BSNL Profits: లాభాల బాటలో బీఎస్ఎన్ఎల్! 2007 తరువాత తొలిసారిగా..
ABN , Publish Date - Feb 14 , 2025 | 10:04 PM
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ రూ.262 కోట్ల లాభాలను కళ్ల చూసింది. కస్టమర్లు పెరగడం, నెట్వర్క్ విస్తరణతో ఇది సాధ్యమైందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇంటర్నెట్ డెస్క్: కొన్నేళ్ళ పాటు ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ లాభాల బాట పట్టింది. ఈ ఆర్థిక సంత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ రూ.262 కోట్ల మేర లాభాలు అందుకుంది. 2007 తరువాత బీఎస్ఎన్ఎల్ లాభాలు కళ్ల చూడటం ఇదే తొలిసారి. వేగంగా నెట్‌వర్క్ విస్తరణ, కొత్త కస్టమర్లు చేరడం, ఖర్చులు తగ్గించుకోవడంతో లాభాలు సాధ్యమయ్యాయని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది (BSNL).
‘‘ఈ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మాకు సంతోషాన్ని ఇచ్చాయి. వినియోగదారులకు గొప్ప సేవలు అందించడం, కొత్తదనం, నెట్వర్క్ విస్తరణపై తమ నిబద్ధతకు ఇది సూచిక. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఆదాయం 20 శాతం మేర వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం’’ అని సంస్థ సీఎమ్‌డీ రాబర్ట్ జే రవి పేర్కొన్నారు.
Jiohotstar: జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్రారంభం.. సబ్‌స్క్రిప్షన్ లేకుండానే సినిమాలు, స్పోర్ట్స్
బీఎస్ఎన్‌ఎల్ మళ్లీ పుంజుకుందనేందుకు, భవిష్యత్తుపై భరోసాకు ఇది నిదర్శనమని అన్నారు. ఖర్చులు తగ్గించుకోవడంతో ఈఏడాది నష్టాలు రూ.1800 కోట్ల మేర తగ్గాయని రాబర్ట్ జే రవి అన్నారు. మొబైల్ సేవల రెవెన్యూ 15 శాతం, ఫైబర్ టూ హోమ్ సేవల ఆదాయం 18 శాతం, లీస్డ్ లైన్ సేవల ఆదాయం 14 శాతం పెరిగిందని చెప్పారు. కస్టమర్‌కు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా నేషనల్ వైఫై రోమింగ్, మొబైల్ కస్టమర్లకు బైటీవీ, ఫైబర్ టూ హోమ్ కస్టమర్లకు ఐఎఫ్‌టీవీ అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు.
Stock Market: మోదీ, ట్రంప్ భేటీ వేళ.. స్టాక్ మార్కెట్లు తీరు ఎలా ఉందంటే..
తమ సేవల్లో నాణ్యత, భరోసాతో కస్టమర్లకు సంస్థపై భరోసా మరింత పెరిగిందని అన్నారు. అత్యద్భుత సేవలు అందించడంతో పాటు 5జీ, డిజిటల్ విప్లవాలను అందింపుచ్చుకునేలా ముందడుగు వేస్తూ బీఎస్ఎన్ఎల్ పోటీలో దూసుకుపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుబాటు దరల్లో నాణ్యమైన సేవలు అందించాలన్న విధానానికి తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఆదాయంలో వృద్ధి నిదర్శనమని అన్నారు. కాగా, ఈ నెల మొదట్లో కేంద్ర కేబినెట్ బీఎస్ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్ఎల్ సంస్థల 4జీ నెట్వర్క్ విస్తరణ కోసం 6 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More Business News and Latest Telugu News