Share News

వ్యక్తిగత రుణమా? తాకట్టు రుణమా? ఏది బెటర్‌!

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:09 AM

అప్పులేని వాడు ఉత్తముడంటారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది అందరికీ వర్తించదు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అలాంటప్పుడు అందరి దగ్గరా సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు...

వ్యక్తిగత రుణమా? తాకట్టు రుణమా? ఏది బెటర్‌!

అప్పులేని వాడు ఉత్తముడంటారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది అందరికీ వర్తించదు. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. అలాంటప్పుడు అందరి దగ్గరా సరిపడా డబ్బులు ఉండకపోవచ్చు. అప్పుడు ఎంతో కొంత అప్పు చేయక తప్పదు. అయితే ఈ అప్పు వ్యక్తిగత రుణమా? లేక తాకట్టు రుణమా? అనేది పెద్ద ప్రశ్న.

ఒక్కోసారి కొన్ని ఆర్థిక అవసరాలు ఆకస్మికంగా వచ్చిపడుతుంటాయి. అప్పుడు ఏ హామీ లేకుండా వ్యక్తిగత రుణం తీసుకోవాలా? లేక ఆస్తులు హామీగా పెట్టి తాకట్టు రుణం తీసుకోవాలా? అనే సందేహాలు వస్తుంటాయి. ఎందుకంటే ఈ రెండింటిలో దేనిలో ఉండే లాభనష్టాలు దానిలో ఉన్నాయి. ఈ రుణాల స్వరూప, స్వభావాలు తెలుసుకుంటే.. ఎప్పుడు ఏ రుణం తీసుకోవాలో తేలికగా నిర్ణయించుకోవచ్చు. ఇప్పుడు ఒక్కో రుణంలో ఉండే లాభనష్టాలు తెలుసుకుందాం.


వ్యక్తిగత రుణాలు

ఈ రుణాల కోసం ఎలాంటి ఆస్తులను హామీగా చూపించాల్సిన అవసరం లేదు. గతంలో తీసుకున్న రుణాల్ని చక్కగా చెల్లించిన చరిత్ర, మంచి పరపతి (సిబిల్‌) స్కోరు ఉంటే చాలు. బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఈ రుణాలు ఇస్తాయి. అయినా రుణదాతలు ఈ రుణాలను కొద్దిగా రిస్కీ రుణాలుగా చూస్తారు. అందుకే మిగతా రుణాలతో పోలిస్తే ఈ రుణాలపై వడ్డీ రేట్లు కొద్దిగా ఎక్కువ.

ప్రధానాంశాలు: ఇవి పూర్తిగా హామీ లేని రుణాలు. ఈ రుణాల కోసం బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలకు ఎలాంటి ఆస్తులను హామీగా చూపాల్సిన అవసరంగానీ, తాకట్టు పెట్టాల్సిన అవసరం గానీ లేదు. కాబట్టి ఈ రుణాలు చెల్లించలేకపోయినా ఆస్తులు పోగొట్టుకుంటామనే భయం ఉండదు.

త్వరగా ఆమోదం: వ్యక్తిత రుణాల దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం. కొన్ని బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలైతే మీ ఆధార్‌, పాన్‌ కార్డు ఇస్తే చాలు. వీలైనంత త్వరగా రుణాలు మంజూరు చేసి, ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి.

వెసులుబాటు: వ్యక్తిగత రుణాలను మన అవసరాలను బట్టి ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. ఫలానా అవసరం కోసం మాత్రమే మేము ఇచ్చిన ఈ రుణాలు వాడుకోవాలని బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఆంక్షలు పెట్టవు.


గమనించాల్సిన విషయాలు..

అధిక వడ్డీ రేటు: వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు ఎలాంటి షూరిటీ లు అడగవు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించిన చరిత్ర, మంచి పరపతి స్కోరు ఉంటే చాలు. అయినా ఈ రుణాలను నష్ట భయం (రిస్క్‌) ఉన్న రుణాలుగానే పరిగణిస్తారు. దీంతో మిగతా రుణాల తో పోలిస్తే ఈ రుణాలపై వడ్డీ రేటు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు వ్యక్తిగత రుణాలపై ఆయా వ్యక్తుల పరపతి చరిత్ర, పరపతి స్కోరు ఆధారంగా 11 నుంచి 17 శాతం వరకు వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి.

రుణ పరిమితి: సెక్యూర్డ్‌ లోన్లతో పోలిస్తే హామీ లేని రుణాలను బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు కొద్ది మొత్తంలోనే ఇస్తుంటాయి. అది కూడా ఆయా వ్యక్తు ల ఆదాయం, పరపతి సామర్ధ్యాలపై ఆధారపడి ఉంటుంది.

పరపతి స్కోరు: పరపతి స్కోరు, రుణాల తిరిగి చెల్లింపు చరిత్ర ఎంత బాగుంటే అంత సులభమైన షరతులతో వ్యక్తిగత రుణాలు లభిస్తాయి. ఈ రెంటి లో ఏ మాత్రం తేడా కనిపించినా ‘సారీ, మీకు రుణం ఇవ్వడం మా వల్ల కాదు’ అని ముఖానే చెప్పేస్తాయి. లేదంటే స్కోరు ఒక మాదిరిగా ఉన్నా అధిక వడ్డీ వసూలు చేస్తాయి.


