Global Capability Centers Jobs India: 2030 నాటికి జీసీసీల్లో కొత్తగా 13 లక్షల ఉద్యోగాలు
ABN , Publish Date - Nov 19 , 2025 | 06:07 AM
ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు మందగిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలైతే పునర్ వ్యవస్థీకరణ లేదా నైపుణ్యాల లేమి పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే....
మొత్తం ఉద్యోగులు 34.6 లక్షలకు చేరే చాన్స్
ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు మందగిస్తున్నాయి. కొన్ని ఐటీ కంపెనీలైతే పునర్ వ్యవస్థీకరణ లేదా నైపుణ్యాల లేమి పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. అయితే అంతర్జాతీయ కంపెనీలు మన దేశంలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) మాత్రం పెద్దఎత్తున ఉద్యోగుల నియామకాలు చేస్తున్నాయి. ఏఐ ప్రభావం ఉన్నా జీసీసీల్లో కొలువుల నియామకాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాదికల్లా దేశంలోని జీసీసీల్లో పని చేసే ఉద్యోగుల సంఖ్య 11 శాతం పెరిగి 24 లక్షలకు, 2030 నాటికి 30 శాతం పెరిగి 34.6 లక్షలకు చేరుకుంటుందని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ ఒక నివేదికలో తెలిపింది. ప్రస్తుతం జీసీసీలో పనిచేస్తున్న 21.6 లక్షల ఉద్యోగులతో పోలిస్తే 2030 నాటికి మన దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 13 లక్షలు పెరుగుతుందని అంచనా వేసింది.
చిన్న నగరాల్లోనూ జీసీసీలు: నిన్న మొన్నటి వరకు మెట్రో నగరాలపైనే ఆసక్తి చూపిన జీసీసీలు ఇప్పుడు దేశంలోని అహ్మదాబాద్, కోయంబత్తూర్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపైనా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నగరాల్లో జీసీసీ లు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు మారే ఉద్యోగులు మెట్రో నగరాల్లోని జీసీసీలతో పోలిస్తే 10-12 శాతం మాత్రమే ఉండడం, ఆఫీస్ నిర్వహణ ఖర్చులు 30 నుంచి 50 శాతం తక్కువగా ఉండడం, 20 నుంచి 35 శాతం తక్కువ జీతాలకే నిపుణులైన ఉద్యోగులు దొరకడం ఇందుకు కలిసి వస్తోందని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ తెలిపింది. 2030 నాటికి దేశంలోని జీసీసీల్లో పనిచేసే ఉద్యోగుల్లో 39 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని జీసీసీల్లోనే పనిచేస్తారని కూడా ఈ నివేదిక పేర్కొంది. అప్పటికి మెట్రో నగరాల్లోని జీసీసీలు నాయకత్వం, పరిపాలన, ఆర్ అండ్ డీ కేంద్రాలుగా పనిచేస్తే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోని జీసీసీలు స్పెషలైజ్డ్ డెలివరీ కేంద్రాలుగా పని చేయనున్నాయి. దీంతో 2030 నాటికి ద్వితీయ, తృతీయ నగరాల్లోనే జీసీసీల్లోనే 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ (ఆసియా,పసిఫిక్ రీజియన్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వరుణ్ సచ్‌దేవ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు
అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ
Read Latest AP News And Telugu News