Data Center Expansion: విస్తరణ బాటలో బొండాడ ఇంజనీరింగ్
ABN , Publish Date - Sep 02 , 2025 | 05:30 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్ డేటా సెంటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు...
రెండేళ్లలో డేటా సెంటర్ల వ్యాపారంలోకి..
2030 నాటికి 100 కోట్ల డాలర్ల టర్నోవర్ లక్ష్యం
సంస్థ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొండాడ ఇంజనీరింగ్ డేటా సెంటర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని చూస్తున్నట్లు సంస్థ సీఎండీ బొండాడ రాఘవేంద్ర రావు వెల్లడించారు. హైదరాబాద్ సహా అనుకూలమైన వనరులు ఉన్న నగరాల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా సంస్థ ఈ మధ్యనే రక్షణ రంగ ఉత్పత్తుల విభాగంలోకి అడుగుపెట్టిందని, ఇందుకోసం ప్రత్యేకంగా అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మిస్సైల్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి సేవలను ఈ విభాగం ద్వారా అందించనున్నట్లు రావు చెప్పారు. ఇందుకోసం రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలతో చర్చలు సాగిస్తున్నట్లు రావు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ, టెలికాం రంగాల్లో కంపెనీ కీలకంగా ఉందన్నారు.
ఈ ఏడాది మరో రూ.2,700 కోట్ల ఆర్డర్లు: ప్రస్తుతం బొండాడ ఇంజనీరింగ్ ఆర్డర్ బుక్ రూ.5,400 కోట్లుగా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కొత్తగా రూ.2,700 కోట్ల ఆర్డర్లు దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు రాఘవేంద్ర రావు వెల్లడించారు. కాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ.1,571 కోట్లుగా ఉండగా నికర లాభం రూ.120 కోట్లుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయంలో 80 శాతం, లాభంలో 60-70 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. 2030 నాటికి సంస్థ మొత్తం ఆదాయాన్ని 100 కోట్ల డాలర్ల (సుమారు రూ.8,800 కోట్లు)కు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రావు తెలిపారు. సోలార్ ఐపీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.9000 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు ఆయన చెప్పారు. అలాగే తమిళనాడు గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ నుంచి 400 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎ్‌సఎస్) కాంట్రాక్ట్‌ను అందుకున్నట్లు రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి