AI Innovation India: నవ కల్పనలకు నియంత్రణలు వద్దు
ABN , Publish Date - Sep 16 , 2025 | 05:19 AM
నియంత్రణలు కృత్రిమ మేధ (ఏఐ)తో సహా టెక్నాలజీ రంగంలో అందరికీ ఉపయోగపడే నవ కల్పనలను ప్రోత్సహించేవిగా ఉండాలే తప్ప.. దెబ్బతీసేవిగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక...
బాధ్యతాయుత ఏఐ వినియోగానికి ఓకే
ఏఐతో కొన్ని ఉద్యోగాలు పోతాయి
ఏఐ నైపుణ్యాలతో కొత్త ఉద్యోగాలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: నియంత్రణలు కృత్రిమ మేధ (ఏఐ)తో సహా టెక్నాలజీ రంగంలో అందరికీ ఉపయోగపడే నవ కల్పనలను ప్రోత్సహించేవిగా ఉండాలే తప్ప.. దెబ్బతీసేవిగా ఉండకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఏఐ ఆధారిత టెక్నాలజీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అదే సమయంలో వివిధ రంగాల్లో ఏఐని బాధ్యతాయుతంగా వినియోగించేలా చూసేందుకూ కృషి చేస్తామన్నారు. ‘వికసిత భారత్ కోసం ఏఐ’ పేరుతో నీతి ఆయోగ్ రూపొందించిన ఒక నివేదికను విడుదల చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడంపై కంపెనీలు దృష్టి పెట్టాలని కోరారు. ఉద్యోగులకూ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. లేకపోతే పెద్దఎత్తున ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఏఐతో 60,000 కోట్ల డాలర్లు: పరిశ్రమల్లో ఏఐ వినియోగాన్ని వేగవంతం చేస్తే 2035 నాటికి మన జీడీపీ 6.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా. అందులో ఏఐ ద్వారా సమకూరే మొత్తమే 50,000 కోట్ల డాలర్ల నుంచి 60,000 కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.44.10 లక్షల కోట్ల నుంచి రూ.52.92 లక్షల కోట్లు) వరకు ఉంటుందని తెలిపింది. ఏఐతో కార్మికుల ఉత్పత్తి సామర్ధ్యం కూడా పెరుగుతుందని పేర్కొంది. అంతర్జాతీయంగా చూసినా ఏఐ వినియోగంతో వచ్చే పదేళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 17 నుంచి 26 లక్షల కోట్ల డాలర్ల మేర పెరగనుందని తెలిపింది. ఇందులో 10 నుంచి 15 శాతం మన దేశం ద్వారా సమకూరే అవకాశం ఉందని అంచనా వేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్లు, విస్తరిస్తున్న పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు, పెరుగుతున్న డిజిటల్, టెక్నాలజీ సామర్ధ్యాలు ఈ విషయంలో మన దేశానికి పెద్ద సానుకూల అంశాలని నివేదిక పేర్కొంది. ఏఐతో క్లరికల్, రోజువారీ ఉద్యోగాలు, పెద్దగా నైపుణ్యాలు అవసరం లేని ఉద్యోగాలు పోయినా, కొన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నీతి ఆయోగ్ అంచనా. ఏఐ వినియోగంతో ఆర్థిక సేవలు, తయారీ రంగం బాగా లబ్ది పొందబోతున్నట్టు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్
భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
For AP News And Telugu News