Share News

YSRCP: చంపుతాం.. నరుకుతాం!

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:27 AM

ఒక రాజకీయ పార్టీ ఇలా ఉంటుందా... ఒక పార్టీ కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తారా... ఒక పార్టీ అధ్యక్షుడికి పద్ధతీ పాడూ ఉండక్కర్లేదా... అని జనం ఈసడించుకునే స్థాయిలో వైసీపీ క్షుద్ర రాజకీయం చేస్తోంది.

YSRCP: చంపుతాం.. నరుకుతాం!

వైసీపీ హయాంలో పోలీసుల చేతిలో నడిరోడ్డుపై హింసకు గురైన డాక్టర్‌ సుధాకర్‌ లాంటి వారిని పరామర్శిస్తే ఒక అర్థముంది. కానీ... రెచ్చిపోతున్న రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించిన పోలీసులను తప్పుపట్టి, అదే రౌడీషీటర్లను పరామర్శించే వారిని ఏమనాలి?

పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి విగ్రహం పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు! వారి కుటుంబాన్ని పరామర్శించవచ్చు. కానీ... వైసీపీ గెలుస్తుందని జనం సొమ్ముతో బెట్టింగులు పెట్టి, ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత ఓదార్చే వారిని ఏమంటారు?

ప్రజాస్వామ్యబద్ధంగా చేసే నిరసనలు, ఆందోళనలకు పోలీసులు అనుమతించకపోయినా, అపరిమితమైన ఆంక్షలు విధించినా కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ... ‘మాకు అనుమతులే అక్కర్లేదు. ఆంక్షలను పట్టించుకోం’ అని రెచ్చిపోయే నేతలను ఎలా చూడాలి?

వైసీపీ కార్యకర్తల ‘నరుకుడు’ భాష

  • జగన్‌ పర్యటనల్లో ఫ్లెక్సీలు పెట్టి బెదిరింపులు

  • పొదిలిలో.. తొక్కి పడేస్తామని హుంకరింపు

  • సత్తెనపల్లిలో ‘రప్పా రప్పా’ అంటూ డైలాగులు

  • రాజారెడ్డి రాజ్యాంగం తెస్తామని ప్రకటనలు

  • రౌడీ షీటర్లకు పరామర్శల పేరిట అరాచకం

  • బెట్టింగ్‌లతో ఆత్మహత్య చేసుకుంటే విగ్రహం

  • జగన్‌ తీరు చూసి జనంలో విస్మయం

  • ముదురుతున్న వైసీపీ క్షుద్ర రాజకీయం

(అమరావతి - ఆంధ్రజ్యోతి): మొన్న: తెనాలిలో గంజాయి బ్యాచ్‌, రౌడీ షీటర్ల పరామర్శకు బయలుదేరినా..

నిన్న: పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ పేరుతో వేలాది మందితో దండయాత్ర చేసినా...

నేడు: సత్తెనపల్లిలో ఏడాది క్రితం ఇతరుల సొమ్ముతో బెట్టింగ్‌ ఆడి కోట్లు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి విగ్రహావిష్కరణ, పరామర్శకు వెళ్లినా...

ప్రతిచోటా ‘వైసీపీ మార్కు’ అరాచకమే! వికృత రూప ప్రదర్శనే!

ఒక రాజకీయ పార్టీ ఇలా ఉంటుందా... ఒక పార్టీ కార్యకర్తలు ఇలా వ్యవహరిస్తారా... ఒక పార్టీ అధ్యక్షుడికి పద్ధతీ పాడూ ఉండక్కర్లేదా... అని జనం ఈసడించుకునే స్థాయిలో వైసీపీ క్షుద్ర రాజకీయం చేస్తోంది. నిరసన పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. ప్రతిపక్షాలకు అది అవసరం కూడా! అయితే... నిరసన చేసేందుకు కొన్ని పద్ధతులున్నాయి. వైసీపీకి మాత్రం ఎలాంటి పద్ధతీ లేదు. పార్టీ అధ్యక్షుడు జగన్‌ అబద్ధాలు, అర్ధసత్యాలతో ప్రభుత్వంపై బురదజల్లుతూ, పోలీసులను బెదిరిస్తుండగా... ఆయన పార్టీ కార్యకర్తలు ఏకంగా ‘నరుకుడు’ భాషను బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు.


ఇదేం భాష...

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులే వైసీపీ రాజ్యాంగం! దాడులే... ఆ పార్టీ విధానం! ఇప్పుడు... అది మరింత శ్రుతిమించింది. విపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఉన్నా ‘మళ్లీ అధికారంలోకి వచ్చాక... చంపేస్తాం, నరికేస్తాం’ అని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. ‘‘ఎవడైనా రానీ.. తొక్కి పడేస్తాం! 2029లో వైఎస్సార్‌సీపీ వచ్చిన వెంటనే.. గంగమ్మతల్లి జాతరలో వేట తలలు నరికినట్టు.. రప్పా రప్పా నరుకుతాం నా కొడకల్లారా! వైఎస్‌ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలు, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు!’ అంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తెనాలి, పొదిలి, సత్తెనపల్లి పర్యటనల్లో ఇవి కనిపించాయి. జగన్‌ పర్యటనలు, ఆ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ వికృతరూపానికి నిదర్శనమని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.

ఇదేనా రాజకీయం...

ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఆందోళనలు, నిరసనలకు పిలుపునివ్వడం ప్రతిపక్షాలు సర్వసాధారణంగా చేసే పనే! కానీ... జగన్‌ ఇప్పుడు చేస్తున్న ‘ఆందోళనలు’ వేరు. తెనాలిలో రౌడీ షీటర్లను పరామర్శించారు. పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ పేరిట బలప్రదర్శనకు దిగారు. ఇక... బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటన మరింత నీచం, ఘోరం! ఎప్పుడో ఏడాది కిందట... వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న నాయకుడి కుటుంబాన్ని జగన్‌ ఇప్పుడు పరామర్శించారు. అందులోనూ అడుగడుగునా అరాచకమే! సున్నితమైన ప్రాంతం, ఇరుకైన వీధులు... ఎక్కువమంది కాకుండా వందమందికే పర్యటనను పరిమితం చేసుకోండి అని పోలీసులు స్పష్టం చేసినా జగన్‌ పట్టించుకోలేదు. ‘అంతా నా ఇష్టం’ అనేలా వ్యవహరించారు. వందల వాహనాలు, వేలమందితో బలప్రదర్శనకు దిగారు.


నాడు అడుగేస్తే ఆంక్షలు..

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. విపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కనీసం జిల్లాల్లో పర్యటనలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబునే అడుగడుగునా ఆంక్షలతో అడ్డుకున్నారు. నాటి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ ఏకంగా జీవో నంబరు 1ని విడుదల చేశారు. 2023 ఆగస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టు సందర్శనలో భాగంగా అన్నమయ్య జిల్లాలో అంగళ్లు కూడలి వద్దకు చేరుకున్న సమయంలో... పోలీసులు ఆయన్ను అడ్డుకోవడమే కాకుండా హత్యాయత్నం కేసుతోపాటు రోడ్‌షోలో హింసను ప్రేరేపించారంటూ మొత్తం 254 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసు పెట్టారు. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పెట్టడం గమనార్హం. అంతకుముందు 2023 ఫిబ్రవరిలో చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనలోనూ పోలీసులు దారుణంగా వ్యవహరించారు. అనపర్తిలో చంద్రబాబు సభకు తొలుత అనుమతి ఇచ్చి... ఆ తర్వాత అనుమతి లేదంటూ అడ్డం తిరిగారు. సామర్లకోట నుంచి అనపర్తి వస్తున్న చంద్రబాబును బలభద్రపురం వద్ద అడ్డుకున్నారు. అయినా వెనక్కి తగ్గని చంద్రబాబు సుమారు 8 కిలోమీటర్లు కాలినడకనే అనపర్తికి చేరుకున్నారు. చిమ్మచీకటిలో గంట పదిహేను నిమిషాలు సెల్‌ఫోను లైట్లలోనే చంద్రబాబు నడుచుకుంటూ సభాస్థలి వద్దకు చేరుకున్నారు. ఇప్పుడు... అనుమతులతో తనకు పనిలేదని, ఆంక్షలు తనను అడ్డుకోలేవని జగన్‌ విచ్చలవిడిగా చెలరేగుతున్నారు. మందీమార్బలంతో జగన్‌ చేసిన హడావిడికి బుధవారం రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి.


సైకోతత్వం...

  • ఎన్నికల సమయంలో ‘సిద్ధం’ సభల ప్రాంగణంలో చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీలు పెట్టి వాటిని వైసీపీ కార్యకర్తల చేత కొట్టించి శాడిజం చాటుకున్నారు.

  • ఇటీవల జోగి రమేశ్‌ కుమారుడి వివాహ వేడుక సందర్భంగా... విజయవాడ ఇబ్రహీంపట్నంలో సైకిల్‌ తొక్కుకుంటూ వెళుతున్న చిన్న పిల్లాడిని తోసేసి, సైకిల్‌ లాక్కుని దాన్ని గాల్లో తిప్పి, నేలకేసి కొట్టి పైశాచికానందం పొందారు.

  • ఈనెల 3న తెనాలిలో రౌడీ షీటర్లను జగన్‌ పరామర్శించి తన మార్కు రాజకీయాన్ని చాటుకున్నారు.

  • ఈనెల 11న పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ.. 15వేల పైచిలుకు మందితో దండయాత్ర చేశారు. ఆ సమయంలో రాజధానిపై జగన్‌ బ్యాచ్‌ చేసిన వ్యాఖ్యలకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపైన, పోలీసులపైన వైసీపీ మూకలు దాడులు చేశాయి. ఈ కేసులో 24 మందిని అరెస్టు చేయగా... వారిలో 9 మందికి నేరచరిత్ర ఉన్నట్లు స్పష్టమైంది. వైసీపీ నేరగాళ్ల అడ్డా అనేందుకు ఇదే నిదర్శనమని టీడీపీ నేతలు చెబుతున్నారు.


ఐదేళ్లు అదేగా చేసింది!

గుంటూరు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాం రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించింది. టీడీపీ అగ్ర నేతలు మొదలు సామాన్య కార్యకర్తల వరకు జెండా పట్టుకోవడానికి వణికిపోయే పరిస్థితులు కల్పించారు. కేసులు, అరెస్టుల పేరుతో బీభత్సం సృష్టించారు. పల్నాడు ప్రాంతంలో చంద్రయ్య, జల్లయ్య మొదలు ఎంతోమంది నాయకులు కార్యకర్తలను వెంటాడి నరికి చంపారు. చంద్రబాబు మొదలుకొని అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్‌, అయ్యన్నపాత్రుడు, అలాగే నాటి వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా అరెస్టు చేసి జైలుకు పంపి వేధించారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ రంగనాయకమ్మ, వెంగళరావు మొదలు వందలాది మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆ అరాచకాలను భరించలేకే... ఎన్నికల్లో వైసీపీకి జనం బుద్ధి చెప్పారు. ఇంతటి దారుణ పరాజయం చవిచూసిన తర్వాత కూడా... వైసీపీలో మార్పు లేకపోవడం గమనార్హం. పైగా... నరికేస్తాం, చంపేస్తాం అని హెచ్చరిస్తుండటం ఆ పార్టీ నైజానికి అద్దం పడుతోంది. నేర చరితులకు, నేరగాళ్లకు అండగా ఉంటామని జగన్‌ స్పష్టమైన సంకేతాలు పంపుతుండటంతో... ఆయా శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి.


పోలీసులు ఏం చేస్తున్నారు?

జగన్‌ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ‘గోబ్యాక్‌’ అని అక్కడక్కడ పెట్టిన ఫ్లెక్సీలను పోలీసులు రాత్రికి రాత్రి తొలగించారు. కానీ... చంపేస్తాం, నరికేస్తాం అని ప్లకార్డులు ప్రదర్శిస్తూ వీరంగం తొక్కుతున్న వైసీపీ శ్రేణులను మాత్రం అడ్డుకోలేకపోయారు. వైసీపీ హయాంతో పోల్చితే... ఇప్పుడు పోలీసులు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసు అధికారులు నేటికీ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 05:28 AM