YSRCP Job Scam: నాటి తప్పులకు.. నేడు శిక్ష
ABN , Publish Date - May 20 , 2025 | 05:52 AM
వైసీపీ హయాంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన దుర్వినియోగానికి ఇప్పుడు సిబ్బంది విలవిలలాడుతున్నారు. దొంగ మస్టర్లు వేయించిన కారణంగా శిక్షలు పడుతూ ఉద్యోగాలు పోతున్నాయి.
ఉపాధి పథకంలో వైసీపీ ప్రభుత్వం పాపాలు
మెటీరియల్ నిధుల కోసం ఒత్తిడి చేసి దొంగ మస్టర్లు
ఇప్పుడు సోషల్ ఆడిట్ తనిఖీలతో సిబ్బంది విలవిల
బాధ్యులైన వందల మందిపై వేటు.. భారీగా రికవరీలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ సర్కార్ ఉపాధి హామీ పథకం నిర్వహణలో చేసిన తప్పిదాలు ఇప్పుడు ఉపాధి సిబ్బంది ఉద్యోగాలకు చేటు తెస్తున్నాయి. మెటీరియల్ నిధుల కోసం సిబ్బందిపై ఒత్తిడి చేసి దొంగ మస్టర్లు వేయించిన ఫలితంగా ఇప్పుడు వారు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. సోషల్ ఆడిట్ తనిఖీల్లో మస్టర్లకు సంబంధించిన పనులు క్షేత్రస్థాయిలో జరిగినట్లు కనిపించకపోవడంతో ఆ రికవరీని సిబ్బందిపై విధిస్తున్నారు. చెల్లించని కొంతమందిపై పోలీసు కేసులు కూడా నమోదవుతున్నాయి. ఒక్కో జిల్లాలో వందల మంది సిబ్బంది సస్పెండ్ అయి డ్వామా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో విచారణకు ఆదేశిస్తున్నారు. పత్రికల్లో కథనాలు, ఫిర్యాదుల మోతతో ఉపాధి అధికారులు తప్పనిసరిగా విచారణ చేపట్టి, రికవరీలు చేయాల్సి వస్తోంది. దీంతో సిబ్బంది ఇరుక్కుపోతున్నారు. అప్పటి ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చి మస్టర్లు వేయించిందని, ఒత్తిడి చేసిన అధికారులు ఇప్పుడు లేకపోవడం, ఒకవేళ ఉన్నా నిస్సహాయ స్థితిలో ఉండటంతో తాము బలవుతున్నామని వాపోతున్నారు.
దొంగ మస్టర్లు వేయాలంటూ ఒత్తిళ్లు
గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం పనులు సక్రమంగా జరిగిన దాఖలాల్లేవు. మండల కార్యాలయాల్లో ఆపరేటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు కంప్యూటర్ ముందు కూర్చొని మస్టర్లు నమోదు చేశారు. రాష్ట్రస్థాయి నుంచి టార్గెట్లు పెట్టి మరీ మస్టర్లు వేయించారు. కేంద్రం నుంచి మెటీరియల్ నిధులు రాబట్టుకునేందుకు లేబర్ కాంపోనెంట్ పెంచుకోవాలనే ప్రయత్నంలో భాగంగా దొంగ మస్టర్లు వేయించారు. దీంతో కూలీలు పనులకు వెళ్లకపోయినా వేతనాలు పడ్డాయి. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కూడా అదే సిబ్బంది కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా గతంలానే మస్టర్లు వేయాల్సిన పరిస్థితి! దొంగ మస్టర్లు వేయకపోతే సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. అప్పట్లో వేసి, ఇప్పుడు ఎందుకు వేయరని నిలదీస్తున్న, గొడవకు దిగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పథకంలో లొసుగులు లేకుండా కట్టడి చేసేందుకు ఇప్పటికే సోషల్ ఆడిట్ డైరెక్టర్‌ను మార్చడంతో పాటు ఉపాధి పథకానికి చీఫ్ విజిలెన్స్ అధికారిగా పోలీసు శాఖకు చెందిన అదనపు ఎస్పీని నియమించారు.
సోషల్ ఆడిట్ తనిఖీలతో విలవిల
గత ప్రభుత్వంలో చేపట్టిన పనులపై సోషల్ ఆడిట్ బృందాలు ఇటీవల తనిఖీలు చేపట్టాయి. పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని సోషల్ ఆడిట్ డైరెక్టర్ శ్రీకాంత్ ఆదేశించారు. 2023-24, 2024-25ల్లో చేపట్టిన పనులకు సంబంధించి తనిఖీలు చేపట్టినప్పుడు.. ఫీల్డ్‌లో పనులు చేసిన ఆనవాళ్లు లేదు. దీంతో అప్పట్లో శ్రామికులకు చెల్లించిన మొత్తాన్ని ఉపాధి సిబ్బందిపై రికవరీ వేస్తున్నారు. ఒక్కో మండలంలో రూ.కోట్ల రికవరీలను సోషల్ ఆడిట్ మండల సభలో తేలుస్తున్నారు. దీంతో బాధ్యులైన సిబ్బందికి రికవరీలు వేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడంతో వారంతా గగ్గోలు పెడుతున్నారు. అప్పట్లో దొంగ మస్టర్లు చేయాలని ఒత్తిడి తెచ్చిన అధికారి గాని, వైసీపీ నేతలు గానీ ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.
డ్వామా, కమిషనరేట్ కార్యాలయం చుట్టూ సిబ్బంది
ఉద్యోగాలు కోల్పోయిన సిబ్బంది డ్వామా, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీలు ఫైనల్ కావడంతో జిల్లా విజిలెన్స్ అధికారులు మరోసారి ఆ పనులపై తనిఖీలకు ఆదేశించకుండా రికవరీలు విధిస్తున్నారు. దీంతో సిబ్బంది ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. అప్పటి సర్కారే తమకు ఈదుస్థితి తీసుకొచ్చిందని నిందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం అర్థం చేసుకుని, ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఉద్యోగాలు పోయి రోడ్డున పడ్డామని, తమకు ఉద్యోగాలు తిరిగివ్వాలని కమిషనర్ కృష్ణతేజ, ఆయా డ్వామా పీడీలకు విజ్ఞప్తి చేస్తున్నారు.