Civil Aviation Ministry: ఇండిగోకు బిగ్ షాక్.. 7వ తేదీ రాత్రి 8 గంటల వరకే గడువు..
ABN , Publish Date - Dec 06 , 2025 | 02:38 PM
ఇండిగో సంక్షోభం కారణంగా కొన్ని వేల మంది విమాన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో విమాన సర్వీసులు రద్దు అవుతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. అన్ని రకాలుగా తీవ్రంగా నష్టపోతున్నారు.
న్యూఢిల్లీ: పైలట్ల కొరత కారణంగా ఇండిగో సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గత ఐదు రోజుల నుంచి భారీ సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు అవుతూ వస్తున్నాయి. ఆఖరి నిమిషంలో కూడా సర్వీసులు రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రీఫండ్ విషయంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న ప్రయాణీకుల రీఫండ్‌లను ఆలస్యం లేకుండా చెల్లించాలని ఇండిగో సంస్థను ఆదేశించింది.
రద్దు చేయబడిన, అంతరాయం కలిగించిన అన్ని విమానాల రీఫండ్ ప్రక్రియను 2025 డిసెంబర్ 7 (ఆదివారం) రాత్రి 8:00 గంటలలోపు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. రద్దుల వల్ల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమైన ప్రయాణీకులకు ఎటువంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని విమానయాన సంస్థలకు సూచించింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ నియంత్రణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
టికెట్ రేట్లపై కేంద్రం ఆగ్రహం..
ఇండిగో సంక్షోభాన్ని కొన్ని విమాన సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. ఇంటర్‌నేషనల్ సర్వీసుల కంటే నేషనల్ సర్వీసుల ధరలు డబుల్ అయ్యాయి. ముంబై నుంచి కొచ్చి వెళ్లడానికి 40 వేల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విమాన సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచడాన్ని కేంద్రం తప్పుబట్టింది. విమాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ప్రయాణికులపై అదనపు భారం పడకుండా జాగ్రత్త వహించాలని, కొత్తగా నిర్ణయించిన ఛార్జీలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
విమాన ఛార్జీల పెంపుపై కేంద్రం ఆగ్రహం..
స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏళ్లు గడిచినా అదే పదమా? బీజేపీ ఎంపీ ఫైర్