Property Registration Scam : ‘ఎనీవేర్’లో 156 కోట్ల అక్రమాలు!
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:40 AM
వైసీపీ హయాంలో తెచ్చిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల’ ముసుగు లో సాగించిన భారీ దందాల గుట్టు పూర్తిగా రట్టయింది.

శ్రీకాంత్ కుటుంబం పేరుతో ఇలా 40 డాక్యుమెంట్లు
‘ఇబ్రహీంపట్నం’ భూవ్యవహారంలో తేల్చిన అధికారులు
అమరావతి, విజయవాడ, జనవరి 6(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తెచ్చిన ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల’ ముసుగు లో సాగించిన భారీ దందాల గుట్టు పూర్తిగా రట్టయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ర్టార్ లాలా బాలనాగధర్మ సింగ్ రాసిన లేఖ ఆధారంగా విచారించి ప్రభుత్వానికి రిజిస్ర్టేషన్ల శాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. సాధారణంగా ఏదైనా ఒక ఆస్తి ఒకరిపేరు నుంచి మరొకరి పేరుకు బదిలీ అయ్యే క్రమంలో విక్రేత లేదా దాత ఉండటం ముఖ్యం. కానీ ఇబ్రహీంపట్నం పరిధిలో అధిక భాగం లావాదేవీలు వారెవరూ లేకుండానే జరిగిపోయాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దందాలో మొత్తం రూ.156 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు.
నివేదికలోని ముఖ్యాంశాలు..
చీమకూర్తి శ్రీకాంత్, ఆయన తండ్రి శేషుబాబు, సతీమణి వనం దివ్య తదితర కుటుంబ సభ్యులు, బంధువు ల పేరుమీద మొత్తం 40 డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్ లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వలెక్కల ప్రకారం వీటి విలువ రూ.106 కోట్లు. స్థానికంగా ఉన్న భూమి ధరల ప్రకారం వాటి విలువ రూ.156 కోట్లు.
ఆదాయపన్ను నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక స్తిరాస్థిని అమ్మినప్పుడు లేక కొన్నప్పుడు దాటి విలువ రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో జరిగిన భూక్రయవిక్రయాల లావాదేవీ ల్లో పాన్ నంబర్ ఎక్కడా లేదు. ఈ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో పూర్తిగా నగదు చేతులు మారింది.
డాక్యుమెంట్లను ఎలాంటి సహేతుక కారణం లేకుండా అత్యవసర ప్రాతిపదికన రిజిస్ర్టేషన్ చేశారు. ఇలా చేయడం ఆ లావాదేవీల్లోని డొల్లతనానికి నిదర్శనం.
అన్నీ తెలిసీ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగ్ అప్ప ట్లో ఈ రిజిస్ర్టేషన్లు చేశారు. లోతుగా ఆయనపై విచారణ జరపాలి.
అదిరిపోయే ‘లింకు’
శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో జరిగిన రిజిస్ర్టేషన్లకు సంబంధించిన కొన్నింటికి లింక్ డాక్యుమెం ట్లు లేకుండానే రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఆస్తి తమదే అని చెప్తున్నప్పటికీ వాటి యాజమాన్య హక్కుల బదిలీ నిబంధనల ప్రకారం జరగలేదు. ఉదాహరణకు 2021 మార్చి 31న డాక్యుమెంట్ నంబర్ 3469/2021ను గుణదల సబ్‌రిజిస్ర్టార్ నమోదు చేశారు. దీని లింక్ డాక్యుమెంట్ నెంబర్ 3030/2021ను కూడా అదే కార్యాలయంలో అదే రోజు రిజిస్ర్టేషన్ చేశారు. 2021 ఆగస్టు 12న డాక్యుమెంట్ నంబర్ 7027ను నమోదు చేశారు. దీని లింక్ డాక్యుమెంట్ నంబర్ 7022/2021ను కూడా అదే రోజున రిజిస్ర్టేషన్ చేశారు.