Police Inquiry: కాకాణి మెడకు ‘ఫోర్జరీ’ ఉచ్చు!
ABN , Publish Date - Mar 06 , 2025 | 04:39 AM
సర్వేపల్లి రిజర్వాయర్‌లో వైసీపీ నాయకులు గ్రావెల్ కొల్లగొట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్రనాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.
ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసిమరీ
వైసీపీ హయాంలో రూ.కోట్ల గ్రావెల్ స్వాహా
ఐదేళ్లూ బరి తెగించిన వైసీపీ ఘనులు
సర్వేపల్లి రిజర్వాయర్‌లో భారీగా తవ్వకాలు
అప్పట్లోనే కాకాణిపై తీవ్రమైన ఆరోపణలు
కొద్దిమందిపై తూతూమంత్రం కేసు
దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం
ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
బాపట్ల ఎస్పీ, డీఎస్పీ సహా పది మందితో టీమ్
(నెల్లూరు - ఆంధ్రజ్యోతి)
సర్వేపల్లి రిజర్వాయర్‌లో వైసీపీ నాయకులు గ్రావెల్ కొల్లగొట్టడానికి అనుసరించిన తప్పుడు విధానాలు ఇప్పుడు ఏకంగా ఆ పార్టీకి చెందిన అగ్రనాయకుల మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. గ్రావెల్ కొల్లగొట్టడం కోసం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకాలను సైతం ఫోర్జరీ చేశారు. అప్పట్లో దీనిపై మాగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారంలో వైసీపీ ఉండటం, అక్రమాలకు తెరలేపింది, దందాలో ఉన్నది ఆ పార్టీ ముఖ్యనాయకులే కావడంతో కేసు దర్యాప్తు మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని వైసీపీ అధిష్ఠానం భావించి కేసును పక్కన పెట్టేసింది. అయితే చేసిన పాపం ఊరకే పోదన్నట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాగుంట పెట్టిన కేసుకు మళ్లీ ప్రాణం వచ్చింది. ఫోర్జరీ సంతకాలపై మాగుంట చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పది మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. బాపట్ల ఎస్పీ పర్యవేక్షణాధికారిగా, బాపట్ల డీఎస్పీ పరిశోధనాధికారిగా ఉన్న సిట్ బృందం రెండు రోజుల క్రితం రంగంలోకి దిగింది. నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయం, వెంకటాచలం పోలీసు స్టేషన్లలో ఈ కేసుకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. మాగుంట సంతకాలను ఫోర్జరీ చేసింది ఎవరు, చేయించింది ఎవరు, వెనుకనుండి కథ నడిపిన శక్తి ఎవరు? అనే విషయాలను లోతుగా దర్యాప్తు చేయనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇరుకున పడనున్నారనే ప్రచారం ఊపందుకుంది.
జరిగింది ఇదీ...
వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా సహజ వనరులను కొల్లగొట్టారు. సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి భారీ ఎత్తున గ్రావెల్ దోపిడీ జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రి కూడా కావడంతో గ్రావెల్ దందా అడ్డూఅదుపు లేకుండా సాగింది. రకరకాల వ్యక్తులు, సంస్థల పేర్లతో ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకొని గ్రావెల్‌ను బ్లాక్‌లో అమ్ముకున్నారు. రైల్వే ట్రాక్‌ల నిర్మాణాలు, జాతీయ రహదారుల నిర్మాణాలతోపాటు ‘జగనన్న లే అవుట్ల’ చదును కార్యక్రమాలకు పెద్ద ఎత్తున గ్రావెల్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే దీని ధర బంగారమయ్యింది. సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు దీనిని అవకాశంగా తీసుకొని సర్వేపల్లి రిజర్వాయర్‌పై కన్నేశారు. అధికార పార్టీ పలుకుబడితో అప్పట్లో రకరకాల పేర్లతో దొంగ పర్మిట్లు తీసుకొని గ్రావెల్ కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే 2021 జూన్ 18వ తేదీన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరుతో కూడా వెయ్యి టన్నుల మట్టికి అనుమతులు ఇచ్చారు. ఈ బరితెగింపే ఇప్పుడు వైసీపీ అగ్రనాయకుల మెడకు ఉచ్చులా చుట్టుకుంది.
మాగుంట ఫిర్యాదుతో ఉలికిపాటు
సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి ఇష్టారీతిగా గ్రావెల్ తరలింపును తెలుగుదేశం నేత, నాటి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకత్వంలో నాయకులు నిరసించారు. రిజర్వాయర్‌లో అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో ఇరిగేషన్ అధికారులకు విచారణ జరపక తప్పలేదు. రిజర్వాయర్‌ను పరిశీలించి అనుమతులకు మించి తవ్వకాలు జరిపింది నిజమేనని నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ నాయకులు దొంగ పర్మిట్లతో వెళుతున్న టిప్పర్లను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ప్రజలు, ప్రతిపక్షం నుంచి తిరుగుబాటు ఎక్కువ కావడంతో అధికారులు రంగంలోకి దిగి ముగ్గురిపై వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిలో మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా ఒకరు. అయితే అప్పటివరకు మాగుంట ఎంపీ అనే విషయం ఎవరికీ తెలియదు. పర్మిట్లు ఇచ్చిన ఇరిగేషన్ శాఖకూ తెలియదు. తనకు వెయ్యి టన్నుల గ్రావెల్ అవసరం అవుతుందని ఎంపీ మాగుంట ఇరిగేషన్ శాఖకు లేఖ రాసినట్లు, దాని ఆధారంగా అనుమతులు ఇచ్చినట్లు రికార్డులు బయటపడ్డాయి. మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలనుకూడా స్థానిక వైసీపీ నాయకులు ఫోర్జరీ చేశారనే విషయం చాలాఆలస్యంగా తెలిసింది.
వివాదమయ్యింది ఇలా...
వెంకటచలం స్టేషన్‌లో కేసు నమోదు అయిన నేపధ్యంలో పోలీసులు నోటీసులు తీసుకొని మాగుంట వద్దకు వెళ్లారు. తనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో తన పేరు చేర్చి నోటీసులు తీసుకొచ్చిన పోలీసులపై మాగుంట విరుచుకుపడ్డారు. ఆ వెంటనే తన సంతకాలు ఎవరో ఫోర్జరీ చేశారని. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు పిర్యాదు చేశారు. అప్పుడు ఆయన అధికార వైసీపీకి చెందిన ఎంపీ కావడం విశేషం.
ఈ దందాపై టీడీపీ నేతలు సోమిరెడ్డి నాయకత్వంలో పెద్దఎత్తున ఉద్యమించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యమాలు చేశారు. లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ సంతకాలను ఫోర్జరీ చేయడం, దానిపై సాక్షాత్తు ఆ ఎంపీనే పోలీసులకు పిర్యాదు చేయడంతో వివాదం పెద్దదయ్యింది. దీంతో మాగుంట ఫిర్యాదును వైసీపీ అధినాయకత్వం తొక్కిపెట్టింది. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఈ ఫోర్జరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
కాకాణి అండతోనే..
గత వైసీపీ ప్రభుత్వంలో సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డే సర్వాధికారి. సర్వేపల్లి రిజర్వాయర్ గ్రావెల్ దోపిడీకి సైతం కాకాణి సహాయ, సహకారాలు పూర్తిగా ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కాకాణి అండ లేకుంటే ఎంపీ మాగుంట సంతకాలు ఫోర్జరీ చేసే సాహసం ఎవరూ చేయలేరనే వాదన కూడా ఉంది. ఈ కోణంలోనే సిట్ దర్యాప్తు సాగనున్నట్లు తెలుస్తోంది.