500 కిలోమీటర్ల వరకు 15 వేల రూపాయలు.. 1,500 కిలోమీటర్లు దాటితే టికెట్ ధర18 వేల రూపాయలు మించవద్దని స్పష్టం చేసింది.

అన్ని ఎయిర్‌లైన్స్‌కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చార్జీల పరిమితులు బిజినెస్ క్లాస్, ఆర్‌సీఎస్, ఉడాన్ విమానాలకు వర్తించవని కూడా కేంద్ర తెలిపింది. అయితే, ఎయిర్‌లైన్స్ సంస్థలు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలను పట్టించుకోవటం లేదు. పలు ఎయిర్ లైన్స్ సంస్థలు ఢిల్లీ నుంచి హైదరాబాద్ టికెట్ ధరను 62 వేల రూపాయలు పెట్టాయి.
ఇవి కూడా చదవండి
బెంగాల్‌లో బాబ్రీ మోడల్ మసీదు.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యే శంకుస్థాపన
గుండె ఆగిపోయే స్టంట్.. కారుతో ఇతను చేసిన విన్యాసాలు చూస్తే..