తాకట్టు రుణాలు

ఏదో ఒక ఆస్తిని తాకట్టు లేదా హామీగా చూపితే గానీ ఈ రుణాలు పొందలేం. సాధారణంగా ఈ రుణాల కోసం ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేదా ఇతర స్థిరాస్తులను హామీగా చూపించాలి. కొత్త ఆస్తుల కొనుగోలు లేదా తాకట్టులో ఉన్న ఆస్తులను విడిపించుకునేందుకు ఈ తరహా రుణాలు ఉపయోగపడతాయి.

హామీతో కూడిన రుణాలు: ఈ రుణాల చెల్లింపునకు పూర్తి హామీ ఉంటుంది. చెల్లింపుల్లో ఏ మాత్రం విఫలమైనా బ్యాంకు లేదా ఎన్‌బీఎ్‌ఫసీ హామీగా పెట్టిన ఆస్తులను వేలం వేసి తమకు రావాల్సిన ప్రతి పైసా రాబట్టుకుంటుంది. దీంతో మిగతా రుణాలతో పోలిస్తే ఈ రుణాలపై వడ్డీ రేటు తక్కువ.

ఎక్కువ రుణం: రుణ చెల్లింపునకు ఏదో ఒక ఆస్తిని హామీగా పెడుతున్నాం కాబట్టి, ఎక్కువ మొత్తంలోనే రుణం తీసుకోవచ్చు. హామీగా పెట్టే ఆస్తి విలువ ఎంత ఎక్కువ ఉంటే, బ్యాంకులు ఇచ్చే తాకట్టు రుణ మొత్తమూ అంత ఎక్కువగా ఉంటుంది.

చెల్లింపు కాలపరిమితి: వ్యక్తిగత రుణాలతో పోలిస్తే, తాకట్టు రుణాల చెల్లింపు కాలపరిమితి ఎక్కువ. దీంతో ఈఎంఐల చెల్లింపు భారం తక్కువగానే ఉంటుంది.


ఏది బెటర్‌ చాయిస్‌?

రుణ అవసరం: ఏదైనా ఆస్తి కొనుగోలుకైతే తాకట్టు రుణం మంచి చాయిస్‌. ఏదైనా వ్యక్తిగత ఖర్చు లేదా అత్యవసర ఖర్చుల కోసమైతే వ్యక్తిగత రుణాలను ఆశ్రయించడం మంచిది.

రుణ మొత్తం.. చెల్లించే సామర్ధ్యం: రుణ అవసరం ఎక్కువగా ఉండి, ఆ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్ధ్యం ఉంటే తాకట్టు రుణం తీసుకోవడం మంచిది. రుణ అవసరం కొద్ది మొత్తంలో ఉంటే వ్యక్తిగత రుణాలకు వెళ్లడం మంచి చాయిస్‌.

వడ్డీ రేటు: హామీ పెట్టడానికి అవసరమైన స్థిరాస్తులు ఉండి, తక్కువ వడ్డీ రేటుకు రుణం కావాలంటే తాకట్టు రుణాలు మంచి చాయిస్‌. ఆస్తుల హామీ లేకుండా వడ్డీ రేటు ఎక్కువైనా పర్వాలేదనుకుంటే వ్యక్తిగత రుణాలకు వెళ్లడం మంచిది.

రుణ అవసరం, వడ్డీ రేటు, పరపతి స్కోరు, పరపతి చరిత్ర ఆధారంగా ఎవరికి వారు తాకట్టు రుణం కావాలా? వ్యక్తిగత రుణం కావాలా? అనే విషయం ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అయితే తాకట్టు రుణాల చెల్లింపుల్లో ఏ మాత్రం విఫలమైనా హామీగా పెట్టిన ఆస్తులు పోతాయనే విషయం మర్చిపోకూడదు.


గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

హామీ: ఏదైనా ఆస్తిని హామీగా చూపితేగానీ తాకట్టు రుణాలు లభించవు. వీటి చెల్లింపుల్లో ఏ మాత్రం విఫలమైనా హామీగా చూపిన ఆస్తిపై ఆశలు వదులుకోవాల్సిందే.

ఎక్కువ సమయం: తాకట్టు రుణాల మంజూరుకు చాలా సమయం పడుతుంది. హామీగా చూపే ఆస్తి విలువ మదింపు దగ్గరి నుంచి ఆ ఆస్తి పత్రాలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకుని గానీ రుణాలకు ఓకే చెప్పవు. దీంతో వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తాకట్టు రుణాల మంజూరుకు చాలా రోజులు పడతాయి.

డాక్యుమెంటేషన్‌: తాకట్టు రుణాల డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ ఎక్కువ. హామీగా చూపే ఆస్తితో పాటు రుణ గ్రహీత ఆర్థిక పరిస్థితికి సంబంధించి కొన్ని పత్రాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది.



ఇవి కూడా చదవండి:

Aadhaar Update: అలర్ట్.. ఆధార్‌లో మీ నంబర్, పేరు, అడ్రస్ ఎన్నిసార్లు మార్చుకోవచ్చో తెలుసా..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Best FD Rates: సీనియర్ సిటిజన్లకు గ్యారెంటీడ్ రిటర్న్స్.. రూ. లక్ష FDపై ఎక్కడ ఎక్కువ లాభం వస్తుందంటే..

BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 23 , 2025 | 03:10 AM