Telangana Pharma Industry: గ్లాస్ ట్యూబింగ్ ప్లాంట్
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:10 AM
ఫార్మా రంగానికి చెందిన కార్నింగ్, ఫ్రెంచ్ కంపెనీ ఎస్‌జీడీ ఫార్మా జాయింట్ వెంచర్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలోని వేముల వద్ద అత్యాధునికమైన గ్లాస్ ట్యూబింగ్ ప్లాంట్‌ను..
తెలంగాణలో కార్నింగ్, ఎస్‌జీడీ ఫార్మా
రూ.500 కోట్లు పెట్టుబడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఫార్మా రంగానికి చెందిన కార్నింగ్, ఫ్రెంచ్ కంపెనీ ఎస్‌జీడీ ఫార్మా జాయింట్ వెంచర్‌లో మహబూబ్‌నగర్ జిల్లాలోని వేముల వద్ద అత్యాధునికమైన గ్లాస్ ట్యూబింగ్ ప్లాంట్‌ను ప్రారంభించాయి. ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.500 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. సోమవారం లాంఛనప్రాయంగా ప్రారంభించిన ఈ ప్లాంట్‌ను కార్నింగ్‌కు చెందిన అత్యాధునిక వయల్ టెక్నాలజీని, ఎస్‌జీడీ ఫార్మాకు గల వయల్ కన్వర్టింగ్ అనుభవాన్ని జోడించి ఏర్పాటు చేశారు. ఈ కొత్త ప్లాంట్ అత్యున్నత నాణ్యత గల టైప్ 1 బోరోసిలికేట్ గ్లాస్ ట్యూబింగ్‌ను తయారుచేస్తుంది. ఇంజెక్షన్ల ప్యాకేజింగ్‌లో ఉపయోగించే కీలక ఉపకరణం ఈ గ్లాస్ ట్యూబింగ్. అత్యంత కీలకమైన ప్రాంతీయ అవసరాలు తీర్చడంలో కీలక మైలురాయి ఈ ప్లాంట్ ప్రారంభమని కార్నింగ్ లైఫ్ సైన్సెస్ వైస్ ప్రెసిడెంట్, జీఎం క్రిస్ హడ్సన్ అన్నారు. ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు, కస్టమర్లకు చేరువగా ఉండేందుకు, సరఫరా వ్యవస్థల స్థానికీకరణకు ఈ ప్లాంట్ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇంజెక్షన్ల డెలివరీ, స్థానిక ఫార్మా రంగ వృద్ధిలో ఈ ప్లాంట్ క్రియాశీల పాత్ర పోషిస్తుంది.
కార్నింగ్‌తో ఈ జేవీ తమ ప్రపంచ వృద్ధి వ్యూహంలో ఒక కీలక మైలురాయి అని ఎస్‌జీడీ ఫార్మా సీఈఓ ఆలివర్ రోసావు అన్నారు. తెలంగాణలో అత్యాధునిక ప్లాంట్ ఏర్పాటు వల్ల తమ సరఫరా వ్యవస్థ సుస్థిరతతో పాటు అమిత వేగంగా వృద్ధి చెందుతున్న ఫార్మా మార్కెట్లలో ఒకటైన తెలంగాణకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చినట్టవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ద్వారా 150 ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడడంతో పాటు పరోక్షంగా వందలాది ఉద్యోగాలు స్థానికులకు అందుబాటులోకి వస్తాయని కార్నింగ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ పిళ్లై అన్నారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి