YS Jagan: నేను మీడియాతో మాట్లాడింది ప్రజలకు వినిపించండి
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:19 AM
‘‘వారం క్రితం నేను దాదాపు 2 గంటలపాటు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో మాటలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వినిపించండి.
ఎన్నికల హామీల విలువ జనానికి చెప్పండి
పార్టీ ముఖ్య నేతలకు వైఎస్ జగన్ ఆదేశం
‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమం ప్రారంభం
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘‘వారం క్రితం నేను దాదాపు 2 గంటలపాటు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో మాటలను ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వినిపించండి. గత ఏడాది గా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విలువెంతో చెప్పి.. చంద్రబాబును బాకీ లు తీర్చమని డిమాండ్ చేయమనండి’’ అని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 5 వారాలపాటు నిర్వహించే ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం జగన్ మాట్లాడుతూ.. 5 వారాల పాటు జిల్లా, రెవె న్యూ డివిజన్, మండల, గ్రామ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీలు, బాండ్లను గురించి ప్రజలకు గు ర్తు చేయాలన్నారు. గత ఏడాది జూన్ నుంచి ప్రభుత్వ పథకాలు రాకపోవడం వల్ల చంద్రబాబు ఎంత బకాయిపడ్డారో ప్రతి ఇంటికీ వెళ్లి లెక్కలతో సహా వివరించాలని సూచించారు. తమ బకాయిలు ఎప్పుడు తీరుస్తావంటూ చంద్రబాబును నిలదీసేలా ప్రజలను సిద్ధం చేయాలని పార్టీ నేతలకు ఆదేశించారు. తాను ఐదేళ్లలో వివక్షలేని పాలన చేశానని, పథకాల అమలులో కులం, మతం, పార్టీ చూడలేదని చెప్పారు. చంద్రబాబు రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఏడాది కాలంగా సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత పాలన సాగుతోందని విమర్శించారు.